అధికార టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. డా. బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి),  దీవకొండ దామోదర్ రావు లను టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. టీఆర్ఎస్ ప్రకటించిన ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులలో ఒకరు ఫార్మా దిగ్గజం, మరొకరు గ్రానైట్ వ్యాపారి కాగా, మరొకరు పత్రికా రంగంలో సేవలు అందిస్తున్న వ్యక్తి కావడం విశేషం.


టీఆర్ఎస్ పార్టీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థులలో ఒకరు దీవ‌కొండ దామోద‌ర్ రావు న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక ఎండీగా ఉన్నారు. డాక్ట‌ర్ బండి పార్థ‌సార‌థి రెడ్డి ఫార్మా సంస్థ హెటిరో అధిప‌తి, సంస్థ ఎండీగా సేవలు అందిస్తున్నారు. గ్రానైట్ వ్యాపారి వద్దిరాజు ర‌విచంద్ర‌(గాయ‌త్రి ర‌వి) పేర్ల‌ను సీఎం కేసీఆర్ వెల్ల‌డించారు.






వైద్య, విద్యా రంగాల్లో పార్థసారథి సేవలు.. 
బండి పార్థ‌సార‌థిరెడ్డి స్వస్థలం ఖ‌మ్మం జిల్లా స‌త్తుప‌ల్లి. వేంసూరు మండ‌లం కందుకూరులో జ‌న్మించిన పార్థ‌సార‌థి రెడ్డి హెటిరో డ్ర‌గ్స్ వ్య‌వ‌స్థాప‌కుడు. ఆయనకు భార్య‌, ఓ కుమారుడు ఉన్నారు. డిగ్రీ పూర్తి చేసిన తరువాత ఓ ప్రైవేట్ కంపెనీల్ జాబ్ చేస్తూనే ఫార్మా సంస్థను ఆయన స్థాపించారు. ప‌లు విద్యాసంస్థ‌లు స్థాపించి విద్యావేత్త‌గానూ రాణిస్తున్నారు. ప్రజలకు ఎంతో కీలకమైన వైద్యం, విద్య రంగాల్లో ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా టీఆర్ఎస్ పార్టీ పార్థసారథిరెడ్డిని రాజ్యసభకు పంపుతోంది. 


పత్రిక అధిపతి దీవ‌కొండ దామోద‌ర్ రావు..
న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక ఎండీ దీవ‌కొండ దామోద‌ర్ రావు స్వస్థలం జ‌గిత్యాల జిల్లా బుగ్గారం మండ‌లం మద్దునూరు. తెలంగాణ ఉద్య‌మంలో తొలినాళ్ల నుంచి నేటి సీఎం కేసీఆర్ వరకు.. పలువురు నేతల వెంట నడిచారు. టీఆర్ఎస్ పార్టీలో పొలిట్ బ్యూరో స‌భ్యుడిగా, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా, పార్టీ సెక్ర‌ట‌రీ ఫైనాన్స్‌గా సేవలు అందించారు. దామోద‌ర్ రావుకు భార్య‌, కూతురు, కుమారుడు ఉన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమలో కీలక పాత్ర పోషించిన టీ న్యూస్, న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక‌ల స్థాపంలో కీలక పాత్ర ఆయనది. తెలంగాణ బ్రాడ్ కాస్టింగ్‌ (టీ న్యూస్ చానెల్‌)కు తొలి మేనేజింగ్ డైరెక్ట‌ర్‌ ఆయన.