Kishan Reddy On Governer Speech :   తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అవాస్తవాలు చెప్పారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం అన్నీ అబద్దాలు చెప్పించిందన్నరు.  చేయని వివిధ కార్యక్రమాలను గొప్పగా చేసినట్లుగా చెప్పుకోవడం రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ దివాళా కోరుతనానికి నిదర్శనమని కిషన్ రెడ్డి విమర్శించారు. గవర్నర్ ప్రసంగంపై మొదట రాజకీయంగా అనవసర రాద్ధాంతం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. కోర్టు జోక్యంతో మళ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు గవర్నర్ ప్రసంగానికి సిద్ధమైందన్నారు.  ఇటీవలి కాలంలో జై తెలంగాణ  నినాదాన్ని సీఎం కేసీఆర్ విస్మరించినా.. రాష్ట్ర గవర్నర్ తన ప్రసంగాన్ని జై తెలంగాణ అని చెప్పి ముగించడం రాష్ట్ర ప్రజల పట్ల గవర్నర్ గారికున్న ఆదరాభిమానాలకు నిదర్శనమని శుక్రవారం ఢిల్లీలో విడుదల చేసిన ఒక ప్రకటనలో కిషన్ రెడ్డి పేర్కొన్నారు.


పాడుబడ్డ తెలంగాణ గ్రామాల రూపురేఖలు మారాయని గవర్నర్ తో చదివించిన రాష్ట్ర ప్రభుత్వం.. గ్రామాభివృద్ధికి సర్పంచ్ లకు బిల్లులు ఇయ్యని విషయం మరిచిందా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను దారిమళ్లించి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడాన్ని బడ్జెట్ లో ప్రస్తావించి ఉంటే బాగుండేదన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఈరోజు అనేక మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల సభ్యులు అవిశ్వాస తీర్మానాల కోసం అధికారులకు నోటీసులు ఇస్తున్న విషయం తెలంగాణ ప్రజలకు చాలా బాగా అర్థమవుతోందన్నారు. 2014-15లో రాష్ట్ర ఆదాయం 62 వేల కోట్లు ఉంటే, ప్రభుత్వ కృషితో 2021 నాటికి రూ. లక్ష 84 వేల కోట్లకు పెరిగిందని గవర్నర్ తో చెప్పించిన రాష్ట్ర ప్రభుత్వం.. 16 వేల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని దాదాపు 5 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిన విషయాన్ని మరిచిపోయారా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.


రైతు బంధు ఇస్తున్న విషయాన్ని ప్రముఖుంగా గవర్నర్ తో చెప్పించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇతర సబ్సిడీలు, పథకాలన్నిటిని ఎత్తేసిన సంగతి, రాళ్లు, పుట్టలు, గుట్టలు, వెంచర్లకు, భూస్వాములకు రైతు బంధు ఇస్తున్న విషయాన్ని కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేదన్నారు. ఒకవేళ రైతుబంధు నిజమైన లబ్ధిదారులకే వస్తుంటే.. ఈ ఎనిమిదేండ్లలో వేల మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. సబ్ స్టేషన్ల ఎదుట రైతులు ధర్నాలు చేస్తుంటే 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని చెప్పించడం హాస్యాస్పదమన్నారు.కేంద్రం నిధులతో చేపట్టిన అనేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుందని ఆయన విమర్శించారు. 


బస్తీ దవాఖానాలు, పంచాయతీ రాజ్ వ్యవస్థ ఇలా ప్రతి రంగంలో కేంద్రం ఇస్తున్న నిధులతో జరుగుతున్న కార్యక్రమాలను తమ ప్రభుత్వం చేసిన ఘనకార్యాలుగా చెప్పుకోవడం సిగ్గుచేటు. వివిధ ప్రాజెక్టులు, పథకాలకు కేంద్రం ఇస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోలేని విషయాన్ని కూడా బడ్జెట్ లో ప్రస్తావించి ఉంటే బాగుండేదన్నారు.  మైనారిటీల విద్యకు కేంద్రం ఇస్తున్న నిధులను కూడా తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకోలేదని, ఎస్సీ విద్యార్థుల స్కాలర్ షిప్ కు సంబంధించిన వివరాలు పంపమని కేంద్రం పలుమార్లు అడిగినా.. ఇంతవరకు స్పందించని రాష్ట్ర ప్రభుత్వం.. ఆయా విద్యార్థులకు చేకూరాల్సిన దాదాపు రూ.250 కోట్ల లబ్ధిని ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో ఎన్నిసార్లు లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన  లేకపోవడం విచారకరమన్నారు.


ప్రజలకు అవాస్తవాలు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టుల్లో అవినీతిని, నిజాం షుగర్ ఫ్యాక్టరీని మళ్లీ తెరిపిస్తామని చెప్పిన హామీని, దళితులకు ఇస్తానన్న మూడెకరాల భూమి విషయాన్ని, హైదరాబాద్ ను ఇస్తాంబుల్ చేస్తామన్న ప్రకటనను విస్మరించిన వాస్తవాలను కూడా గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రజలకు తెలియజేసి ఉంటే బాగుండేదని కిషన్ రెడ్డి సూచించారు.రాష్ట్రాభివృద్ధికి కేంద్రం చేస్తున్న సహాయం గురించి కూడా గవర్నర్ గారి బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించి.. సహకార సమాఖ్య విధాన స్ఫూర్తిని రాష్ట్ర ప్రభుత్వం చాటుకుని ఉంటే బాగుండేదన్నారు. ఇకనైనా అబద్ధాలను ప్రచారం చేయడం మాని రాష్ట్ర సంక్షేమంపై దృష్టిపెట్టాలని కిషన్ రెడ్డి హితవు పలికారు.