APBJP : పంచాయితీ నిధుల మళ్ళింపు వ్యవహరం పై భారతీయ జనతా పార్టి ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈనెల 10వ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసనలు తలపెట్టాలని పార్టి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. గ్రామ పంచాయితీల నిధులను జగన్ ప్రభుత్వం దారి మళ్ళించటం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిధులు స్వాహా చేస్తున్నారంటూ, ఇప్పటికే సర్పంచ్ లు ఢిల్లీ వేదికగా ఆందోళనలు కూడ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా మండలాల వారీగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు వీరికి మద్దతుగా రాజకీయ పార్టీలు కూడ రంగంలోకి దిగుతున్నాయి.
ప్రభుత్వాన్ని నిలదీయడానికి వెనుకాడేది లేదన్న బీజేపీ
రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి భారతీయ జనతా పార్టీ సన్నద్దం అవుతోంది. సర్పంచ్ లు చేస్తున్న ఆందోళనకు గతంలోనే భారతీయ జనతా పార్టీ మద్దతు పలికింది. పంచాయితీల నిధులను స్వాహా చేస్తే గ్రామాలు ఎలా అభివృద్ది చెందుతాయని భారతీయ జనతా పార్టీ ఇప్పటికే గళం విప్పింది. ఇదే విషయం పై భారతీయ జనతా పార్టి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రాష్ట్ర స్ధాయిలో నాలుగు జోన్ లలో నిర్వహించిన బీజేపీ జోనల్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పై పోరుబాట పట్టాలని పిలుపునిచ్చారు .
గ్రామపంచాయతీలు నిర్వీర్యానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందన్న బీజేపీ
గాంధీ మహాత్ముడు కలలుకన్న గ్రామ స్వరాజ్యం రావాలని కేంద్రం నేరుగా గ్రామ పంచాయితీలకు నిధులు విడుదల చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులకు మోకాలొడ్డుతోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల గ్రామ పంచాయితీల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేని పరిస్ధితిలు ఏర్పడుతున్నాయని ఈ విషయాలను రాష్ట్ర వ్యాప్త పర్యటనలో తాను గుర్తించానని, దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. సర్పంచ్ ల హక్కుల సాధన కు పోరుబాట పడుతున్నామని పురందేశ్వరి స్పష్టంగా ప్రకటించారు.
కలెక్టరేట్ల ముందు భారీ ధర్నాలు
ఈనెల 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ ల వద్ద ఆందోళన కార్యక్రమాలకు పురందేశ్వరి పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు పార్టి క్యాడర్ అంతా కలసి కట్టుగా పని చేయాలని, స్దానిక నాయకత్వం పంచాయితీల కోసం ఆందోళనలు పాల్గోనాలని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర నేతలు, కోర్ కమిటీ సభ్యలుతో ఆడియో, వీడియో కాన్ఫెరెన్సులు కూడా దగ్గుబాటి పురంధేశ్వరి నిర్వహించారు. అన్ని స్థాయిల బీజేపీ నేతలు కలెక్టరేట్ల ఎదుట జరిగే నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారు.