Hymon Dorf Couple Anniversary: అడవుల మధ్య అభివృద్ధికి దూరంగా ఉంటున్న అదివాసీల జీవితాల్లో వెలుగులు నింపారు హైమన్ డార్ఫ్ దంపతులు. నేడు అడవి బిడ్డలు అభివృద్ధి దిశగా పయనిస్తున్నారంటే అది వారు చేసిన అధ్యయనం కృషే. స్వతంత్ర పోరాటానికి ముందే గిరిజనులకు భూమి పంపిణీ చేయించి వారి గుండెల్లో చెరగని ముద్ర వేశారీ దంపతులు. అడవి నేత్రం ఆయన.. అడవి బిడ్డలతో మమేకమై వారి కోసం తపించిన మానవ పరిణామ శాస్త్రవేత్త. ఆ గోండుల గూడెల్లో గూడు కట్టుకొన్న డార్ఫ్... అడవి బిడ్డల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసి ఆదివాసీల జీవన శైలిపై డార్ఫ్ రచనలు, సేవలు మరువని గిరిపుత్రులు. నేడు మార్లవాయిలో ఆదివాసీల ఆత్మబంధువు ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ దంపతుల వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలోనే మార్లవాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం గోండుగూడెంలో గిరిజనులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
ఆదివాసీల్లో ఒకరిగా ఉంటూనే వారిపై అధ్యయనం
"జల్ జంగల్ జమీన్" నినాదంతో భూమి కోసం భుక్తి కోసం దోపిడి దారులకు వ్యతిరేకంగా గోండు వీరుడు కుమురం భీం నిజాం ప్రభుత్వంతో సాయుధ పోరాటం చేసి వీర మరణం పొందిన సంఘటన నిజాం ప్రభువును కలిచివేసింది. సమాజానికి దూరంగా అడవులే ఆటపట్టుగా జీవించే ఆదివాసుల్లో విప్లవ జ్వాల ఎందుకు రగిలింది, వారి అభివృద్ధికి అమలు చేయాల్సిన సంస్కరణలు తీరు ఎలా ఉండాలనే అంశాలు నిజాం సర్కారును ఆలోచింపజేశాయి. ఆస్ట్రియా దేశానికి చెందిన ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త హైమన్ డార్ఫ్ భారత దేశంలో గిరిజనుల జీవన విధానంపై పరిశోధన చేశారు. విషయం తెలుసుకొన్న నిజాం ప్రభువు తన సంస్థానానికి రప్పించుకొని ఆదివాసీల స్థితిగతులు, అక్కడ నెలకొన్ని పరిణామాలపై పరిశీలన చేసి ఆదివాసుల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన గోండు గూడాలకు వెళ్లి ఆదివాసీలతో మమేకమయ్యారు. గోండుల గుండెల్లో స్థానం సంపాదించారు డార్ఫ్ దంపతులు. గిరిజనులు నేటికి డార్ఫ్ దంపతుల సేవలను మరువలేకపోతున్నారు. యేటా జనవరి 11వ మార్లవాయిలో వారి వర్ణంతిని నిర్వహిస్తున్నారు.
ఆదివాసీల సమస్యలపై నాగోబా జాతరలో ప్రత్యేకంగా దర్బార్ నిర్వహణ
ఆదివాసీల ఆత్మబంధువుగా మానవ పరిణామ శాస్త్రవేత్త దివంగత ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ ఆదివాసీల గుండెల్లో నిలిచారు. అడవి బిడ్డల జీవన స్థితిగతులను అధ్యయనం చేయడానికి ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్, బెట్టి ఎలిజబెత్ దంపతులు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. ఆదివాసీల సమస్యలు తెలుసుకుంటూ ఆదివాసీల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. అదివాసులకు, విద్య, వైద్యంతో పాటు జీవన మనుగడకు భూములు పంపిణి చేయాలనీ ప్రతిపాదించాడు. ఆదివాసుల సామాజిక సమస్యల పరిష్కారంతోపాటు అడవిపై, అడవి సంపదపై, భూములపై హక్కు లు కల్పించాలని సూచించారు. ఆదివాసుల సమస్యలు తెలుసుకొనేందుకు నాగోబా జాతరలో ప్రత్యేకంగా "దర్బార్" నిర్వహించారు. ఆ దర్భార్ ఇప్పటికి అనవాయితీగా కొనసాగుతుంది. గ్రామ పెద్దలతో చర్చించి అసిఫాబాద్, మార్లవాయి, సిర్పూర్, గిన్నెధారి ప్రాంతాల్లో స్వచ్చంద పాఠశాలలను ఏర్పాటు చేసి ఆదివాసీ యువకులకు చదువులు చెప్పించారు. డార్ఫ్ ఇచ్చిన నివేదికతో నిజాం ప్రభుత్వం ఆదివాసీల భూమి సమస్య పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకొని భూములు పంపిణీ చేసింది. సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు చేసింది.
