Amaranth Yathra: అమరనాథ్‌యాత్ర...ప్రతి హిందూవు జీవితంలో ఒక్కసారైనా మంచులింగం అవతారంలో ఉన్న ఆ భోళా శంకరుడిని దర్శనం చేసుకోవాలని తపిస్తుంటారు. అందుకు ప్రాణాలు సైతం లెక్కచేయకుండా కఠినమైన మంచుకొండలు ఎక్కి ఆ దేవదేవుడి దర్శనం చేసుకుంటారు. ప్రతి ఏటా జూన్ 29న మొదలై ఆగస్టు 19న అమరనాథ్‌యాత్ర(Amarnath Yatra) ముగుస్తుంది. దీనికోసం దేశ, విదేశాల నుంచి లక్షల మంది భక్తులు ఏడాది పొడవునా ఎదురుచూస్తుంటారు. అయితే అమరనాథుడిని దర్శించుకోవాలంటే మనం గుడికి వెళ్లినట్లు కొబ్బరికాయ తీసుకుని బయలుదేరితే సరిపోదు. దీనికి ముందు చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతోపాటు...హెల్త్ కండీషన్ అంతా బాగున్నట్లు నిర్దేశిత ఆరోగ్య కేంద్రాల నుంచి సర్టిఫికేట్ తీసుకుని వస్తే....అప్పుడు అనుమతిస్తారు. ఇది కూడా కొద్దిమందికి మాత్రమే. ఏప్రిల్ 15 నాటికే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు(Online Registrations) పూర్తయ్యాయి కాబట్టి....అమరనాథ్ యాత్ర వివరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఒకసారి చూద్దాం.....
అమరనాథ్‌యాత్ర జాగ్రత్తలు
సముద్ర మట్టానికి దాదాపు 12వేల అడుగుల ఎత్తులో హిమాలయ(Himalaya) పర్వతశ్రేణుల్లో ఓ అందమైన గుహలో కొలువుదీరిన ఆధునిక వైకుంఠం అమరనాథుని దివ్యక్షేత్రం. ఈ యాత్ర జూన్ 29 నుంచి ప్రారంభమై...ఆగస్టు 19న ముగుస్తుంది. ఇప్పటికే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకుని యాత్రకు సిద్ధంగా ఉన్నవారు తప్పినిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
* అమరనాథ్‌యాత్రకు రెండుమార్గాల్లో అనుమతిస్తారు. ఒకటి బాల్తాల్(Baltal ) బేస్‌క్యాంపు, రెండోది పహల్గమ్(Pahalgam ) బేస్ క్యాంపు. ఈ రెండు బేస్ క్యాంపులు హిమాలయ పర్వతశ్రేణుల్లో మంచుకొండల మధ్యనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చలిని తట్టుకునేలా స్వెట్టర్లు, మంకీ క్యాప్‌లు, చేతులకు రక్షణగా ఉన్ని గ్లౌవ్స్ వెంట తీసుకెళ్లాలి. అలాగే అక్కడి వాతావరణ పరిస్థితులు గంటగంటకు మారిపోతుంటాయి. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు కాబట్టి తప్పనిసరిగా రెయిన్‌కోట్ క్యారీ చేయాల్సి ఉంటుంది. అలాగే వెళ్లేది కొండప్రాంతం...అందులోనూ వర్షంతో జారిపోతూ ఉంటుంది. కావున మంచి గ్రిప్ ఉన్న షూ తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది.
* బాల్తాల్ బేస్ క్యాంపు వరకే వెహికిల్స్ అనుమతిస్తారు. అక్కడ ఆన్‌లైన్‌రిజిస్ట్రేషన్ తనిఖీలు అన్నీ పూర్తి చేసుకున్న తర్వాతే ఇండియన్ ఆర్మీ(Indian Army) యాత్రకు వెళ్లేందుకు అనుమతిస్తారు. ఈ మార్గం నుంచి అమరనాథ క్షేత్రం(Amaranth Cave) కొంచెం తక్కువ దూరం ఉంటుంది. అంతగా ఇబ్బంది ఉండదు. దాదాపు 16 కిలోమీటర్ల మేర మంచుకొండలను దాటుకుంటూ...ఎత్తైన పర్వతశ్రేణుల అంచుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నడవాల్సి ఉంటుంది. నడవలేని వాళ్ల కోసం గుర్రాలు ఉంటాయి. అది కూడా భయమనుకుంటే నలుగురు మనుషులు డోలీలా కట్టుకుని మోసుకుని వెళ్తారు. దీనికి అదనుపు రుసుం కట్టాల్సి ఉంటుంది.
* కశ్మీర్‌లో పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన పహల్గమ్ నుంచి యాత్ర ఎంతో అందగా ఉంటుంది. శ్రీనగర్(Srinagar) నుంచి బస్సులు, ట్యాక్సీల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. పహల్గమ్ నుంచి చందన్‌వాడీ వరకు ట్యాక్సీలకు అనుమతి ఉంటుంది అక్కడి నుంచి కాలిబాటన అమరనాథ్ యాత్రకు చేరుకోవాల్సి ఉంటుంది. ఈ మార్గంలో ఎత్తైన కొండలు, లోయవాలుల మీదుగా అత్యంత కష్టంగా ఉంటుంది యాత్ర. ముందుగా 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న శేష్‌నాగ్(Seshanag)కు చేరుకోవాలి. ఇక్కడ ఐదు కొండలు శేషుడి పడగలా ఒకదానిపక్కన ఒకటి ఉంటాయి. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది.
ఆ కొండలపై ఉన్న మంచు కరిగి కిందనున్న తటాకాల్లోకి చేరుతుంది. నీలిరంగులో స్వచ్ఛమైన నీటితో ఉండే ఆ సరస్సులను చూడటానికి రెండు కళ్లు సరిపోవు. దేశంలో ప్రవహించే చాలా నదులు ఈ పర్వత సానువులు నుంచే మొదలవుతాయి. శేష్‌నాగ్ చేరుకునే సరికి చీకటిపడిపోతుంది కాబట్టి....ఆర్మీ అధికారులు యాత్రకు అనుమతించరు. ఇక్కడే మరో బేస్ క్యాంపు ఉంటుంది. యాత్రికులంతా అక్కడే గుడారాల్లో అద్దె చెల్లించి విశ్రాంతి తీసుకుని తెల్లారి మళ్లీ నడక ప్రారంభించాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మరో 28 కిలోమీటర్లు నడిస్తే అమరనాథ్ గుహకు చేరుకోవచ్చు. ముందుగా బుక్ చేసుకుంటే బాల్తాల్ బేస్ క్యాంపు నుంచి గుహకు సమీపం వరకు హెలీకాప్టర్ సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి.
* పెహల్గమ్ నుంచి యాత్ర అత్యంత కఠినంగా ఉన్నా.. ఆ ఎత్తైన మంచుకొండలు దాటుకుని...ఎగిసిపడుతున్న జలపాతాలను తిలకిస్తూ, కశ్మీర్ అందాలను ఆస్వాదిస్తూ అమరనాథుడి కోసం ముందుకు సాగుతుంటే ఆ కష్టాన్ని మరిచిపోవచ్చు. ఈమార్గంలో కనిపించే ఎత్తైన దేవదారు వృక్షాలు ఎంతో అందంగా కనిపిస్తుంటాయి.
* రెండు మార్గాల్లో వెళ్లేవారు తప్పనిసరిగా ఊతకర్రలను చేతిలో ధరించాల్సిందే. లేదంటే ఎత్తైన కొండలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పట్టుజారిపోతుంటారు. ఇవన్నీ ఇంటి వద్ద నుంచే తీసుకెళ్లాల్సిన పనిలేదు. అక్కడ చాలా తక్కువ ధరకే విక్రయిస్తుంటారు.
* ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఎంటంటే...కశ్మీర్‌లో ప్రీపెయిడ్ ఫోన్లు పనిచేయవు. తప్పనిసరిగా పోస్టుఫెయిడ్ సిమ్ తీసుకోవాల్సిందే. అక్కడ మొబైల్ దుకాణాల్లో బీఎస్‌ఎన్‌ఎల్(BSNL) సిమ్‌లు విక్రయిస్తుంటారు. మన ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ చూపించి సిమ్ కొనుక్కోవచ్చు.
*ఒక్కసారి బేస్ క్యాంపు దాటి ముందుకు వెళ్లామంటే...ఏటీఏం(ATM)లు గానీ, ఫోన్ ఛార్జింగ్ పాయింట్లు గానీ ఏమీ ఉండవు. కాబట్టి ప్రతిఒక్కరూ తప్పనిసరిగా అవసరమైన మేరకు నగదు, ఫోన్, కెమెరా ఛార్జింగ్ బ్యాకప్ తీసుకుని వెళ్లాల్సిందే. లెస్ లగేజీ మోర్ కంఫర్ట్ అంటారు కాబట్టి....ఎంత తక్కువ లగేజీ తీసుకెళ్తే, మీరు యాత్రను అంత కంఫర్ట్‌గా పూర్తి చేసుకుంటారు.
* అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు హైదరాబాద్(Hyderabad), విజయవాడ(Vijayawada), విశాఖ(Visakha)తోపాటు ఇతర ప్రాంతాల నుంచి ముందుగా రైలు, విమానంలో ఢిల్లీ చేరుకోవాలి. అక్కడి నుంచి విమానంలో అయితే నేరుగా శ్రీనగర్ వెళ్లిపోవచ్చు. రైలులో అయితే జమ్ము(Jammu) వరకే వెళ్లొచ్చు. మొదటిసారి యాత్రకు వెళ్లేవారు...జమ్ము నుంచి ట్యాక్సీలో వెళితే కశ్మీర్ అందాలను కళ్లారా చూడొచ్చు.
* బేస్ క్యాంపుకు చేరుకున్న తర్వాత వేకువజాము నుంచే యాత్ర మొదలవుతుంది కాబట్టి వీలైనంత త్వరగా నిద్రలేచి నడకకు ఉపక్రమించాలి.ఎందుకంటే చుట్టూ మంచుకొండలు ఉన్నా...అమరనాథ్‌యాత్ర మార్గంలో ఎండ విపరీతంగా ఉంటుంది. భరించలేనంత ఉక్కపోతతో డీహైడ్రేషన్‌కు గురవుతుంటాం. తప్పనిసరిగా వాటర్ బాటిల్, శక్తినిచ్చే గ్లూకోజ్ ప్యాకెట్లు, డ్రైప్రూట్స్ తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి.
* గుర్రాలు ముందుగా మాట్లాడుకున్న వారు తప్పనిసరిగా వారి గుర్తింపు కార్డును మీరు అడిగి తీసుకోవాలి. ఎందుకంటే బేస్ క్యాంపు దాటేటప్పుడు గుర్రాలన్నీ ఒకవైపు...యాత్రికులను ఒకవైపు పంపిస్తారు. అప్పుడు మీరు తనీఖీలు పూర్తిచేసుకుని వచ్చేటప్పటికీ ఆ గుర్రం యజమానిని గుర్తించాలంటే తప్పనిసరిగా ఆయన గుర్తింపు కార్డు అవసరం. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.
* అమరనాథ్ యాత్ర ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించాల్సిన యాత్ర...కాబట్టి ఇక్కడికి మద్యం సీసాలు, సిగిరెట్లు, గుట్కా ప్యాకెట్లతోపాటు మండే అవకాశం ఉన్న అగ్గిపెట్టెలు, లైటర్లు వంటివి అనుమతించరు. ఆర్మీ తనిఖీ కేంద్రంలోనే ఇవన్నీ స్వాధీనం చేసుకుంటారు కాబట్టి..వెంట తీసుకెళ్లకపోవడం మంచిది
* అమరనాథ్‌యాత్రలో వాతావరణ పరిస్థితులు గంటగంటకు మారిపోతుంటాయి కాబట్టి....అందుకు అనుగుణంగా మనం సిద్ధంగా ఉండాలి. అలాగే పైకి వెళ్లే కొద్ది ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి. శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు ఉన్నావారు, ఆస్తమా ఉన్నవారు వెళ్లకపోవడమే మంచిది. అప్పటికప్పుడు ఏమైనా శ్వాస ఇబ్బందులు తలెత్తితే...దారిపొడవునా ఆక్సిజన్ సిలిండర్లతో ఆర్మీ సిబ్బంది రెడీగా ఉంటారు కాబట్టి భయపడాల్సిన పనిలేదు.
