ఒకప్పుడు భారతీయ సినిమాపై ఆధిపత్యం చెలాయించిన హిందీ చిత్ర పరిశ్రమ.. గత కొన్నేళ్ల నుంచి ఢీలా పడిపోయింది. సౌత్ ఇండస్ట్రీ దెబ్బకు బాలీవుడ్ గడ్డుకాలం ఎదుర్కోవాల్సి వచ్చింది. దక్షిణాది పాన్ ఇండియన్ మూవీస్ ధాటికి అక్కడి స్టార్ హీరోల సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయారు. సౌత్ సినిమాల సక్సెస్ చూసి బాలీవుడ్ వెన్నులో వణుకు పుడుతోందని మనోజ్ బాజ్ పాయ్ లాంటి హిందీ యాక్టర్ అన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయని, బాలీవుడ్ తిరిగి పుంజుకుంటోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
కరోనాకి ముందు, పాండమిక్ తర్వాత పలు దక్షిణాది సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాయి. 'పుష్ప', RRR, 'కేజీఎఫ్ 2' 'కార్తికేయ 2' లాంటి చిత్రాలు ఒకదాన్ని మించి మరొకటి నార్త్ బెల్ట్ లో సంచలన వసూళ్లు రాబట్టాయి. అదే సమయంలో హిందీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చతికిలపడిపోయాయి. డబ్బింగ్ చిత్రాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటే.. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బాలీవుడ్ మూవీస్ మాత్రం మినిమమ్ ఓపెనింగ్స్ రాబట్టలేకపోయాయి. కానీ ఇటీవల కాలంలో హిందీలోనూ మంచి సినిమాలు వస్తున్నాయి. వరుసగా విజయాలు నమోదవుతుండటంతో, ఇండస్ట్రీకి పూర్వవైభవం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పైగా బాలీవుడ్ నష్టాన్ని పూడ్చే పనిలో జాతీయ మీడియా కూడా తమవంతు సాయం చేస్తోంది. పాజిటివ్ రివ్యూలతో సపోర్ట్ చేస్తోంది.
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, దీపికా పదుకునే కలిసి నటించిన 'పఠాన్' సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై థ్రిల్లర్.. ప్రపంచ వ్యాప్తంగా ₹ 1052.84 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ హయ్యెస్ట్ గ్రాసర్ ఇండియన్ సినిమా ఇదే. ఒకరకంగా బాలీవుడ్ లో నూతనోత్సాహాన్ని తీసుకొచ్చిందని ఈ చిత్రమే అని చెప్పాలి. దీని తర్వాతే హిందీ సినిమాల కోసం జనాలు థియేటర్లకు రావడం ప్రారంభించారు.
రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్ హీరోహీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం 'తూ ఝూథీ మైన్ మక్కార్'. లవ్ రంజన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా, హోలీ వీకెండ్ లో మార్చి 8న రిలీజయింది. దీనికి విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు వచ్చాయి. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ₹220.10 కోట్లకు పైగా వసూలు చేసి, 2023 హిట్ మూవీస్ లిస్టులో చేరిపోయింది.
ఎన్నో వివాదాలు, విమర్శలు, కోర్టు కేసుల నడుమ విడుదలైన 'ది కేరళ స్టోరీ' సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ హిట్ గా నిలిచింది. సుదీప్తో సేన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అదాశర్మ, సిద్ధి ఇధ్నాని ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ఎవరూ ఊహించని విధంగా రూ. 303.97 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇదే క్రమంలో వచ్చిన 'జరా హాట్కే జరా బచ్కే' సినిమా కూడా మంచి విజయం సాధించింది. విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ హీరో హీరోయిన్లుగా లక్ష్మణ్ ఉటేకర్ ఈ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని రూపొందించారు. ఇది బాక్సాఫీస్ వద్ద ₹115.89 కోట్లు వసూలు చేసింది.
కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా 'సత్యప్రేమ్ కి కథ'. సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 29న విడుదలైంది. వరల్డ్ వైడ్ గా ₹117.65 కోట్లు కలెక్ట్ చేసి, సూపర్ హిట్ గా నిలిచింది. అలానే బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ చాలా గ్యాప్ తర్వాత డైరెక్ట్ చేసిన సినిమా ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ కూడా ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన హిందీ చిత్రాల జాబితాలో చేరింది. ఇందులో రణవీర్ సింగ్, ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా నటించారు. జూలై 28న రిలీజైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ₹216 కోట్లు కలెక్షన్స్ రాబట్టగలిగింది.
ఇలా 2023లో మొదటి ఏడు నెలల్లో అర డజను హిందీ సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. సౌత్ డామినేషన్ కొనసాగుతుందని అనుకుంటున్న సమయంలో, బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ పడ్డాయి. ఇప్పుడు లేటెస్టుగా 'గదర్ 2' 'ఓ మై గాడ్' చిత్రాలు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ లో సత్తా చాటాయి. ఇదంతా చూస్తుంటే బాలీవుడ్ సినిమాలు తిరిగి పుంజుకుంటున్నాయనేది స్పష్టమవుతోంది. ఆడియన్స్ మళ్ళీ హిందీ సినిమాలకు అలవాటు పడితే నార్త్ సర్క్యూట్ లో సౌత్ మూవీస్ ని ఆదరిస్తారా లేదా అనేది చూడాలి. రానున్న రోజుల్లో సౌత్ నుంచి 'సలార్ 1' 'ప్రాజెక్ట్ K' 'లియో' 'పుష్ప 2' 'దేవర' 'గేమ్ చేంజర్' 'కింగ్ ఆఫ్ కోట' లాంటి పాన్ ఇండియా చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఇవి బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్లు కొడతాయో మరి.
Also Read : అక్షయ్‌తో కలిసి ‘OMG 2’ మూవీ చూసిన సద్గురు - ఆయన రివ్యూ ఇదే!