ADR Report : అసోషియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఇటీవల సంచలన నివేదిక ఇచ్చింది. దేశంలోని వివిధ రాష్ట్రాల ఎమ్మెల్యేలు, మంత్రుల కేసులు, ఆస్తులపై నివేదిక విడుదల చేసింది. దేశంలోని మొత్తం 558 మంది ఎమ్మెల్యేలలో 486 (87%) మంది కోటీశ్వరులు కాగా, 239 (43%) మంది మంత్రులపై  క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపింది. తమిళనాడు 33 మంది మంత్రులలో 28 (85%), హిమాచల్ ప్రదేశ్ 9 మంది మంత్రులలో 7 (78%), తెలంగాణ 17 మంది మంత్రులలో 13 (76%), మహారాష్ట్ర నుంచి 20 మంది మంత్రులలో 15 (75%) , పంజాబ్‌కు చెందిన 15 మంది మంత్రుల్లో 11 (73%), బీహార్‌కు చెందిన 30 మంది మంత్రుల్లో 21 (70%) మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు వారే అఫిడవిట్‌లలో ప్రకటించారని అని ADR నివేదిక పేర్కొంది.






ఆస్తుల్లో కర్ణాటక టాప్
 
 28 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 567 మంత్రులకు గాను 558 మంత్రుల అఫిడవిట్‌లను పరిశీలించిన ఏడీఆర్ తాజా నివేదిక తయారు చేసింది. మంత్రుల ఆస్తుల లెక్కలు చూస్తే సగటున ఒక్కొక్కరికి రూ.16.63 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపింది. క్రిమినల్ కేసులున్న మంత్రులకు సగటున ఒక్కొక్కరికి రూ.21.21 కోట్లు ఆస్తి ఉన్నట్లు వెల్లడించింది. ఆస్తుల్లో రూ.73 కోట్లతో కర్ణాటక మంత్రులు టాప్ లో ఉన్నారు. రూ.47.45 కోట్లతో మహారాష్ట్ర మంత్రులు రెండో స్థానంలో, ఛత్తీస్‌గఢ్‌ మంత్రులు రూ.43.96 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. తీవ్రమైన క్రిమినల్ కేసులతో అత్యధిక శాతం మంత్రులను కలిగి ఉన్న రాష్ట్రం పరంగా 20 మంది మంత్రులలో 13 (65%) మందితో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది, ఝార్ఖండ్ నుంచి 11 మంది మంత్రులలో ఏడుగురు (64%),  తెలంగాణకు చెందిన 17 మంది మంత్రుల్లో 10 (59%) మంది మూడో స్థానంలో ఉన్నారు. ఏడీఆర్ నివేదిక ప్రకారం బిహార్‌కు చెందిన 30 మంది మంత్రుల్లో 15 (50%) మంది తమపై తీవ్రమైన నేరారోపణలు ప్రకటించగా, తమిళనాడుకు చెందిన 33 మంది మంత్రుల్లో 16 (48%), పంజాబ్‌కు చెందిన 15 మంది మంత్రుల్లో ఏడుగురు (47%) ఈ జాబితాలో ఉన్నారు.  


51 మంది మహిళా మంత్రులు 


మొత్తం మంత్రుల్లో 51 నుంచి 60 ఏళ్ల వారు 200 మంది ఉన్నారని ఏడీఆర్ నివేదిక తెలిపింది. 61 నుంచి 70 ఏళ్ల వారు 143 మంది, 41 నుంచి 50 ఏళ్ల వారు 139 మంది మంత్రులున్నట్లు తెలుస్తోంది. మొత్తం 558 మంది మంత్రుల్లో 51 మంది మాత్రమే మహిళా మంత్రులున్నారని నివేదిక వెల్లడించింది. పశ్చిమబెంగాల్‌ లో 8 మంది మహిళా మంత్రులుండగా, ఒడిశాలో 5గురు, ఉత్తర్ ప్రదేశ్ లో 5 గురు మహిళా మంత్రులున్నారు. తెలంగాణలో ఇద్దరు మహిళా మంత్రులుండగా, అరుణాచల్ ప్రదేశ్, దిల్లీ, మిజోరమ్, నాగాలాండ్, మేఘాలయ, గోవా, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, సిక్కిం అసెంబ్లీల్లో ఒక్క మహిళా మంత్రి కూడా లేరని ఏడీఆర్ తన నివేదికలో స్పష్టం చేసింది. మరోవైపు త్రిపురలో మంత్రులకు అత్యల్పంగా ఆస్తులు ఉన్నాయి. 11 మంది మంత్రులకు సగటు ఆస్తులు రూ.2.67 కోట్లు, కేరళలోని మంత్రులు 18 మంది   సగటు ఆస్తులు రూ.2.73 కోట్లు,  మణిపూర్ 12 మంది మంత్రుల సగటు ఆస్తులు రూ.3.69 కోట్లుగా ఉన్నాయి.