మెగాస్టార్ చిరంజీవి తన సినిమా వాల్తేరు వీరయ్య 200వ రోజు వేడుక సందర్భంగా మాట్లాడిన మాటలు ఏపీ మంత్రుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వ పెద్దలు పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా చిత్ర పరిశ్రమపై పడకుండా డెవలప్‌మెంట్ పై ఫోకస్ పెట్టాలని చిరంజీవి మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై వెంటనే కొడాలి నాని, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్ నాథ్, అంబటి రాంబాబు లాంటి వారు స్పందించి చిరంజీవికి వ్యతిరేకంగా మాట్లాడారు. ముందు తమ్ముడిని అదుపులో పెట్టుకోవాలంటూ మాట్లాడారు.
తాజాగా మంత్రుల స్పందనపై నాగబాబు కౌంటర్ ఇచ్చారు. ‘‘శ్రమని పెట్టుబడిగా పెట్టి, పన్నుని ప్రభుత్వానికి అనాపైసలతో సహా కట్టి, వినోదాన్ని విజ్ఞానాన్ని జనానికి పంచిపెట్టి, 24 క్రాఫ్ట్ లకి అన్నం పెడుతున్న ఏకైన పరిశ్రమ చిత్రపరిశ్రమ. ఏ పని లేనోడు పిల్లి తల గొరిగినట్టు.. నిజం మాట్లడిన వ్యక్తి మీద విషం కక్కుతున్నారు ఆంధ్రా మంత్రులు, ఆయన ఫోటో కోసం పడిగాపులు కాసినోళ్లు కూడా ఆయన మీద కారు కూతలు కూస్తున్నారు.
ఆకాశం మీద ఉమ్మాలని చూస్తే మీ ముఖం మీదే పడుతుంది. మీ బతుక్కి మీ శాఖల మీద అవగాహన ఉండదు, అభివృద్ధి అనేదానికి అర్థమే తెలియదు. బటన్ నొక్కి కోట్లల్లో ముంచి వేల మందికి ఉచితాలు పంచడమే అభివృద్ధి అనుకుంటున్నారా? అభివృద్ధి చేయడానికి ఇంకేం మిగిలి లేదనుకుంటున్నారా..! మీ ఆలోచనలు ఎంత క్షీణించి పోయాయో అజ్ఞానంతో కూడిన మీ మాటలు వింటే అర్థం అవుతుంది. మీ దౌర్భాగ్యపు దుర్మార్గపు పాలనకి END CARD దగ్గర్లోనే ఉంది.
NOTE: కాలం గాలమేస్తే ప్రకృతే శత్రువవుతుంది.. ఆరోగ్యాలు జాగ్రత్త.!🤫’’ అని నాగబాబు ట్వీట్ చేశారు.