ఆకుకూరలు అన్ని రకాలుగా మన శరీరానికి మేలు చేస్తాయి. అందుకే ఆకుకూరలను తినమని వైద్యులు కూడా సిఫారసు చేస్తూ ఉంటారు. మనం తింటున్న కూరగాయలు, ఆకుకూరల్లో అన్నింటికన్నా అత్యంత ఆరోగ్యకరమైనదిగా అధికారికంగా గుర్తింపు తెచ్చుకుంది ఓ ఆకుకూర. నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా ప్రకారం వాటర్ క్రెస్ అని పిలిచే ఆకుకూర. మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇటీవల యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ సంస్థ చెప్పిన ప్రకారం మనం వినియోగిస్తున్న కూరగాయలు, ఆకుకూరల్లో ఏది అత్యంత ఆరోగ్యకరమైనదో పరిశోధన చేసింది. అందులో వాటర్ క్రెస్ ఆకుకూర 100 పాయింట్లకు 100 సాధించి మొదటి స్థానంలో నిలిచింది. దీంతో ఆ సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన  ఆహారంగా దీన్ని నిర్ధారించింది. ఇక తర్వాత స్థానంలో బచ్చలి కూర నిలిచింది. ఆ తరువాత బీట్రూట్ 87 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.  పాలకూర 86.43 పాయింట్లు సాధించి నాలుగో స్థానాన్ని ఆక్రమించింది.


వాటర్ క్రెస్ అనేది అమెరికాలో పిలుచుకునే పేరు. ఇది మనదేశంలో కూడా అధికంగానే లభిస్తుంది. దీన్ని జలకుంభీ అని పిలుస్తూ ఉంటారు. నీటిలో పెరిగే ఆకుకూర ఇది. చాలా వేగంగా పెరుగుతుంది. యూరోప్, మధ్య ఆసియాల్లో అధికంగా లభిస్తుంది. ప్రస్తుతం మనం వాడుతున్న ఆకుకూరల్లో అతి ప్రాచీనమైనది కూడా ఈ ఆకుకూరే. కొన్నిచోట్ల దీన్ని స్థానికంగా రకరకాల పేర్లతో పిలుచుకుంటారు. దీన్ని తినడం వల్ల మన శరీర కణాలను రిపేర్ చేస్తుంది. శరీరానికి హాని కలిగించే రసాయనాలను నాశనం చేస్తుంది. క్యాన్సర్ తో పోరాడే శక్తిని ఇస్తుంది. నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్ల కంటే దీనిలోనే విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మానసిక ఆరోగ్యం పై కూడా సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది.


పాలకూరలో కన్నా ఫోలేట్ అధికంగా వాటర్ క్రెస్ లోనే ఉంటుంది. దీన్ని తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపక శక్తిని పెంచుతుంది. అయితే దీన్ని అధికంగా తీసుకుంటే మాత్రం కొన్ని సైడ్ ఎఫెక్టులు తప్పవు. రోజు దీన్ని తింటే మాత్రం మూత్రాశయం, మూత్రపిండాలు, పొట్టలో కొన్ని సమస్యలు రావచ్చు. కాబట్టి దీన్ని వారానికి రెండుసార్లు తింటే చాలు.


అమెరికా వంటి దేశాల్లో అధికంగా ఈ ఆకుకూరను గార్నిషింగ్‌కు వినియోగిస్తారు. దీని రుచి మిరియాల రుచిని పోలి ఉంటుంది. ఇది అనేక వ్యాధులను నయం చేసే శక్తిని, గాయాల నుంచి కోలుకునే శక్తిని ఇస్తుందని చెబుతారు. వైద్యులు, క్రీడాకారులకు ఆకుకూరను ప్రత్యేకంగా తినిపిస్తారు. వాటర్ క్రెస్ అనేది భూమిపై అత్యంత పోషకాలు కలిగిన ఆకుకూర. దీనిలో అధిక స్థాయిలో అమైనో ఆమ్లం ఉంటుంది. ప్రోటీన్లను జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. అలాగే న్యూరో ట్రాన్స్మిటర్లను ఉత్పత్తి చేయడంలో కూడా సహాయపడుతుంది. ఇది తినడం వల్ల శరీరానికి అందే క్యాలరీలు చాలా తక్కువ. కాబట్టి బరువు పెరుగుతారన్న భయం లేదు. దీనిలో ఐరన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ కె పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ మన మెదడుకు అవసరమైన పోషకాలే... కాబట్టి వాటర్ క్రెస్ ఆకుకూరలు ఎక్కడైనా కనిపిస్తే కచ్చితంగా కొని తెచ్చుకోండి.


Also read: చింత చిగురు కారం పొడి ఇలా చేసుకున్నారంటే రుచి అదిరిపోవడం ఖాయం


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.