Tropical Cyclone Remal: పశ్చిమ బెంగాల్‌లో తీరం దాటిన రెమాల్ బీభత్సం సృష్టించింది. గంటకు 135 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు, కురిసిన జోరు వాన పెను విధ్వంసానికి కారమణయ్యాయి. రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైన తీరం దాటే ప్రక్రియ అర్థరాత్రి వరకూ కొనసాగింది. చివరకు బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య సాగర్ ఐలాండ్, ఖేపుపరా వద్ద తీరం దాటింది.
"రెమాల్ తుపాను పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ఐలాండ్, ఖేపుపరా మధ్య తీరం దాటింది. తుపాను తీరం దాటే టైంలో గంటలకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి." అని వాతావరణ శాఖ తెలిపింది.
రెమాల్ తుపాను ధాటికి భారీ వృక్షాలు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తుపాను ప్రభావం ముందుగానే తెలుసుకున్న ప్రభుత్వం లోతట్టుప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. దీని వల్ల ప్రాణ నష్టం తగ్గించగలిగినా ఆస్తి నష్టం భారీగా జరిగింది.
తుపాను తీరం దాటిన తర్వాత కూడా భారీ వర్షాలు బెంగాల్‌ను ముంచెత్తుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. తీర ప్రాంతంలోని ఇళ్లు, ఇతర భవనాలు నీట మునిగాయి. పడవలు, నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. వ్యవసాయ పంటలకు ఊహించని నష్టం వాటిల్లింది.
మూడు రోజుల నుంచి వాతావరణ శాఖ తుపాను బీభత్సంగా ఉంటుందని హెచ్చరించడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. సుమారు లక్షమందిపైగా ప్రజలను తుపాను షెల్టర్‌లకు తరలించారు. వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కనీస వసతులు కల్పించారు. దక్షిణ 24 పరగణాల, క్యాక్ ద్వీపం, సుందర్‌బన్స్ ప్రాంతాల నుంచి ప్రజలను వేరే ప్రాంతాలకు తరలించారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి మోదీ, సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌తో మాట్లాడిన మోదీ... తీసుకుంటున్న చర్యలపై ఆరా తీసారు. కోలకతాలోని పురాతన భవనాలు, ఎత్తైన భవనాల నుంచి ప్రజలకు అధికారులు ఖాళీ చేయించారు.
విరిగిపోయిన చెట్లు, కూలిన ఇళ్ల శిథిలాలను తొలగించడానికి ప్రభుత్వం ప్రత్యేక బృందాలను నియమించింది. విద్యుత్ పునరుద్ధణ పనులు కూడాలా యుద్ధప్రాతిదికన చేపట్టింది. తుపాను ప్రభావంతో సోమవారం కూడా వర్షాలు పడే అవకాశం ఉందని, బాగా తడిసిన భవనాలు కూలే ప్రమాదం ఉందని అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.