MLC Kavita On Congress : ప్రాంతీయ పార్టీల ఆవశ్యకతను కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టీ కారణంగానే అధికారంలో ఉన్నారన్నారు. ప్రాంతీయ పార్టీలకు స్పష్టమైన ఎజెండా ఉందని కవిత అన్నారు. ఏఎన్ఐతో మాట్లాడిన ఆమె ఈ కామెంట్స్ చేశారు. ప్రజల సంక్షేమం కోసం ప్రాంతీయ పార్టీలకు నిర్దిష్టమైన ఎజెండా ఉంటుందన్నారు. రాహుల్ గాంధీ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలో ఉండడానికి ప్రాంతీయ పార్టీల సపోర్టే కారణమన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఓ తోక పార్టీగా మారిందన్నారు. రాబోయే రోజుల్లో దేశంలోనూ కాంగ్రెస్ తోక పార్టీగా మిగులుతుందన్నారు. ప్రాంతీయ పార్టీలే కీలక బాధ్యతలు వహిస్తాయని కవిత అన్నారు. ప్రాంతీయ పార్టీలే రానున్న కాలంలో దిశానిర్దేశం చేస్తాయని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
ఇటీవల పార్టీలో ప్రక్షాళన చేపట్టాలని కాంగ్రెస్ మాట్లాడిందని కవిత అన్నారు. ప్రాంతీయ పార్టీల విజయంపై కాంగ్రెస్ అసూయ వ్యక్తం చేసినట్లు ఆమె పేర్కొన్నారు. మెరుగైన పాలన అందిస్తుంది కాబట్టే టీఆర్ఎస్ అధికారంలో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ తరహాలో తమకు నాయకత్వ సంక్షోభం లేదన్నారు.
"అది కాంగ్రెస్ అంతర్గత సమావేశం. కాంగ్రెస్ లో సంక్షోభం, వారి నాయకత్వం గురించి జరిగిన సమావేశం. అయితే దురదృష్టం ఏమిటంటే ఇవాళ కాంగ్రెస్ దేశం గురించి మాట్లాడడంలేదు. వాళ్ల పార్టీని రివైవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారంతే. జాతీయ పార్టీగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ దేశంలో నిరుద్యోగం, ఆర్థిక పరిస్థితుల గురించి చర్చించడంలేదు. మతపర విద్వేషాలు పెరిగిపోయాయి. అయితే ఇవేవీ కాంగ్రెస్ పట్టించుకోవడంలేదు. ఎప్పుడూ వాళ్ల పార్టీ గురించే ఆలోచిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీల సక్సెస్ పై అసూయపడుతోంది. ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు సక్సెస్ అయ్యాయి. ఇవాళ రాష్ట్రాలను ప్రాంతీయ పార్టీలు లీడ్ చేస్తున్నాను. రేపు దేశాన్ని ప్రాంతీయ పార్టీలే రూల్ చేస్తాయి. మా ఎజెండా ప్రజల సంక్షేమం. పొలిటికల్ ఎజెండా కాదు. కాంగ్రెస్ మాదిరిగా మాకు నాయకత్వ సంక్షోభం లేదు. రిజనల్ పార్టీలకు కచ్చితమైన నాయకత్వం ఉంటుంది. రాహుల్ జీ మహారాష్ట్రలో అధికారంలో ఉన్నారంటే రీజనల్ పార్టీ పుణ్యమేనని అర్థం చేసుకోవాలి. తాజా ఆర్బీఐ రిపోర్టు ప్రకారం ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ మూడు అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు. ఈ రాష్ట్రాలు నిరుద్యోగ రేటును తగ్గించి ఉద్యోగాలను కల్పిస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో లేదు. మహారాష్ట్రలో కాంగ్రెస్ తోక పార్టీ. రేపు దేశంలో ప్రాంతీయ పార్టీలే అధికారంలోకి వస్తాయి. " అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.