Khairatabad RTA: రోజురోజుకూ ఫ్యాన్సీ నంబర్లకు డిమాండ్ పెరిగిపోతోంది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఈ హవా ఎక్కువగా కొనసాగుతోంది. తమకు ఇష్టమైన నంబర్లను దక్కించుకోవడానికి.. వాహనాలు కొనుగోలు చేసిన దానికంటే ఎక్కువ డబ్బులు ఖర్చు చేసి మరీ నంబర్ ప్లేట్ లను కొనుగోలు చేస్తున్నారు. ఈక్రమంలోనే ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో మంగళవారం రోజు కాసుల పంట పండింది. ఫ్యాన్సీ నంబర్లతో ఒక్కరోజే రూ.53.34 లక్షల ఆదాయం సమకూరింది. అధికంగా టీఎస్ 09 జీసీ 9999 అనే నంబర్ కు రూ.21.60 లక్షలు పలకగా.. అతి తక్కువగా టీఎస్ 09 జీడీ 0027 నంబర్ కు రూ.1.04 లక్షలు పలికింది. 


ఫ్యాన్సీ నంబర్లను అధిక ధరకు కొనుగోలు చేసిన సంస్థలు ఇవే..!



  • టీఎస్ 09 జీసీ 9999 - రూ.21.60 లక్షలు (ప్రైమ్ సోర్స్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్)

  • టీఎస్ 09 జీడీ 0009 - రూ.10.50 లక్షలు (మెఘా ఇంజినీరింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్)

  • టీఎస్ 09 జీడీ 0001 - రూ.3 లక్షలు (ఆంధ్రా ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్)

  • టీఎస్ 09 జీడీ 0006 - రూ.1.83 లక్షలు శ్(గోయజ్ జ్యువెల్లరీ) 

  • టీఎస్ 09 జీడీ 0019 - రూ.1.70 లక్షలు (సితారా ఎంటర్ టైన్ మెంట్స్)

  • టీఎస్ 09 జీడీ 0045 - రూ.1.55 లక్షలు (సాయి పృథ్వీ ఎంటర్ ప్రైజస్)

  • టీఎస్ 09 జీడీ 0007 - రూ.1.30 లక్షలు (ఫైన్ ఎక్స్ పర్ట్స్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్)

  • టీఎస్ 09 జీడీ 0027 - రూ.1.04 లక్షలు (శ్రీనివాస్ కన్ స్ట్రక్షన్స్) 


ఇటీవలే సిమ్లాలో కోటి 12 లక్షల 15 వేల 500లకు వేలం


హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఆసక్తికరమైన కేసు వెలుగు చూసింది. ఇక్కడ కొట్‌ఖాయ్ లైసెన్స్ అథారిటీలో ఓ వ్యక్తి స్కూటీ వీఐపీ నంబర్‌కు రూ.1 కోటి 12 లక్షల 15 వేల 500 వేలం వేశారు. ఈ విషయం గురువారం నాడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఆన్‌లైన్ బిడ్డింగ్ ముగిసిన తర్వాత ఈ వీఐపీ నంబర్ కోటి రూపాయలకు పైగా అమ్ముడైంది. వీఐపీ నంబర్ కోసం కోట్లకు వేలం వేసిన వ్యక్తి పేరు దేశరాజ్. అయితే ఇతను ఎక్కడ నివసిస్తున్నాడనే సమాచారం లేదు. ఇలాంటి పరిస్థితిలో, ఇది ఆన్‌లైన్ మోసం కూడా అయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. స్కూటీ కోసం ఎవరైనా కోట్లాది రూపాయలను వేలం వేస్తే ఎలా అని అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం.. ఇప్పుడు దేశరాజ్ మూడు రోజుల్లో 30 శాతం డబ్బులను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.


ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో పేరు మాత్రమే వెల్లడి..


హిమాచల్ ప్రదేశ్ రవాణా శాఖ అదనపు డైరెక్టర్ హెమిస్ నేగి మాట్లాడుతూ.. దరఖాస్తుదారు దేశ్‌రాజ్ స్కూటీ యొక్క వీఐపీ నంబర్ కోసం రూ. 1.12 కోట్లకు పైగా వేలం వేసినట్లు తెలిపారు. ఆన్‌లైన్ బిడ్‌లో వ్యక్తి పేరు మాత్రమే కనిపించిందని అన్నారు. ఆ వ్యక్తి ఆచూకీని ఇంకా ఆ శాఖ గుర్తించలేకపోయిందని వివరించారు. ఇలాంటి పరిస్థితిలో గందరగోళం ఉండవచ్చని... ఇది ఎవరో కావాలని చేసి ఉంటారని భావిస్తున్నారు.


HP-99-9999 నెంబర్ కోసం బిడ్ వేసిన 26 మంది..


ఫ్యాన్సీ నెంబర్ కోసం హిమాచల్ ప్రదేశ్‌లో కోట్లాది రూపాయల బిడ్‌లు రావడం ఇదే తొలిసారి. అయితే సిమ్లాలో వీఐపీ నంబర్ క్రేజ్ నిజంగా కోట్లాది రూపాయలను ఖర్చు చేయిస్తుందా లేదా అనేది ఇప్పటి వరకూ తెలియట్లేదు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. జనాలు కూడా ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.