Watch Video: గువాహటి వేదికగా భారత్- శ్రీలంక మధ్య నిన్న జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో సమష్టిగా రాణించిన రోహిత్ సేన 67 పరుగుల తేడాతో లంకను మట్టి కరిపించింది. విరాట్ కోహ్లీ (113) అద్భుత సెంచరీకి తోడు కెప్టెన్ రోహిత్ శర్మ (83), శుభ్ మన్ గిల్ (70) లు రాణించారు. యువ బౌలర్లు ఉమ్రాన్ మాలిక్ 3, మహ్మద్ సిరాజ్ లు 2 వికెట్లతో గెలుపులో కీలకపాత్ర పోషించారు.
ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తిరిగి తన పాత ఆటను అందుకున్నాడు. తనవైన షాట్లతో అలరించిన కోహ్లీ వన్డే కెరీర్ లో 45వ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే ఈ శతకంతో పలు రికార్డులను అందుకున్నాడు. కోహ్లీ మైదానంలో ఎంత చురుగ్గా ఉంటాడో అందరికీ తెలిసిందే. బౌండరీలు రావడం కష్టమైన దశలో సింగిల్స్, డబుల్స్ తో స్కోరు బోర్డును నడిపిస్తాడు. ఈ మ్యాచ్ లో ఇలా వికెట్ల మధ్య పరిగెత్తే విషయంలో విరాట్ కోహ్లీ తన సహచరుడు హార్దిక్ పాండ్యపై కోపం ప్రదర్శించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పాండ్య వైపు కోపంగా చూసిన కోహ్లీ
భారత్- శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఇన్నింగ్స్ 43వ ఓవర్ లో ఈ ఘటన జరిగింది. ఆ ఓవర్లో లంక బౌలర్ కసిన్ రజిత వేసిన బంతిని స్ట్రైకింగ్ లో ఉన్న కోహ్లీ ఆన్ సైడ్ ఆడాడు. చకచకా ఒక పరుగు పూర్తిచేశాడు. రెండో పరుగు కోసం పిచ్ సగం వరకు వచ్చాడు. అయితే అటువైపు ఉన్న పాండ్య స్పందించలేదు. రెండో పరుగు వద్దంటూ చేతితో సిగ్నల్ ఇచ్చాడు. వెంటనే కోహ్లీ తిరిగి తన క్రీజులోకి వెళ్లిపోయాడు. తర్వాత విరాట్ పాండ్య వైపు 2 సెకన్లు కోపంగా చూశాడు. అయితే పాండ్య కోహ్లీ వైపు చూడలేదు. ప్రస్తుతం వీడియా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. నిజానికి అక్కడ రెండో పరుగును కూడా తేలికగానే పూర్తిచేసే అవకాశం ఉంది. అయినప్పటికీ పాండ్య నిరాకరించాడు. బహుశా ఇందువలనే కోహ్లీ అతనివైపు కోపంగా చూశాడు.
శతకంతో పలు రికార్డులు ఖాతాలో వేసుకున్న కింగ్ కోహ్లీ
ఈ మ్యాచ్ లో శతకం బాదిన విరాట్ కోహ్లీ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. స్వదేశంలో సచిన్ చేసిన 20 శతకాల రికార్డును విరాట్ అందుకున్నాడు. అలాగే శ్రీలంకపై టెండూల్కర్ సాధించిన 8 సెంచరీల రికార్డును బద్దలు కొట్టాడు. ఈ సెంచరీతో కోహ్లీ శ్రీలంకపై తన శతకాల సంఖ్యను 9కి పెంచుకున్నాడు. వన్డేల్లో విరాట్ కిది 45వ శతకం. అలాగే అంతర్జాతీయ క్రికెట్ లో 73వ సెంచరీని సాధించాడు. ప్రస్తుత క్రికెట్ లో ఎవరూ కోహ్లీకి దరిదాపుల్లో కూడా లేేరు.