KTR Petro Taxes : పెట్రో పన్నుల పేరుతో ఇప్పటి వరకూ మోడీ ప్రభుత్వం రూ. 26 లక్షల కోట్లు వసూలు చేసిందని ఇక పన్నులు తగ్గించాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గుతున్నాయని.. ప్రస్తుతం ముడి చమురు బ్యారల్ ధర 95 డాలర్లకు చేరిందన్నారు. అయినా పెట్రోల్ ధరలను తగ్గించలేదని కేటీఆర్ విమర్శించారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బ్యారెల్ ముడి చమురు ధర భారీగా తగ్గుతూనే వచ్చిందని, కానీ ఘనమైన మోదీ పాలనలో, దేశంలో పెట్రో రేట్లు మాత్రం పెరుగుతూ పోయాయన్నారు. రేట్లు పెంచిన ప్రతిసారి అంతర్జాతీయ ముడి చమురు ధరలను బూచీగా చూపడం అలవాటుగా మారిందని మండిపడ్డారు.
అంతర్జాతీయంగా బ్యారెల్ ముడిచమురు ధర తగ్గితే ఆ ప్రయోజనం ఎక్కడ దేశ ప్రజలకు ఇవ్వకుండా సుంకాలను, సెస్సులను భారీగా పెంచుతున్నదని తెలిపారు. 2014 నుంచి ఇప్పటిదాకా పెంచడమే తప్ప తగ్గించడం తెలియదన్నట్టుగా పెట్రో ధరలను మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పదులసార్లు పెంచిందని కేటీఆర్ గుర్తు చేశఆరు. పెట్రో రేట్ల పెరుగుదల అనాటి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే అని అధికారంలోకి రాకముందు మోదీ విమర్శించారని ఇప్పుడు ధరల పెరుగుదలను ఆపడంలో విఫలం అయ్యారని ఒప్పుకుంటారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. 2014లో మోదీ సర్కారు ఏర్పాటైనప్పుడు బ్యారెల్ ముడిచమురు ధర దాదాపు 110 డాలర్లుగా ఉండేదని, 2015 జనవరి నాటికి అది 50 డాలర్లకు, 2016 జనవరిలో అయితే 27 డాలర్లకు పడిపోయిందన్నారు. ఆ తగ్గింపు ప్రజలకు ఇవ్వకుండా పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ 54 శాతం పెరిగితే, డీజిల్ మీద ఏకంగా 154 శాతం పెంచారని కేటీఆర్ విమర్శించారు.
పెట్రో ధరలను పెంచి ప్రజల నుంచి భారీగా ఆదాయాన్ని గుంజిన మోదీ సర్కార్, దాన్ని మరింత పెంచుకునేందుకు బరితెగించిందన్నారు కేటీఆర్. 2020 వరకు పెట్రోల్, డిజీల్ పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని గరిష్టంగా పెంచుకోవడానికి వీలుగా 2020 మార్చిలో చట్ట సవరణ సైతం చేసిందన్నారు. ప్రజలపై భారం వేసేందుకు చట్టాన్ని సైతం సవరించిన ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీదని కేటీఆర్ మండిపడ్డారు. కోవిడ్ మహమ్మారితో ఓ వైపు దేశ ప్రజలు ఆర్థికంగా చితికిపోయి ఉన్న సమయంలో కనీస కనికరం లేకుండా మోదీ సర్కార్ ఎక్సైజ్ సుంకాన్ని పెంచుకుంటూ పోయిందన్నారు. ఒక అంచనా ప్రకారం 2020 నాటికే మోదీ సర్కారు ఒక్క ఎక్సైజ్ డ్యూటీ రూపంలోనే సుమారు రూ. 14 లక్షల కోట్లను ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసిందన్నారు. సెస్సులు, పన్నుల రూపంలో ఇప్పటిదాకా మెత్తం రూ. 26 లక్షల కోట్లను ప్రజల నుంచి గుంజిన దగాకోరు ప్రభుత్వం మోదీదని కేటీఆర్ మండిపడ్డారు.
కేంద్ర సెస్సులు కాకుండా విధించిన ఒక్క పెట్రో సుంకాలను పూర్తిగా ఎత్తేస్తే ప్రతి లీటర్ పైనా ప్రజలకు దాదాపుగా రూ. 30 వరకు ఉపశమనం లభిస్తుందని కేటీఆర్ అన్నారు. పెట్రో రేట్లు పెరిగితే అటోమెటిక్ గా రవాణా ఖర్చులు కూడా పెరుగుతున్నాయని, అడ్డూ అదుపు లేకుండా మోదీ సర్కార్ పెంచిన పెట్రో రేట్లతో నిత్యావసరాల ధరలు పెరిగి దేశ చరిత్రలోనే అత్యధికంగా ద్రవ్యోల్బణం నమోదవుతున్న పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ప్రస్తుతం ముడి చమురు బ్యారల్ ధర 95 డాలర్లకు తగ్గినా, పెట్రో రేట్లను తగ్గించాలని కోరారు. కేంద్రం పెంచిన ఎక్సైజ్ డ్యూటీ నుంచి రాష్ట్రాలకు వచ్చేదే చాలా తక్కువన్న కేటీఆర్, రాష్ట్రాలు ఆర్థికంగా బలహీనపడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న మోదీ సర్కార్, పన్నుల రూపంలో కాకుండా సెస్సుల రూపంలోనే ఎక్కువగా పెట్రో రేట్లను పెంచిందన్నారు. సెస్సులు, సుంకాల పేరుతో దోపిడీ చేస్తూనే, అ నెపాన్ని రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటిదాకా పెట్రోల్ పైన ఒక్క రూపాయి అదనపు పన్ను వేయని తెలంగాణ లాంటి రాష్ట్ర ప్రభుత్వాలపైకి నెడుతూ, పేదల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నదని విమర్శించారు.