గిరిజన సదస్సులో ప్రసంగిస్తూనే బెట్టి ఎలిజబెత్ హఠాన్మరణం
ఆదివాసీల కోసం తమ జీవితాన్ని త్యాగం చేసిన ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్, బెట్టి ఎలిజబెత్ దంపతులు ఆదివాసులకు ఆరాధ్య దైవాలుగా మారారు. ఆదివాసీల గుండెల్లో గూడు కట్టుకున్నాను. డార్ఫ్ దంపతులు 1930లో మానవ పరిణామక్రమంపై పరిశోధన చేస్తూ భారత దేశానికి వచ్చారు. వివిధ రాష్ట్రాలలో పర్యటించిన స్థితిగతులపైన అధ్యయనం చేశారు. ఆదివాసీలపై ఆయన చేసిన అధ్యయనంలో ఆయన భార్య ఎలిజబెత్ చేదోడు వాదోడుగా నిలిచారు. ఆమె కూడా స్థానికంగానే ఉంటూ గిరిజనుల అభివృద్ధి కోసం కృషి చేశారు. 1986లో హైదరాబాదులో జరిగిన జాతీయ గిరిజన సదస్సులో ప్రసంగిస్తూ బెట్టి ఎలిజబెత్ పాఠాన్మరణం చెందారు. ఆమె కోరిక మేరకు మార్లవాయి గ్రామంలో గిరిజన సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. మార్లవాయి గ్రామంలో ఎలిజబెత్ వర్ధంతి వేడుకల్లో హైమన్ డార్ఫ్ గిరిజనులతో కలిసి హాజరయ్యేవారు.
కుమారుడికి ఆత్రం లచ్చు పటేల్ గా నామకరణం
తాను చనిపోతే భార్య సమాధి పక్కనే తన సమాధి కట్టించాలని కోరారు. ఆదివాసీలతో ఉన్న అనుభందంతో ఆయన కుమారుడు నికొలస్ కు ఆత్రం లచ్చు పటెల్ అని ఆదివాసీ పేరును పెట్టారు హైమన్ డార్ఫ్. భార్య మరణించిన తరువాత చివరి సారిగా 1987లో హైమన్ డార్ఫ్ జిల్లాకు వచ్చారు. ఆ తరువాత ఆయన 1995 లో లండన్ లో మరణించారు. మార్లవాయిలో భార్య సమాధి పక్కనే హైమన్ డార్ఫ్ సమాధిని నిర్మించారు ఆదివాసీలు. 2011 లో హైమన్ డార్ఫ్ కుమారుడు నికొలస్ (ఆత్రం లచ్చు పటేల్) ఇండియాకి వచ్చారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మార్లవాయికి చేరుకొని నాన్న ఆస్తికలను ఓ పెట్టెలో భద్రంగా అమర్చి తిసుకొచ్చి ఆదివాసీలతో కలిసి హైమన్ డార్ఫ్ సమాధి వద్ద ఆదివాసీ సాంప్రదాయాలతో పూడ్చారు. మార్లవాయికి వచ్చిన హైమన్ డార్ఫ్ కుమారుడు లచ్చు పటేల్ ఆదివాసీల ప్రేమను ఎన్నడు మరువబోమని ఈ ప్రేమానుభంధాలు ఎప్పటికీ నిలిచి ఉండాలని కోరారు. అనంతరం ఆయన తిరిగి లండన్ కు వెళ్లిపోయారు.
ఆదివాసీల జీవన స్థితిగతులపై అద్యయనం చేయడానికి వచ్చిన ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ దంపతులు ఆదివాసీలతో కలిసి జీవనం కొనసాగించి ఆదివాసీల సమస్యలను నిజాం ప్రభుత్వానికి తెలిపి ఆదివాసీల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అప్పటి నుంచి నేటి వరకు జనవరి 11వ తేదిన మార్లవాయి గ్రామంలో ఆదివాసీల ఆత్మబంధువు ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ దంపతుల సమాధుల వద్ద ఆదివాసీ సాంప్రదాయాలతో డోలు వాయిద్యాల నడుమ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ యేడు కూడా వారి వర్ధంతిని ఘనంగా నిర్వహించేందుకు ఆదివాసీలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.