Telangana News: ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మూడు రోజుల విరామం అనంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మీయ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మంగళవారం (జూలై 2) బీఆర్ఎస్ పార్టీకి చెందిన 21 జిల్లాల జెడ్పీ చైర్మన్ లతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. జిల్లాలో రాజకీయ పరిస్థితులపై జెడ్పీ చైర్మన్ లతో కేసీఆర్ చర్చించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఈసారి మళ్ళీ అధికారంలోకి వచ్చి మరో 15 ఏళ్ళు అధికారంలో ఉంటుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఒక లక్షణం ఉందని, ఒకసారి అధికారంలోకి వస్తే పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి ప్రజల చేత ఛీ అనిపించుకునేలా వాళ్ళు ప్రవర్తిస్తారని పేర్కొన్నారు. గతంలో ఎన్టీఆర్ పాలన తర్వాత మళ్ళీ అలాగే జరిగిందని ఆయన గుర్తు చేశారు. 


ప్రజా జీవితంలో ఒకసారి నిలిచిన తర్వాత అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పని చేసేటోళ్లే నిజమైన రాజకీయ నాయకులని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్నీ సవ్యంగా నడిచాయని పేర్కొంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు, తాగు నీటి ఇబ్బందులతో పాటు శాంతి భద్రతల సమస్య తలెత్తి మతకల్లోలాలు కూడా చెలరేగడం బాధ కలిగిస్తున్నదని అన్నారు. అప్పుడు ఉన్న అధికారులే ఇప్పుడు ఉన్నప్పుడు శాంతి భద్రతల సమస్య ఎందుకు వస్తున్నదో ఆలోచించాలన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందని అన్నారు. పార్టీ నాయకులను సృష్టిస్తుంది కాని నాయకులు పార్టీని సృష్టించరని, మంచి యువనాయకత్వాన్ని తయారు చేస్తామని పేర్కొన్నారు.


అత్యున్నత పదవులు అనుభవించి పార్టీని వీడుతున్న వారు నాలుగు రోజులు పదవులు లేకపోతే ఉండలేరా? అని ప్రజలే అసహ్యించుకుంటున్నారని అన్నారు. రాజకీయాల్లో ఉన్న వాళ్లకు సౌజన్యం, గాంభీర్యం ఉండాలని అలా కాకుండా కొందరు కేసీఆర్ ఆనవాళ్లను చెడిపేస్తామంటున్నారని కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు కాబట్టి మరి దాన్నే చెడిపేస్తరా అని ప్రశ్నించారు. మరో రెండేళ్లలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య 160 వరకు పెరగొచ్చని అన్నారు. మహిళలకు కూడా ఎక్కువ అవకాశాలు వస్తాయన్నారు. 




జడ్పీ చైర్మన్ల ఆత్మీయ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి.జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్ రెడ్డి, బాల్క సుమన్, గండ్ర వెంకట రమణారెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.