PM Modi Comments In NDA Parliamentary Party Meeting: ఎన్డీయే ఎంపీలంతా పార్లమెంటరీ విధి విధానాలు తప్పనిసరిగా పాటించాలని ప్రధాని మోదీ (PM Modi) సూచించారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో (NDA Parliamentary Party Meeting) అధికార పక్ష ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత హోదాలో ఉండి సభలో అవమానకర రీతిలో ప్రసంగం చేశారని.. ఆయనలా ఎవరూ ప్రవర్తించొద్దని అన్నారు. కాంగ్రెస్సేతర నేత వరుసగా మూడోసారి ప్రధాని కావడాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు నిబంధనలను సీనియర్లను అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగం వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
మోదీ ఏమన్నారంటే.?
'పార్లమెంట్‌లో సోమవారం ప్రతిపక్ష నేత ప్రవర్తించిన తీరు అమర్యాదకరం. స్పీకర్ స్థానాన్ని ఆయన అవమానించారు. ఎన్డీయే సభ్యులెవరూ ఆయనలా ప్రవర్తించొద్దు. ప్రధాని కుర్చి దశాబ్దాలుగా ఓ కుటుంబం తన గుప్పిట్లో ఉంచుకుంది. కానీ, మా ప్రభుత్వం దేశ నేతలందరికీ సమాన గౌరవం ఇస్తుంది. పార్టీలకు అతీతంగా ప్రతీ ఎంపీ తమ కుటుంబసభ్యులతో కలిసి ప్రధానమంత్రి సంగ్రహాలయ్ (గతంలోని నెహ్రూ మ్యూజియం)ను సందర్శించాలి. మాజీ ప్రధాని నెహ్రూ నుంచి ఇప్పటివరకూ అందరి ప్రధానుల ప్రయాణాన్ని అందులో అందంగా ప్రదర్శించారు. వారి జీవిత విశేషాలు మనం తెలుసుకోవాలి. ఎంపీలు తాము మాట్లాడాలనుకునే అంశాలపై ముందుగానే అధ్యయనం చేయాలి. మీడియా ముందు అనవసర వ్యాఖ్యలు చెయ్యొద్దు. సొంత నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ చేరువలో ఉండాలి. దేశ సేవకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి.' అని ప్రధాని మోదీ ఎంపీలకు సూచించినట్లు కిరణ్ రిజిజు తెలిపారు.
రాహుల్ వ్యాఖ్యలపై దుమారం
కాగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం పార్లమెంట్‌లో చేసిన తొలి ప్రసంగం తీవ్ర దుమారం రేపింది. ప్రతిపక్ష నేతగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దాదాపు గంట 40 నిమిషాల పాటు చేసిన ప్రసంగంలో పలు అంశాలను ప్రస్తావించారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంపై దాడి చేస్తోందని.. హిందూమతం పేరు చెప్పి అందరినీ భయపెడుతోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఇస్లాం, సిక్కు మతాల గురించి కూడా ప్రస్తావించారు. యువతకు ఉద్యోగాలు, రైతులకు మద్దతు ధర ఇవ్వడం లేదని.. అగ్నివీర్ అంశాలపైనా కేంద్రంపై మండిపడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ప్రతిపక్షాలపై ఉసిగొల్పుతున్నారని.. తనపై ఈడీ 20కి పైగా కేసులు పెట్టిందని ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ వ్యాఖ్యలు చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అంశాలని.. ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అధికారపక్షం తీవ్ర అభ్యంతరం తెలపడంతో రాహుల్ ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించినట్లు పార్లమెంట్ సెక్రటేరియట్ తెలిపింది. స్పీకర్ ఆదేశాలతో రాహుల్ హిందూమతాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో పాటు, ప్రధాని మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్, అగ్నివీర్ వంటి అంశాలపై చేసిన వ్యాఖ్యలను తొలగిస్తున్నట్లు పేర్కొంది.