Krishna River Management Board: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు కృష్ణా బోర్డు కీలక సూచన చేసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల నుంచి తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని వినియోగించుకోవాలని కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ కన్వీనర్‌ డీఎం రాయిపురే సూచించినట్లు సమాచారం. సోమవారం హైదరాబాద్‌లోని కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. 


సమావేశానికి తెలంగాణ నీటిపారుదలశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.మురళీధర్‌ హాజరవలేదు. తాను పలు కారణాలతో హాజరుకాలేకపోతున్నట్లు బోర్డుకు ముందే సమాచారం పంపారు. రాష్ట్ర అవసరాలకు సంబంధించిన ఇండెంట్‌ను బోర్డుకు పంపారు. ఏపీ జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.నారాయణరెడ్డి హాజరయ్యారు. 


సెప్టెంబరు వరకు ఏపీ తరఫున తాగు, సాగు నీటికి శ్రీశైలం, సాగర్‌ల నుంచి 30.09 టీఎంసీలు అవసరమని ఇండెంట్‌లో కోరారు. సమావేశంలో మాత్రం తాగునీటికే సెప్టెంబరు నాటికి 25 టీఎంసీలు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. జలాశయాల్లో నిల్వలు లేనందున తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరినట్లు నారాయణరెడ్డి తెలిపారు. 


సమావేశంలో కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ కన్వీనర్‌ డీఎం రాయిపురే ఇరు రాష్ట్రాలకు పలు సూచనలు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం అన్ని చోట్లా వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన దృష్టా నీటి వినియోగంలో జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఎగువ నుంచి ప్రవాహాలు లేకపోవడంతో రిజర్వాయర్లలో ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించనట్లు తెలుస్తోంది. నీటి వినియోగం విషయంలో రెండు రాష్ట్రాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. 


బేసిన్‌ వెలుపలకు తరలింపును అడ్డుకోండి
శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల నుంచి వచ్చే ఏడాది మే నెలాఖరు వరకు తాగునీటి అవసరాలకు కేటాయింపులు చేయాలని బోర్డుకు పంపిన ఇండెంట్‌ లేఖలో తెలంగాణ కోరింది. జలాశయాల్లో సరిపడా నిల్వలు లేవని, ప్రవాహాలు వచ్చే అవకాశాలు కూడా లేనందున ఈ మేరకు తాగునీటికి కేటాయింపులు చేయాలని విజ్ఞప్తి చేసింది. బేసిన్‌ పరిధిలోనే నీటికొరత ఉండగా శ్రీశైలం జలాశయం నుంచి బేసిన్‌ వెలుపలకు ఆంధ్రప్రదేశ్‌ నీటిని తరలించడాన్ని కట్టడి చేయాలని కోరింది. ఏపీ ఇప్పటికే 7.4 టీఎంసీలను పోతిరెడ్డిపాడు ద్వారా బేసిన్‌ వెలుపలకు తరలించిందని తెలిపింది.


జూన్‌ నుంచి ఈ నీటి సంవత్సరంలో ఆగస్టు 16వ తేదీ నాటికి ఏపీ 42.96 టీఎంసీలు, తెలంగాణ 12.67 టీఎంసీలను వినియోగించుకున్నాయని ఇండింట్‌లో పేర్కొంది. ఈ నెల 19 నాటికి ఏపీకి పులిచింతల ప్రాజెక్టులో 26.72 టీఎంసీలు, తుంగభద్రలో 23 టీఎంసీలు కలిపి 49.72 టీఎంసీల నిల్వలు ఉన్నాయని తెలిపింది. తెలంగాణకు జూరాలలో 8.43 టీఎంసీలు, తుంగభద్రలో 2.52 టీఎంసీలు కలిపి 10.95 టీఎంసీల నిల్వ ఉన్నట్లు పేర్కొంది. సాగర్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్‌ ఉత్పత్తి అనంతరం నీటిని విడుదల చేయడానికి ట్రైబ్యునల్‌ అనుమతులున్నాయని అని లేఖలో తెలిపింది.


తెలంగాణకు 38.73 టీఎంసీలు కావాలి
వచ్చే మే వరకు తాగునీటి అవసరాలకు 38.78 టీఎంసీల నీరు అవసరమని కృష్ణాబోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి చేసింది. శ్రీశైలం నుంచి కల్వకుర్తికి 5.55 టీఎంసీలు అవసరం అవుతాయని తెలంగాణ కోరింది. సాగర్‌ నుంచి ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతలతో పాటు హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు 15.40 టీఎంసీలు అవసమవుతాయని పేర్కొంది. సాగర్‌ ఎడమ కాలువ కింద 6 టీఎంసీలు మొత్తం కలిపి 26.95 టీఎంసీలు తాగునీటికి కేటాయింపులు చేయాలని విజ్ఞప్తి చేసింది. సెప్టెంబరు వరకు సాగునీటి అవసరాలకు 38.73 టీఎంసీలు అవసరమని శ్రీశైలం నుంచి 15.73 టీఎంసీలు, సాగర్‌ నుంచి 23 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ కోరింది.


ఏపీకి 30.09 టీఎంసీలు అవసరం
సెప్టెంబర్ చివరి వరకు తాగు, సాగునీటి అవసరాల కోసం మొత్తం 30.09 టీఎంసీల నీరు అవసరమని ఏపీ ప్రభుత్వం కోరింది. సాగర్‌ కుడి కాలువకు 9 టీఎంసీలు, ఎడమ కాలువకు 1.80 టీఎంసీలు కలిపి 10.8 టీఎంసీలు కావాలని విజ్ఞప్తి చేసింది. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 13.29 టీఎంసీలు, హంద్రీనీవా సుజల స్రవంతి కింద 6 టీఎంసీలు కలిపి 19.29 టీఎంసీలు కేటాయించాలని ఏపీ కోరింది. ఈ నెల 16 వరకు శ్రీశైలం, సాగర్‌ నుంచి 8.30 టీఎంసీలు వినియోగించుకున్నట్లు పేర్కొంది.