Khammam Politics Year Ender 2022 : మలిదశ తెలంగాణ ఉద్యమం అనంతరం కొత్తగా వచ్చిన పార్టీలకు, పాత పార్టీల పునర్నిర్మాణానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా వేదికగా మారింది. ఈ ఏడాది ఖమ్మంలో పార్టీలు తమ బల ప్రదర్శనకు వేదికగా ఎంచుకున్నాయి. ఓ వైపు కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న జిల్లాలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ఇప్పటి వరకు తమ ప్రాబల్యాన్ని చాటుకునేందుకు చూస్తున్నాయి. ఈ ఏడాది ఖమ్మం జిల్లాపై మిగిలిన పార్టీలు దృష్టి సారించడం గమనార్హం. 2022 ఏడాదిలో ఖమ్మం జిల్లాను తమ బలప్రదర్శనకు వేదికగా మార్చుకున్నాయి. 2022లో కొత్త రాజకీయాలకు వేదికగా ఖమ్మం జిల్లా మారింది. 2014లో తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాజకీయాలకు దూరమైన పలుపార్టీలు తమ బలప్రదర్శనకు ఖమ్మం జిల్లానే ఎంచుకోవడం గమనార్హం. 2022 ఏడాదిలో జరిగిన అనేక సంఘటనలు ఖమ్మం జిల్లాలో జరిగిన సభలు తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలంగా ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ మరో ఏడాదిలో వస్తున్న ఎన్నికల నేపథ్యంలో అంతర్గత పోరుతో సతమతమవుతుండగా, కాంగ్రెస్‌ పార్టీకి బలమైన ఓటుబ్యాంకు ఉన్నప్పటికీ నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతుంది. 


బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్  


అయితే ఈ ఏడాదిలో జరిగిన వరుస సంఘటనలు మాత్రం బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్యనే పోటీ అనే విధంగా జరిగాయి. గత ఏడాది చివరిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి సీపీఐ పార్టీ మద్దతు లభించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థికి 96 ఓట్లు మాత్రమే ఉండగా 212 ఓట్లు లభించడంతో ఒక్కసారిగా క్రాస్‌ ఓటింగ్‌ కలకలం లేపింది. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఓటర్లు కాంగ్రెస్‌కు ఓటేయడం ఆ పార్టీలో చర్చగా మారింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కాంగ్రెస్‌కు పెద్దగా కలిసి రాలేదనే చెప్పవచ్చు. అయితే ఆంధ్ర సరిహద్దు ప్రాంతంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉండటంతో కొత్తగా వచ్చే పార్టీలు, పార్టీల పునర్నిర్మాణాలకు ఈ జిల్లా వేదికగా మారింది.


 పార్టీల బలప్రదర్శనకు వేదికగా ఉమ్మడి ఖమ్మం జిల్లా 


ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల తెలంగాణలో ఏర్పాటు చేసిన పార్టీకి మొదటి సభ ఖమ్మంలోనే నిర్వహించడం గమనార్హం. తర్వాత పాదయాత్ర సందర్భంగా ఆమె పాలేరు నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తన సత్తాను చాటేందుకు ఆమె సమాయత్తమయ్యారు. మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో డిసెంబర్‌ నెలలోనే పాలేరు నియోజకవర్గంలో క్యాంప్‌ కార్యాలయం ఏర్పాటు చేయడంతోపాటు ఇక్కడ్నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో ఇప్పుడు పాలేరు నియోజకవర్గంపై ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.


తెలంగాణలో చంద్రబాబు రీఎంట్రీ


తెలంగాణ ఏర్పాటైన తర్వాత కేవలం ఏపీ రాజకీయాలవైపు ఎక్కువగా దృష్టి సారించిన చంద్రబాబు ఈసారి తెలంగాణలోనూ తన సత్తా చాటాలని భావిస్తున్నాడు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ టీడీపీకి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఉండటంతో ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాపై చంద్రబాబు దృష్టి సారించారు. తెలంగాణలో టీడీపీ పునర్నిర్మాణం పేరుతో డిసెంబర్‌ నెలలో చంద్రబాబు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడంతో తెలంగాణలో చర్చగా మారింది. చంద్రబాబు ఏర్పాటు చేసిన సభ సక్సెస్‌ కావడంతో భవిష్యత్‌లో టీడీపీ ప్రభావం ఉమ్మడి జిల్లాలో ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2022 చివరిలో జరిగిన ఈ సభపై అన్ని రాజకీయ పార్టీలు ఓ కన్నేసి ఉంచాయి. మరోవైపు జనసేన పార్టీ సైతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సభ నిర్వహించి తెలంగాణ రాజకీయాల్లో వేగం పెంచేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రెండు కమ్యూనిస్టు పార్టీలకు తెలంగాణ బాస్‌లు ఖమ్మంకు చెందిన వారు కావడంతో ఖమ్మం జిల్లాలో తమ సత్తాను చాటేందుకు ఇరు పార్టీలు సమాయత్తమవుతున్నాయి. మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు పలికిన రెండు కమ్యూనిస్టు పార్టీలు ఒకవేళ వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉంటే ప్రధానంగా ఖమ్మం జిల్లాపైనే దృష్టి సారించే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ 2022లో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ పార్టీల బలాన్ని చాటుకునేందుకు వేదికగా మారిందినే చెప్పవచ్చు.