Revanth Reddy On CM KCR : రైతులు చనిపోతే డబ్బులు ఇవ్వడం సరైంది కాదని, రైతులు చనిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 30 రోజుల్లోనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. బుధవారం విలేకరులతో రేవంత్ రెడ్డి మీట్ ద ప్రెస్ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ తరహాలో వృథా ఖర్చులు చేయదన్నారు. ధరణిలో సవరణలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. పోడు భూములను గిరిజనులకు పంచడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదన్నారు. భూమి కోసం విప్లవం వచ్చిన ఏకైక ప్రాంతం తెలంగాణ అన్న రేవంత్ రెడ్డి,  తెలంగాణ సాయుధ పోరాటాలు ప్రపంచం మరిచిపోదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 81 ప్రాజెక్టులను నిర్మాణం తలపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. 


మరో శ్రీలంకలా తెలంగాణ 


రైతులను దోపిడీ చేస్తున్న వివాదానికి అడ్డుకట్ట వేసే చట్టాలు కాంగ్రెస్ పార్టీ తెచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు.  ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ దివాలా తీయించారని ఆరోపించారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశంలో అభివృద్ధి జరిగిందన్నారు.  60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రూ.69 వేల కోట్లు అప్పు చేస్తే, సీఎ కేసీఆర్ 7 ఏళ్ల పాలనలో రూ.5 లక్షల కోట్ల అప్పు చేశారన్నారు. కాంగ్రెస్ పాలనలో మిగులు బడ్జెట్ ఉంటే  కేసీఆర్ అప్పులపాలు చేశారన్నారు. శ్రీలంక పరిస్థితి తెలంగాణలో తెస్తున్నారన్నారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స కుటుంబంపై జరిగిన దాడే కేసీఆర్ కుటుంబానికి రాబోతోందని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. 



12 నెలల్లో అధికారంలోకి వస్తాం 


"60 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ తెచ్చిన రైతు విప్లవాలను సీఎం కేసీఆర్ విధ్వంసం చేశారు. తెలంగాణలో చెరుకు, కందులు, పత్తి, మాయమైంది. ఇప్పుడు వరికి మాత్రమే రైతులు పరిమితం అవుతున్నారు. కేసీఆర్ నీళ్లు ఇస్తే 30 లక్షల పంపుసెట్లు ఎందుకు ఇంకా ఉన్నాయి. 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే  రైతు డిక్లరేషన్ వందశాతం అమలు చేస్తాం. రైతు డిక్లరేషన్ అమలు చేసేందుకు బాధ్యత నాదే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 30 రోజుల్లోనే 2 లక్షల రుణమాఫీ చేస్తాం." అని రేవంత్ రెడ్డి అన్నారు.