ఇచ్చిన హామీలు అమలు చేసే సత్తా లేకుంటే రైతన్నలకు క్షమాపణ అడగండి
హైదరాబాద్: ‘ఇచ్చిన హామీలు అమలు చేసే సత్తా లేకుంటే రైతన్నలకు క్షమాపణ చెప్పండి. అంతేగానీ ప్రమాణ పత్రాల పేరుతో రైతుల పై కేసులు పెట్టే ప్రయత్నం మానుకోవాలి. రైతులను భయాందోళనకు గురి చేసే కుట్ర చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతన్నలను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం మానుకోవాలి. ప్రజల సొమ్మును రైతన్నలు తింటున్నారన్న దుష్ప్రచారం ఆపాలని’ బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. 


రైతు భరోసా ఎగ్గొట్టే ప్రయత్నం..


హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ లో కేటీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. రైతు భరోసాను ఎగొట్టే కుట్రను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. హామీలు నెరవేర్చే సత్తా లేకుంటే రైతన్నలకు క్షమాపణ చెప్పండి. రైతన్నల నుంచి ప్రమాణపత్రాలు అడగడానికి సిగ్గు ఉండాలి. రైతన్నలకు హామీ ఇచ్చి మోసం చేసిన ప్రభుత్వమే ప్రమాణ పత్రం చేయాలి. ప్రభుత్వానికి దమ్ముంటే రైతన్నలకు ఇచ్చిన రైతు భరోసా పైన లబ్ధిదారుల జాబితా బయట పెట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లో కౌలు రైతులకు, రైతు కూలీలకు రైతుబంధు ఇచ్చారో సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. రైతు భరోసాకు దరఖాస్తులంటూ కొత్త డ్రామా మొదలుపెట్టింది. ప్రజాపాలన - అభయ హస్తం పేరుతోనే ప్రజలందరి నుంచి దరఖాస్తులు తీసుకుంది. 6 గ్యారంటీల కోసమని కోటి ఆరు లక్షల మంది దగ్గర దరఖాస్తులు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. 


దరఖాస్తుల పేరుతో కాంగ్రెస్ కాలయాపన చేస్తోంది. గతంలో శాసించే స్థాయికి తెచ్చిన రైతన్నను నేడు కాంగ్రెస్ ప్రభుత్వం యాచించే స్థితికి తీసుకువచ్చింది. గతంలో ప్రమాణాలు పెట్టి ఓట్లు పెట్టి గుడుల దగ్గరికి పోయిన కాంగ్రెస్ నేతలు నేడు రైతన్నలతోని ప్రమాణ పత్రాలు అడుగుతోంది. ప్రమాణపత్రాలు అడగడానికి సిగ్గు ఉండాలి. ప్పుటి దాకా రైతుల నుంచి కొన్న పంట కొనుగోలు వివరాలు, ఇచ్చిన బోనస్ వివరాలను వివరాల జాబితాలను గ్రామాలలో పెట్టాలి. మేం రైతుబంధు పథకాన్ని తీసుకువస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని బొంద పెట్టాలని చూస్తోంది. 


నిధుల దుర్వినియోగం జాబితా విడుదల చేయాలని డిమాండ్
రైతు బంధులో 22000 కోట్లు పక్కదారి అని దుష్ప్రచారం చేస్తుంది. గ్రామాల వారీగా దుర్వినియోగంపై జాబితా విడుదల చేయాలి. పత్తి రైతుకి, కంది రైతుకి, పసుపు, చెరుకు, పోడు భూముల రైతన్నలకు ఇచ్చిన రైతుబంధును దుబారా అని ప్రభుత్వం అబద్ధాలు ఆడుతున్నది.  ప్రమాణ మాత్రం ఎందుకివ్వాలని రైతన్నలు ప్రభుత్వాన్ని నిలదీయాలి. గతంలో 12 సార్లు డబ్బులు వచ్చాయని ప్రభుత్వానికి చెప్పాలి. ఇప్పటికే ఒక్కో రైతుకి ఎకరానికి 17500 వేల చొప్పున రాష్ట్ర రైతులకు రూ.26 వేల కోట్లకు పైగా బాకీ పడింది. రూపాయి లంచం లేకుండా కోటి 52 లక్షల మందికి రైతుబంధు వేశాం. రుణమాఫీ, రైతు భరోసా గురించి అడిగితే రైతులను బిచ్చగాళ్ళని మంత్రులు అంటున్నారు. రైతుల పట్ల ఉన్న ఆలోచన ధోరణి ఇది. 



వరంగల్ రైతు డిక్లరేషన్ అమలు చేయాలి. 22 లక్షల కౌలు రైతాంగానికి రేవంత్ రెడ్డి ఉత్తరం రాసిండు. ఇప్పుడు రైతు భరోసా ఎగ్గొట్టడాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను ప్రజలకు తెలియజేసి రాష్ట్ర రైతాంగాన్ని చైతన్యవంతం చేద్దాం. సంక్రాంతిలోగా రైతు భరోసాను అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దాం. ఎన్నికల్లో చెప్పకున్నా  దేశ చరిత్రలో రైతుకి పెట్టుబడి సాయం ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్ ఒక్కరే. ఎలాంటి దరఖాస్తులు చేయకుండా రైతుబంధు అందించాం. 


ఈసీకి లేఖ రాసి ఆపారు. ఏడాదయినా ఇస్తలేరు


11 సీజన్లలో రూ.73 వేల కోట్లు రైతుల ఖాతల్లోకి వేశాం. 12వ సీజన్లో రైతులకు ఇవ్వాల్సిన డబ్బులను కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ కు లేఖరాసి ఆపింది. ఏడాది దాటినా రైతు భరోసా రూపంలో రైతన్నలకు ఒక్క రూపాయి ఇయ్యలేదు. బీఆర్ఎస్ దాచిపెట్టిన 7500 కోట్లు మాత్రమే రైతు భరోసా పేరుతో ఇచ్చారు. వరంగల్లో రాహుల్ గాంధీని తెచ్చి రైతన్నలను ఉద్ధరిస్తామని చెప్పారు. రైతు డిక్లరేషన్ లో భాగంగా ఎకరానికి రూ.15 వేలు, కౌలు రైతులకు, రైతు కూలీలకు ఆర్థిక భరోసా ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఇప్పుడు రైతులతోనే ప్రమాణ పత్రాలు తీసుకుంటూ వారిని ఆందోళనకు గురిచేస్తోంది’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ నిప్పులు చెరిగారు.


Also Read: Reels Contest: మీకు రీల్స్ చేసే అలవాటుందా? లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ పట్టేయండి - మరో బంపరాఫర్ సైతం