Khammam Nalgonda and Warangal : తెలంగాణలో మరో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అసెంబ్లీ స్థాయి ప్రచారంలో హోరెత్తిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ ఉదయం 8 గంటలకు మొదలైంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లా పరిధిలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికను అన్నిపార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కీలక నేతలంతా వచ్చి ఈ ఎన్నికల్లో ప్రచారం చేశారు. అందుకే పేరుకే ఉపఎన్నికైనప్పటికీ అసెంబ్లీ ఎన్నికల సందడి ఆయా జిల్లాలో నెలకొంది. 


పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి తీన్‌మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జల ప్రేమేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఏనుగల రాకేష్‌రెడ్డి పోటీ పడుతున్నారు. వీళ్లతోపాటు ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల విధానాలను వ్యతిరేకించే వాళ్లంతా కూడా స్వతంత్రంగా బరిలో నిలబడుతున్నారు. వీళ్ల కోసం మూడు ఉమ్మడి జిల్లాల్లో 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం 


తెలంగాణలో 8గంటలకు ప్రారంభమైన ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ జరుగుతున్న మూడు ఉమ్మడి జిల్లాల్లో అధికారులు 144 సెక్షన్ విధించారు. ఈ మధ్య కాలంలో ఎన్నికల టైంలో జరుగుతున్న ఘర్షణలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 8 గంటల వరకు ఈ ఆంక్షలు ఉంటాయి. ఈ ఉపఎన్నిక ఫలితాలు జూన్ ఐదు విడుదల కానున్నాయి. 


ఖమ్మం నల్గొండ వరంగల్ ఉమ్మడి జిల్లాల పరిధిలో 4 లక్షల 63 వేల 839 మంది పట్టబద్రుల ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఈసీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పట్టభద్రులు ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలని నమూనాను పోలింగ్ కేంద్రాల వద్ద అవగాహన కోసం ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రత్యేకమైన పెన్ను అందుబాటులో ఉంచారు. సొంత పెన్నులు వాడకుండా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పెన్నుతోనే ఒకటి రెండు ప్రాధాన్యత ఓట్లను నంబర్లు మాత్రమే వేయాలని అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద సూచనలు చేస్తున్నారు.


పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఈవీఎం పద్ధతిలో కాకుండా బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుంది. ప్రధాన పార్టీలతో పాటు 52 మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో జంబో బ్యాలెట్‌ను ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లా కలెక్టర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ రిటర్నింగ్ అధికారిగా వివరించగా మిగతా జిల్లాల అధికారులు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారితో పాటు మొత్తం 37 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా విధులు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి మండలానికి ఒక పోలింగ్ స్టేషన్‌ ఏర్పాటు చేయగా సిటీలో ఓటర్ల సంఖ్యను బట్టి పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 
పోలింగ్ ప్రక్రియ పూర్తైన వెంటనే బ్యాలెట్ బాక్స్ లను నల్గొండ జిల్లా కేంద్రానికి తరలించనున్నారు అధికారులు. కౌంటింగ్ ప్రక్రియ నల్గొండ జిల్లా కేంద్రంలో జూన్ 5వ తేదీన జరగడంతో వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలో చెందిన బ్యాలెట్ బాక్స్‌లు నల్గొండ జిల్లా కేంద్రానికి తరలివెళ్తాయి.


2021లో ఈ స్థానానికి జరిగిన ఎన్నికలో 5 లక్షల 5 వేల 565 ఓటర్లు ఉండగా.. 3 లక్షల 87 వేల 460 మంది ఓటు వేశారు. జనగామ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజీనామాతో ఈ ఎమ్మెల్సీ ఎన్నిక వచ్చింది. గత ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయక ముందు ఎమ్మెల్సీగా ఉండేవాళ్లు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేశారు. ఆ స్థానానికే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. 


సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా సాధించుకోవాలని బీఆర్‌ఎస్‌ పట్టుదలతో ఉంటే... ఎమ్మెల్సీ స్థానాన్ని కైవశం చేసుకొని పట్టభద్రుల్లో తమకే పట్టు ఉందని నిరూపించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ రెండు పార్టీలను మట్టికరిపించాలనే ఉద్దేశంతో ఆ స్థానంపై కన్నేసింది కాషాయం పార్టీ. మొత్తానికి ఎవరికి వారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని సాధారణ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక హీట్‌ను మరింత పెంచేశారు. 


బీఆర్‌ఎస్ తరఫున హరీష్‌రావు, కేటీఆర్, జగదీష్‌రెడ్డి ఈ ఉపఎన్నికపై ప్రత్యేక దృష్టి పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకెళ్లారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. అయితే దానికి ధీటుగా కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారు. ముఖ్యమంత్రే రెండు మూడు సభల్లో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేసారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి లాంటి వాళ్లు ప్రచారం చేశారు.