TMC MP Mahua Moitra: 18వ లోక్‌సభ తొలి పార్లమెంట్‌ సమావేశాల్లో అధికార, విపక్షాల మధ్య వాడీవేడీగా చర్చ సాగుతోంది. గత రెండు ఎన్నికల కంటే ఈ సారి లోక్ సభలో విపక్షం తన బలాన్ని పెంచుకుంది.  సోమవారం లోక్‌సభలో రాహుల్ గాంధీ పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. ఆయన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra)  కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించారు.  పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలతో ఎంపీ మహువా మెయిత్రా గత లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురి కావడం తెలిసిందే.


ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ లోక్‌సభ స్థానం నుంచి 56,705 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి అమృతా రాయ్‌పై విజయం సాధించి తిరిగి లోక్‌సభకు చేరుకున్నారు.  మళ్లీ సభలో అడుగుపెట్టిన ఆమె.. నాటి విషయాన్ని ప్రస్తావిస్తూ బీజేపీపై విరుచుకుపడ్డారు. తన గొంతును అణచివేసినందుకు అధికార పార్టీ భారీ మూల్యం చెల్లించుకుందన్నారు.


ప్రజలు తగిన సమాధానమిచ్చారు
నేటి లోక్ సభ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా తృణమూల్ ఎంపీ మహువా మెయిత్రా సోమవారం ప్రసంగించారు. ‘‘గత లోక్‌సభ సమావేశాల్లో ఇక్కడ నన్ను నిలబడి మాట్లాడనివ్వలేదు. పార్లమెంటులో ఓ ఎంపీ గొంతును అణచివేసేందుకు అధికార పార్టీ ప్రయత్నించింది. నా సభ్యత్వాన్ని రద్దు చేసి బహిష్కరణ వేటు వేయించింది. కానీ, ఒక ఎంపీని అణగదొక్కినందుకు అధికార బీజేపీ భారీ మూల్యం చెల్లించుకుంది. వారికి ప్రజలు సరైన సమాధానమిచ్చారు. నాపై బహిష్కరణ వేటు వేసినందుకు ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన 63 మంది ఎంపీలను ప్రజలు ఇంటికి పంపించారు. మీ సంఖ్య 303 నుంచి 240కి వచ్చింది.’’ అంటూ మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వంలో  బీజేపీకి స్పష్టమైన మెజార్టీ లేదని, మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆమె ఎద్దేవా చేశారు.  ఈ సంకీర్ణ ప్రభుత్వం ఏదో ఒక రోజు కూలిపోతుందని మహువా ఆరోపించారు. 


సభ నుంచి బహిష్కరణ
ఈ సార్వత్రిక ఎన్నికల్లో మహువా మోయిత్రా పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ లోక్‌సభ స్థానం నుంచి గెలిచి లోక్‌సభకు చేరుకున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో పార్లమెంట్ లో ప్రశ్నలు  అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి డబ్బు తీసుకున్నారని ఆరోపణల కేసులో మహువా మొయిత్రాను పార్లమెంటు ఎథిక్స్ కమిటీ దోషిగా నిర్ధారించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మహువా మొయిత్రాను బహిష్కరించాలని ప్రతిపాదించారు. లోక్‌సభలో ఎథిక్స్ కమిటీ తన నివేదికలో ఆమెను లోక్‌సభ నుంచి బహిష్కరించాలని పేర్కొంది. లోక్‌సభలో వాడివేడి చర్చ అనంతరం మహువా మోయిత్రా బహిష్కరణకు గురయ్యారు. కాంగ్రెస్‌కు చెందిన అధిర్ రంజన్ చౌదరితో సహా ప్రతిపక్ష ఎంపీలు ఎథిక్స్ కమిటీ నివేదికను అధ్యయనం చేయడానికి మరింత సమయం కోరారు. కమిటీ నివేదికపై చర్చ సందర్భంగా మహువా మోయిత్రాను సభలో ప్రసంగించడానికి అనుమతించాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది. కానీ  స్పీకర్ ఓం బిర్లా ఈ అభ్యర్థనను తిరస్కరించారు.