Minister KTR UK Tour : తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఓ బృందం మంగళవారం లండన్ కు బయల్దేరివెళ్లింది. మే 18 నుంచి 26వ తేదీ వరకూ ఈ బృందం యూకేలో పర్యటించనుంది. యూకేలోని పలు కంపెనీల ప్రతినిధులు, వాణిజ్యవేత్తలతో మంత్రి కేటీఆర్ సమావేశమవుతారు. ఆ తర్వాత 22వ తేదీ నుంచి 26 వరకు స్విట్జర్లాండ్ దావోస్‌లో నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్ లో మంత్రి పాల్గొంటారు. యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించే రెండు రౌండ్ టేబుల్ సమావేశాల్లో కేటీఆర్ పాల్గొంటారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలతలు, పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం, ఇతర సౌకర్యాలు, ప్రభుత్వ రాయితీలను వారికి వివరించనున్నారు.
యూకే, దావోస్ లో టూర్
తెలంగాణలోని అవకాశాలను వివరిస్తూ పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా మంత్రి కేటీఆర్ బృందం పదిరోజుల పాటు విదేశీ పర్యటన సాగనుంది. ప్రపంచ వేదికపై తెలంగాణ గురించి మరోమారు మంత్రి కేటీఆర్ ప్రస్తవించనున్నారు. ఈ పర్యటనలో పలు ప్రముఖ ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమోటివ్ పరిశ్రమల అధిపతులతో మంత్రి కేటీఆర్ సమావేశమవుతారు. ప్రపంచ కంపెనీల పెట్టుబడులకు గమ్యస్థానం లక్ష్యంతో ఇక్కడి విధానాలు, పరిస్థితులను కేటీఆర్ వారికి వివరిస్తారు.
ప్రపంచ వేదికపై తెలంగాణ
కోవిడ్ అనంతరం జరుగుతున్న పెద్ద సమావేశం ప్రపంచ ఆర్థిక సదస్సు. ఈ సదస్సులో ఆరోగ్యం, విద్యుత్, సుస్థిరత తదితర అంశాల్లో దీర్ఘకాలిక ప్రయోజనాలు, సాంకేతికతల వినియోగంపై ఈ సదస్సులో చర్చించినున్నారు. ఈ సదస్సులో ప్రధాని మోదీ, ఏపీ సీఎం జగన్ కూడా పాల్గొనున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వహించనున్న ప్యానెల్ చర్చల్లో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. తెలంగాణలోని అత్యుత్తమ విధానాలు, అనుకూల పరిస్థితులను ఈ సదస్సులో కేటీఆర్ వివరించున్నారు. దాదాపు 35 మంది వ్యాపార ప్రముఖులతో ఆయన సమావేశం కానున్నారు. ఈ సదస్సు సందర్భంగా దావోస్ లో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక లాంజ్ ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివరాలను అందులో ప్రదర్శనకు ఉంచనున్నారు.
అమెరికా టూర్ సక్సెస్
ఇటీవల మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లివచ్చారు. ఈ పర్యటనలో పలు అమెరికన్ కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులకు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. అమెరికా పర్యటనలో భాగంగా ఎడ్వెంట్ సంస్థ ఫార్మా రంగంలో రూ.1750 కోట్లు, న్యూజెర్సీలోని ఔషధ కంపెనీ స్లేబ్యాక్ ఫార్మా రూ.1500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. స్లేబ్యాక్ గడచిన ఐదేండ్లలో రాష్ట్రంలో రూ.2300 కోట్ల పెట్టుబడులు పెట్టింది. వీటితో పాటు మరో రూ.1500 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో సుమారు 35 సమావేశాలు నిర్వహించారు. రాష్ర్టానికి రూ.7500 కోట్ల పెట్టుబడులను రాబట్టారు. ఈ తరహాలో యూకే నుంచి కూడా రాష్ర్టానికి పెద్దఎత్తున పెట్టుబడులు తెచ్చే లక్ష్యంతో తాజా పర్యటనను రూపొందించారు.