Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్

Modi Speech in Loksabha: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం లోక్ సభలో సుదీర్ఘంగా సాగింది. ఈ సందర్భంగా మోదీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.

Continues below advertisement

PM Modi Counters to Rahul Gandhi: లోక్ సభలో ప్రధాని మోదీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లక్ష్యంగా తనదైన శైలిలో ఘాటు విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ నిన్న (జూలై 1) లోక్ సభలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మోదీ తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీ చేసిన ఆ వ్యాఖ్యలు దేశ ప్రజలు చాలా ఏళ్ల వరకూ మర్చిపోబోరని.. హిందువులది హింసాత్మక వైఖరి అని రాహుల్ మాట్లాడడం ద్వారా ఆయన సానుభూతి పొందాలని చూస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలపై దేశ ప్రజలు కూడా ఆలోచన చేయాలని మోదీ పిలుపు ఇచ్చారు. మంగళవారం (జూలై 2) లోక్ సభలో ప్రధాని మోదీ.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈసందర్భంగా రాహుల్ గాంధీపైనా కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

Continues below advertisement

రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు
‘‘ఈ సభలో చిన్నపిల్లల చేష్టలు చూస్తున్నాం. రాహుల్ గాంధీ పిల్ల చేష్టలు చాలాసార్లు బయటపడ్డాయి. ఆయన కన్నుకొడతారు.. ఆలింగనం చేసుకుంటారు. రాహుల్ గాంధీ సానుభూతి పొందేందుకు ఆడిన పిల్లాడి డ్రామాలు అందరూ చూశారు. రాహుల్ చెప్పేవి అన్నీ అబద్ధాలు అని తేలిపోయాయి. సభా మర్యాదలను కూడా తగ్గించేలా వారు వ్యవహరించడం చూస్తున్నారు. రాహుల్ గాంధీ చెప్పినట్లుగా నిన్న బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడ్డాయేమో అని అందరూ చూసుకున్నారు. ఆ పార్టీ చెప్పే అబద్ధాలు కాంగ్రెస్ కు మరింత నష్టం కలిగిస్తాయి. 

దళిత, ఓబీసీ వ్యతిరేక వైఖరి వల్లే అంబేడ్కర్, నెహ్రూ కేబినెట్ నుంచి వైదొలిగారు. హిందువులది హింసాత్మక వైఖరి అంటారా? ఇదేనా మీ సంస్కారం. హిందువులపై రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు దేశ ప్రజలు ఎన్నో ఏళ్ల వరకు మర్చిపోరు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంస్కారం ఇదేనా? ఆయన మాటలు క్షమించరానివి. హిందువులపై నిందలు వేయడం ఫ్యాషన్ అయిపోయింది. దీన్ని సహించేది లేదు. హిందువులు అప్రమత్తంగా ఉండాలి. ఈశ్వరుడి రూపం దర్శనం కోసం.. సభలో ప్రదర్శన కోసం కాదు. ఇండి కూటమి నేతలు హిందూ ఉగ్రవాదం అంటూ ప్రచారం చేస్తున్నారు’’ అని మోదీ మాట్లాడారు.

రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇవీ
జూలై 1న లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ తొలిసారిగా సుదీర్ఘంగా దాదాపు గంట 40 నిమిషాల పాటు మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ హిందువులపై కీలక వ్యాఖ్యలు చేశారు. సభలోకి ఆయన శివుడి ఫోటోను తేవడం.. దాన్ని ప్రదర్శించడంతో స్పీకర్ అభ్యంతరం తెలిపారు. బీజేపీ ప్రభుత్వం హిందూమతం పేరు చెప్పి అందరినీ భయపెడుతోందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇంకొంత మంది తమను తాము హిందువులుగా ప్రచారం చేసుకుంటూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. 

అలాంటి వారు అసలు హిందువులే కారని రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. అలా రాహుల్ ప్రసంగం సాగుతుండగానే.. కేంద్ర మంత్రులు, అధికార పక్ష ఎంపీలు తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. మరోవైపు, ప్రధాని మోదీ కూడా రెండుసార్లు రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకునే యత్నం చేశారు. హిందువులంతా హింసావాదులే అన్నట్టుగా రాహుల్ మాట్లాడడం చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Continues below advertisement