Maharashtra Karnataka Border: కర్ణాటకతో వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో నివసిస్తున్న వారికి సంఘీభావం తెలుపుతూ మహారాష్ట్ర అసెంబ్లీ మంగళవారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే ప్రవేశపెట్టారు.


బెలగాం, కార్వార్, నిపానీ, భాల్కీ, బీదర్ నగరాలు సహా కర్ణాటకలోని 865 మరాఠీ మాట్లాడే గ్రామాలను ఎట్టిపరిస్థితుల్లోనూ మహారాష్ట్రలో చేర్చేందుకు అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు సుప్రీం కోర్టులో జరుగుతాయని తీర్మానాన్ని సీఎం చదివి వినిపించారు.






కేంద్ర హోంమంత్రితో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం కోరాలని శిందే అన్నారు. అలానే సరిహద్దు ప్రాంతాల్లోని మరాఠీ ప్రజల భద్రతకు హామీ ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.


కర్ణాటక


మరోవైపు సరిహద్దు సమస్యపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చేసిన తీర్మానాన్ని కర్ణాటక శాసనసభ కూడా గురువారం ఏకగ్రీవంగా ఆమోదించింది. భారతీయ జనతా పార్టీ కర్ణాటకతో పాటు మహారాష్ట్రలో అధికారంలో ఉంది. అక్కడ  శిందే నేతృత్వంలోని శివసేన వర్గంతో పొత్తులో ఉంది.


ఠాక్రే


మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (ఉద్దవ్ ఠాక్రే )వర్గం అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే.. ఈ అంశంపై అసెంబ్లీలో సోమవారం ఓ డిమాండ్ చేశారు.  కర్ణాటక, మహారాష్ట్ర మధ్య నడుస్తున్న సరిహద్దు వివాదం (Karnataka Maharashtra Row) పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది భాష, సరిహద్దుకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, మానవత్వానికి సంబంధించిన విషయం అని అన్నారు.



మరాఠీ మాట్లాడే ప్రజలు తరతరాలుగా సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్నారు. వారి దైనందిన జీవితం, భాష, జీవనవిధానం అంతా మరాఠీలకు సంబంధించినది. ఈ అంశం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. కేంద్ర ప్రభుత్వం.. "కర్ణాటక ఆక్రమించుకున్న మహారాష్ట్ర" భూభాగాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలి.                                 "
-ఉద్ధవ్ ఠాక్రే, శివసేన



మరోవైపు ఈ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కూడా ఠాక్రే తప్పుబట్టారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై దూకుడుగా వ్యవహరిస్తుంటే మహారాష్ట్ర సీఎం మెతక వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు.


సరిహద్దు సమస్య


భాష ఆధారంగా రాష్ట్రాలను విభజించిన తర్వాత 1957లో ఈ సమస్య ప్రారంభమైంది. ఇంతకముందు బొంబాయి ప్రెసిడెన్సీలో భాగమైన బెలగావి తమదేనని, ఆ ప్రాంతంలో ఎక్కువ జనాభా మరాఠీ మాట్లాడే ప్రజలు ఉన్నారని మహారాష్ట్ర అంటుంది. ప్రస్తుతం కర్ణాటకలో 800లకు పైగా మరాఠీ మాట్లాడే ప్రజలు ఉన్న గ్రామాలు ఉన్నాయని అంటుంది. భాష ఆధారంగా రాష్ట్రాల పునర్విభజన చట్టం, 1967లో మహాజన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇచ్చిన సరిహద్దులను కర్ణాటక కొనసాగిస్తుంది.


Also Read: Covid Vaccine: హమ్మయ్యా, బూస్టర్‌ డోస్‌గా నాసల్ వ్యాక్సిన్ వచ్చేసింది- ధర ఎంతంటే?