* అమరనాథ్‌యాత్రికులను వచ్చే మరోక అనుమానం తిండి....దీని గురించి అయితే యాత్రికులు బెంగపడాల్సిన పనిలేదు. మీరు బేస్ క్యాంపుకు చేరుకున్నప్పటి నుంచి మళ్లీ తిరిగి వచ్చే వరకు మీ జీవితంలో మీరు చూడని, తినని ఆహారపదార్థాలన్నీ దొరుకుతాయి. అది కూడా ఫ్రీగా.. మీరు ఎంత కావాలంటే అంత తినొచ్చు. స్వీట్లు, హాట్లు, టీ, పాలు, చాక్లెట్లుకు కొదవే ఉండదు. దారిపొడవునా బండారీలు పెద్దఎత్తున ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవారు ఆ ఉత్తరాదీ స్వీట్లు, ఆహారపదార్థాలు చూసి ఆహా అనాల్సిందే. ఏదో మంచుకొండల్లో ఆహారపదార్థాలు అంటే వరద బాధితులకు పులిహోర పొట్లాలు పంచినట్లు పంచుతారమో అనుకుంటే పొరబడినట్లే...ఎందుకంటే అక్కడి వాతావరణం ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఉన్నట్లు ఉంటుంది. రుచికి, శుచికి అత్యంత్ ప్రాధాన్యమిస్తారు. అప్పటికప్పుడు మన కళ్లముందే వేడివేడిగా వండి వడ్డిస్తుంటారు. ఈ బండారీలు మూతవేడయం అంటూ ఉండదు. 24 గంటల పాటు యాత్ర సాగినన్నీ రోజులు వీరు భక్తులకు సేవలు అందిస్తుంటారు. దశాబ్దాలుగా భక్తుల ఆకలి తీరుస్తూ కొన్ని ధార్మిక సంస్థలు ఈ బండారీలను కొనసాగిస్తున్నారు. బిస్కెట్లు, డ్రైప్రూట్స్, స్వీట్లు...మీకు కావాల్సినంత తిని తీసుకెళ్లొచ్చు కూడా. కాకపోతే...తిన్నంత తర్వాత మళ్లీ నడవాల్సి ఉంటుందన్న సంగతి అందరూ గుర్తుంచుకోవాలి.
* దేవదేవుడి దర్శనం ముగించుకున్న తర్వాత ఎప్పుడెప్పుడు కిందికి వద్దామా...కశ్మీర్ అందాలను తిలకించి ఇంటికి వెళ్లిపోదామా అన్న తొందరలో ఉంటారు భక్తులు. మళ్లీ అదే మార్గంలో కిందకు దిగొచ్చు..లేదా మరో మార్గంలో రావచ్చు. చాలామంది పెహల్గమ్ నుంచి దర్శానికి బయలుదేరి..బాల్తాల్ నుంచి కిందకు దిగుతుంటారు. ఇలా అయితే కాశ్మీర్ అందాలను రెండువైపులా చూసినట్లు ఉంటుంది. బేస్ క్యాంపులకు తిరిగి చేరుకున్న తర్వాత అక్కడే చాలా తక్కువ ధరలకే కశ్మీర్ టోపీలు, బట్టలు, గాజులు, ఉన్ని దుస్తులు, బెడ్‌షీట్లు అన్నీ అమ్ముతుంటారు. ఈ 40 రోజుల యాత్ర కోసమే వారంతా ఏడాది పొడవునా ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు సంపాదించుకున్న నాలుగు రూపాయలతోనే వారు ఏడాదిపొడవునా సర్థుకుపోవాలి. కశ్మీర్(Kashmir) ప్రజలకు మోసం చేయడం రాదని వారిని చూస్తేనే తెలుస్తుంది. ఒక్క పర్యాటకం తప్ప వారి జీవనానికి అక్కడ ఎలాంటి ఆధారం లేదు. కాబట్టి వెళ్లినవారు వీలైనంత వరకు వారికి సాయం చేయడానికి ప్రయత్నించండి.
* బేస్ క్యాంపుల నుంచి ట్యాక్సీల ద్వారా శ్రీనగర్(Srinagar) చేరుకోగానే....అందమైన దాల్ సరస్సు రారమ్మని పిలుస్తుంటుంది. ఈ సరస్సులో బోటు షికారు చేయకుండా వెనుదిరిగారంటే....మీ కశ్మీర్ పర్యటన అసంపూర్తిగా మిగిలిపోయినట్లే...మిగిలిన రోజుల్లో గడ్డకట్టుకుపోయి ఉండే ఈ సరస్సు....అమరనాథ్‌యాత్ర జరిగి సమయంలో మాత్రం.....తిరగడానికి చాలా అనువుగానే ఉంటుంది. దాల్ సరస్సులో బోటు షికారుతోపాటు సరస్సు మధ్యలోనే నీటిపై తేలియాడుతుంటే క్రాఫ్ట్ బజారులో మనకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చు. ఆ తర్వాత శ్రీనగర్‌లో తులిప్ గార్డెన్, శంకరాచార్యుల ఆలయం, సోన్‌మార్గ్, సింతన్ టాప్‌తో చూసుకుని ఎయిర్‌పోర్టుకు చేరుకోవడమే. రైలు మార్గంలో ఢిల్లీ వెళ్లాలంటే జమ్ము రావాల్సిందే.