సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'జైలర్' ఆగస్టు 10న విడుదలవుతున్న విషయం తెలిసిందే. తమిళం తో పాటు తెలుగులోనూ రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే విపరీతమైన హైప్ నెలకొంది. సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు సినీ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా చిత్ర ఆడియో లాంచ్ వేడుకని తాజాగా చెన్నైలో నిర్వహించారు. ఇక ఈ ఆడియో లాంచ్ లో రజనీకాంత్ స్పీచ్ కి ఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోయారు. వేదికపై ఆయన మాట్లాడిన మాటలు, పలికించిన హావభావాలు అందరినీ కట్టిపడేసాయి.


అయితే తన స్పీచ్ లో భాగంగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి రజనీకాంత్ చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రజనీకాంత్ - రమ్యకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన 'నరసింహ' సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. రజనీకాంత్ కెరీర్ లోనే మైల్ స్టోన్ మూవీగా ఈ సినిమాని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాలో నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ తన విలక్షణ నటనతో ఆకట్టుకుంది. ఇక 'నరసింహ' తర్వాత మళ్లీ వీళ్ళిద్దరి జోడి వెండితెరపై కనిపించలేదు. సుమారు 25 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 'జైలర్' సినిమాలో రమ్యకృష్ణ నటించారు.


అయితే తాజాగా జరిగిన 'జైలర్' ఆడియో లాంచ్ లో రజనీకాంత్ మాట్లాడుతూ.. "25 సంవత్సరాల తర్వాత రమ్యకృష్ణతో కలిసి యాక్ట్ చేస్తున్నా. సినిమాలో మా ఇద్దరి సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో దర్శకుడు నెల్సన్ ఇది ఎక్కువైంది, అది తక్కువైందని 8 టేక్ లు తీసుకున్నాడు. నీలాంబరి ముందు ఈ నరసింహ పరువు తీసేసాడు నెల్సన్" అంటూ తన సరదా కామెంట్స్ తో అందరినీ నవ్వించారు. ఇక రజనీ కామెంట్స్ కి రమ్యకృష్ణ, దర్శకుడు నెల్సన్ తెగ నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో రజనీకాంత్ సరదా మాటలకి నెటిజన్స్ సైతం మంత్రముగ్ధులు అవుతున్నారు.


మరోవైపు స్పీచ్ లో భాగంగా రజనీకాంత్ తన జీవితంలో ఎదురైన పరిస్థితులను వివరిస్తూ.."మోరగని కుక్క లేదు. విమర్శించని నోరు లేదు. ఇవి రెండూ జరగని ఊరు లేదు. మనం మన పని చూసుకుంటూ పోతూనే ఉండాలి. అర్థమైందా రాజా" అంటూ రజనీకాంత్ చెప్పడంతో అభిమానుల కేరింతలతో ఆడిటోరియం అంతా దద్దరిల్లిపోయింది. అలాగే దుర్యోధనుడు పాత్ర గురించి రజనీకాంత్ హావభావాలు పలికిస్తూ చెప్పిన డైలాగ్ కూడా ప్రతి ఒక్కరి చేత చప్పట్లు కొట్టించింది. మొత్తంగా రజనీకాంత్ తన స్పీచ్ తో గూస్ బంప్స్ తెప్పించారనే చెప్పాలి.


ఇక జైలర్ విషయానికి వస్తే.. తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాని నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో రజనీకాంత్ కి జోడిగా తమన్నా హీరోయిన్గా నటించగా.. మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ అతిధి పాత్రలు పోషించారు. రమ్యకృష్ణ, సునీల్, యోగి బాబు, జాకీ ష్రాఫ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు.


Also Read : ఆ బాలీవుడ్ మూవీని రిజెక్ట్ చేసిన అల్లు అర్జున్ - కారణం అదేనా?







Join Us on Telegram: https://t.me/abpdesamofficial