ప్రముఖ మలయాళ దర్శకుడు సిద్ధిఖీ మృతి చెందారు. ఆయన వయసు 63 ఏళ్ళు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆయనకు గుండెపోటు రావడంతో కేరళలోని కొచ్చిలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. పరీక్షలు చేసిన వైద్యులు లివర్ సంబంధిత సమస్యలతో పాటు న్యుమోనియా ఉన్నట్లు తెలిపారు. 


సిద్ధిఖీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సోమవారం మలయాళ చలన చిత్ర పరిశ్రమ నుంచి వార్తలు అందాయి. ఎక్మో సాయంతో చికిత్స అందిస్తున్నట్లు మాలీవుడ్ వర్గాలు తెలిపారు. ఆయన త్వరగా కోలుకుంటారని అభిమానులు ఆశించారు. అయితే... ఈ రోజు సిద్ధిఖీ తుదిశ్వాస విడిచారు. సిద్ధిఖీ అసలు పేరు సిద్ధిఖీ ఇస్మాయిల్. ఆయన దర్శకుడు, స్క్రీన్ రైటర్, ప్రొడ్యూసర్ కూడా! 






మోహన్ లాల్ స్నేహితుడు...
మలయాళంలో భారీ విజయాలు!
మలయాళ చిత్రసీమలోని అగ్ర కథానాయకులలో ఒకరైన మోహన్ లాల్, సిద్ధిఖీ మంచి స్నేహితులు. వీళ్ళిద్దరి కలయికలో పలు చిత్రాలు వచ్చాయి. వాటిలో భారీ విజయాలు ఉన్నాయి. 


మోహన్ లాల్ హీరోగా సిద్ధిఖీ దర్శకత్వం వహించిన 'రాంజీ రావు స్పీకింగ్', 'ఇన్ హరిహర నగర్', 'గాడ్ ఫాదర్', 'వియత్నామ్ కాలనీ', 'కాబూలీవాలా' సినిమాలు భారీ విజయాలు సాధించాయి. అందులో 'రాంజీ రావు స్పీకింగ్' దర్శకుడిగా సిద్ధిఖీ తొలి సినిమా. స్నేహితుడు జెన్ సో జోస్, ఆయన కలిసి ఎస్ టాకీస్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను స్థాపించారు. దానిపై కొన్ని సినిమాలు తీశారు. సిద్ధిఖీ దర్శకత్వం వహించిన చివరి సినిమాలో కూడా మోహన్ లాల్ హీరో కావడం విశేషం. అది 'బిగ్ బ్రదర్' సినిమా. 


తెలుగు, తమిళ భాషల్లో భారీ విజయం సాధించిన రజనీకాంత్ 'చంద్రముఖి' మాతృక, మలయాళ సినిమా 'మణిచిత్రతళు'కు సెకండ్ యూనిట్ దర్శకుడిగా సిద్ధిఖీ పని చేశారు. మెగాస్టార్ చిరంజీవి విజయవంతమైన సినిమాల్లో ఒకటైన 'హిట్లర్' కథ కూడా ఆయనదే. మలయాళంలో ఆ పేరుతో మమ్ముట్టి హీరోగా తీసిన సినిమాను చిరు రీమేక్ చేశారు. 


దిలీప్, నయనతార జంటగా నటించిన మలయాళ సినిమా 'బాడీ గార్డ్'కు సిద్ధిఖీ దర్శకత్వం వహించారు. అది పెద్ద విజయం సాధించింది. ఆ సినిమాను అదే పేరుతో సల్మాన్ ఖాన్ రీమేక్ చేశారు. హిందీ వెర్షన్ సిద్ధిఖీ దర్శకత్వంలో తెరకెక్కింది. అక్కడ కూడా ఆయన విజయ కేతనం ఎగుర వేశారు. తెలుగులో వెంకటేష్, తమిళంలో విజయ్ 'బాడీ గార్డ్'ను రీమేక్ చేశారు. తమిళ 'బాడీ గార్డ్'కు సిద్ధిఖీ దర్శకత్వం వహించారు.


తెలుగులో కూడా ఓ సినిమాకు (Siddique Demise) సిద్ధిఖీ దర్శకత్వం వహించారు. నితిన్, మీరా చోప్రా జంటగా నటించిన 'మారో'కు ఆయనే దర్శకుడు. అయితే... ఆ సినిమా ఆశించిన విజయం అందుకోలేదు. హిందీలో రెండు సినిమాలు, తమిళంలో ఐదు సినిమాలు తీసిన సిద్ధిఖీ... తన మాతృభాష మలయాళంలో మాత్రం 20కి పైగా సినిమాలు తీశారు. సిద్ధిఖీ మృతి పట్ల పలువురు మలయాళ చిత్రసీమ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు.
 
Also Read : వేసవికి 'పుష్ప 2' విడుదల డౌటే - అల్లు అర్జున్ & సుకుమార్ ఏం చేస్తారో?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial