Vijay Meets CM KCR: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ బుధవారం హైదరాబాద్‌కు వచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను నటుడు విజయ్ కలిశారు. బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్‌కి వెళ్లి మరీ సీఎం కేసీఆర్‌ను కలిశారు విజయ్‌.  ఈ సందర్భంగా ఇరువురు పరస్పర పుష్పగుచ్ఛాలు ఇచ్చుకున్నారు. నటుడు విజయ్‌ కి శాలువా కప్పి సత్కరించారు సీఎం కేసీఆర్. కోలీవుడ్ హీరోకు ఓ వీణను బహూకరించారు కేసీఆర్. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను తాను మర్యాదపూర్వకంగా కలిశానని, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవన్నారు. 






తమిళ సినీ హీరో విజయ్ ఈరోజు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారని తెలంగాణ సీఎంవో ట్వీట్ చేసింది. కాగా, దళపతి విజయ్‌, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం బీస్ట్‌ ఇటీవల విడుదలైంది. 






సాధారణంగా విజయ్ సినిమాలు కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర విధానాలను ప్రశ్నించే విధంగా ఉంటాయి. కొన్ని సందర్భాలలో సమస్యలపై అంశాలను సైతం నటుడు లేవనెత్తడం, వాటిపై తమిళనాడులో రాజకీయ దుమారం రేగడం తెలిసిందే. అలాంటి నటుడు.. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై ఎలాంటి పరిస్థితుల్లోనైనా విమర్శలు గుప్పించే తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.