Loksabha Speaker Expunged Some Portion In Rahul Speech From Records: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) సోమవారం లోక్ సభలో చేసిన ప్రసంగంపై తీవ్ర దుమారం రేగింది. ప్రతిపక్ష నేతగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అగ్నివీర్, మైనార్టీ వంటి అంశాలపై ఘాటుగా స్పందించారు. దీనిపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా.. స్పీకర్ ఓంబిర్లా (Loksabha Speaker Ombirla) చర్యలు చేపట్టారు. సభాపతి ఆదేశాల మేరకు రాహుల్ ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలిగించినట్లు లోక్ సభ సెక్రటేరియట్ తెలిపింది. రాహుల్ హిందూ మతాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో సహా ప్రధాని మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్, అగ్నివీర్, నీట్ పరీక్షల్లో అక్రమాలపై చేసిన వ్యాఖ్యలను తొలగిస్తున్నట్లు పేర్కొంది.


రాహుల్ ఏమన్నారంటే.?


కాగా, లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ తొలిసారిగా ప్రసంగించారు. దాదాపు గంట 40 నిమిషాల పాటు ఆయన ప్రసంగం సాగింది. ఈ క్రమంలో శివుడి ఫోటోను చూపించడంతో.. స్పీకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో ఫోటోలు, ప్లకార్డులు ప్రదర్శించడం నిషేధమని అన్నారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంపై దాడి చేస్తోందని.. హిందూమతం పేరు చెప్పి అందరినీ భయపెడుతోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఇస్లాం, సిక్కు మతాల గురించి కూడా ప్రస్తావించారు. కొంతమంది తమను తాము హిందువులుగా ప్రచారం చేసుకుంటూ విధ్వేషాలు రెచ్చగొడుతున్నారని.. అలాంటి వారు అసలు హిందువులే కారని విమర్శించారు. కాగా, రాహుల్ ప్రసంగం సాగుతున్నంత సేపు, కేంద్ర మంత్రులు, అధికార పక్ష ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ సైతం రెండుసార్లు రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకుని ఆయన వ్యాఖ్యలను ఖండించారు. హిందువులంతా హింసావాదులే అన్నట్టుగా రాహుల్ మాట్లాడడం చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదానికి గానూ ఆయన క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది.


'కేసులు పెట్టి ఇల్లు లాక్కున్నారు'


అధికార పక్ష సభ్యలు అభ్యంతరం చెబుతున్నా రాహుల్ వెనక్క తగ్గకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు. రాజ్యాంగంపై బీజేపీ దాడి చేస్తోందని విమర్శించారు. తనపై 20కి పైగా కేసులు పెట్టారని.. తన ఇల్లు కూడా లాక్కున్నారని మండిపడ్డారు. ఈడీ తనను 55 గంటల పాటు విచారించిందని.. కేంద్రం దర్యాప్తు సంస్థల్ని ప్రతిపక్షాలపై ఉసిగొల్పుతున్నారని ధ్వజమెత్తారు. యువతకు ఉద్యోగాలు కల్పించడం లేదని.. రైతులకు మద్దతు ధర కల్పించకుండా 700 మంది ప్రాణాల్ని బలి తీసుకున్నారని అన్నారు. అగ్నివీర్‌పైనా విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేయగా స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు.


రాహుల్ స్పందన ఇదే


కాగా, తన ప్రసంగంలోని కొన్ని అంశాలు తొలగించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. తాను నిజాలే మాట్లాడానని.. సత్యమెప్పుడూ సజీవంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. 'మోదీజీ ప్రపంచంలో సత్యాన్ని తొలగించవచ్చు. కానీ వాస్తవానికి, సత్యాన్ని తొలగించలేము. నేను చెప్పాల్సిందంతా చెప్పాను, అదే నిజం. వారు కోరుకున్నంత మాత్రాన ఆ అంశాలను తొలగించగలరు. కానీ సత్యమే సత్యం.' అని పేర్కొన్నారు.






Also Read: Mahua Moitra: నన్ను బహిష్కరించినందుకు బీజేపీ భారీ మూల్యం చెల్లించుకుంది - ఎంపీ మహువా మొయిత్రా