రజినీకాంత్ సినిమా విడుదల అంటే ఆ హడావిడే వేరు. ఇప్పటికే అభిమానులు రజినీని స్క్రీన్‌పై చూసి రెండేళ్లు అవుతోంది. అందుకే ‘జైలర్’ కోసం వారంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆగస్ట్ 10న పాన్ ఇండియా స్థాయిలో ‘జైలర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రీ బుకింగ్స్ విషయంలో ఎన్నో రికార్డులను బద్దలుకొట్టింది ఈ చిత్రం. అమెరికాలో అయితే ఇప్పటివరకు ఏ చిత్రం సాధించని ప్రీ బుకింగ్స్‌ను సొంతం చేసుకుంది ‘జైలర్’. అయితే సినిమా విడుదల దగ్గర పడడంతో రజినీ హిమాలయాలకు పయణమయ్యారు. తనకు సమయం దొరికినప్పుడల్లా ఇలా హిమాలయాలకు వెళ్లిపోవడం సూపర్ స్టార్‌కు అలవాటే.
నాలుగేళ్ల గ్యాప్ తర్వాత..
అన్నింటికంటే మనశ్శాంతికి ఉండడం ముఖ్యం అని నమ్మే నటుడు రజినీకాంత్. అందుకే తనకు సమయం కుదిరినప్పుడల్లా హిమాలయాలకు వెళ్లడం, అక్కడ ధ్యానం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏదైనా సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఎక్కువశాతం ఈ హడావిడికి దూరంగా అక్కడికి వెళ్లి ఉండాలనుకుంటారు. ఎట్టి పరిస్థితిలోనూ ప్రతీ ఏడాది హిమాలయాలకు వెళ్లే రజినీకాంత్.. కోవిడ్ పరిస్థితి వల్ల గత నాలుగేళ్ల నుంచి వెళ్లడం కుదరలేదు. అందుకే ‘జైలర్’ రిలీజ్ ఉన్నా సరే ఈ ఏడాది చాలా గ్యాప్ తర్వాత హిమాలయాలకు వెళ్లిపోయారు రజినీ. హిమాలయాలు అని మాత్రమే కాదు.. ఈ సూపర్ స్టార్‌కు దేవాలయాలను సందర్శించడం కూడా చాలా ఇష్టం అని ఇప్పటికే చాలాసార్లు ప్రూవ్ అయ్యింది.
కలెక్షన్స్ విషయంలో..
నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన ‘జైలర్’.. ప్రపంచవ్యాప్తంగా చాలా స్క్రీన్స్‌లో విడుదలకు సిద్ధమయ్యింది. మామూలుగా రజినీకాంత్ సినిమా అంటే అంచనాలు ఒక రేంజ్‌లో ఉంటాయి. అది కూడా నెల్సన్ దిలీప్‌కుమార్ లాంటి ఒక పక్కా కమర్షియల్, ఎంటర్‌టైనింగ్ దర్శకుడితో చేతులు కలిపి రజినీ తెరకెక్కించిన సినిమా కాబట్టి దీనిపై అంచనాలు మరింత ఎక్కువగానే ఉన్నాయి. అసలు సూపర్ స్టార్ ఫ్యాన్స్.. ‘జైలర్’పై ఎన్ని అంచనాలు పెట్టుకున్నారో ప్రీ బుకింగ్స్ చూస్తేనే అర్థమవుతోంది. ఇక ఈ మూవీకి కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. రజినీకాంత్ కెరీర్‌లో ఇటీవల విడుదలయిన సినిమాల్లో ‘జైలర్’ మాత్రమే చాలా భారీ ఎత్తులో విడుదల అవుతోంది.
అక్కడ కూడా హైప్..
‘జైలర్’లో రజినీకాంత్‌కు జోడీగా తమన్నా నటించింది. ఈ సినిమా కోసం ప్రతీ ఇండస్ట్రీ నుంచి సీనియర్ నటులను దింపాడు దర్శకుడు నెల్సన్. మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణన్.. ఇలా స్క్రీన్ మొత్తాన్ని సీనియర్ నటీనటులతో నింపేశాడు. మాలీవుడ్ నుంచి మోహన్‌లాల్, కోలీవుడ్ నుంచి రజినీకాంత్, శాండిల్‌వుడ్ నుంచి శివరాజ్‌కుమార్.. ఇలా మూడు ఇండస్ట్రీల నుంచి మూడు పెద్ద యాక్టర్లు కలిసి సినిమా చేయడం ఇదే మొదటిసారి. వేరే ఇండస్ట్రీ నుంచి ఇలా స్టార్ హీరోలను క్యాస్ట్ చేయడం వల్ల అక్కడ కూడా సినిమాకు హైప్ బాగానే క్రియేట్ అయ్యింది. ఇక ‘జైలర్’ విడుదల కారణంగా చెన్నై, బెంగుళూరులోని పలు ఆఫీసులకు సెలవులు కూడా ప్రకటించారు.
Also Read: ప్రముఖ దర్శకుడు మృతి - విషాదంలో సినిమా ఇండస్ట్రీ
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial