Rahul Gandhi Speech in Lok Sabha: లోక్‌సభ ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి మాట్లాడిన రాహుల్ గాంధీ మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. మొట్టమొదటి స్పీచ్‌తోనే అలజడి సృష్టించారు. మత ప్రస్తావన తీసుకు రావడమే కాకుండా నేరుగా మోదీనే టార్గెట్ చేశారు. హిందూమతం అంటే మోదీ ఒక్కరే కాదని సెటైర్లు వేశారు. రాజ్యాంగాన్ని దెబ్బ తీసే విధంగా బీజేపీ వ్యవహరిస్తోందని, కానీ తాము రాజ్యాంగానికి అండగా నిలబడతామని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో స్పీకర్ ఓం బిర్లాతోనూ వాగ్వాదం జరిగింది. సభకు ముందు సభ్యులంతా స్పీకర్‌ని మర్యాదపూర్వకంగా కలిసి షేక్‌హ్యాండ్ ఇచ్చారు. అయితే ఆ సమయంలో ప్రధాని మోదీ రాగానే స్పీకర్ ఓం బిర్లా వంగి నమస్కారం పెట్టారు. ఆ తరవాత షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ వెంటనే రాహుల్ వచ్చారు. ఆయనకు సాధారణంగా షేక్ హ్యాండ్ ఇచ్చారు.
ఇదే విషయాన్ని రాహుల్ హైలైట్ చేశారు. మోదీ రాగానే అలా ఎందుకు వంగిపోయారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు వినగానే ప్రతిపక్ష నేతలంతా ఒక్కసారిగా అరుస్తూ రాహుల్‌ని సమర్థించారు. అటు NDA నేతలు మాత్రం వ్యతిరేకించారు. వెంటనే హోం మంత్రి అమిత్ షా జోక్యం చేసుకున్నారు. స్పీకర్‌పై ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని మండి పడ్డారు. ఆ తరవాత స్పీకర్ ఓం బిర్లా క్లారిటీ ఇచ్చారు. మోదీ తన కన్నా పెద్ద వారని, కేవలం గౌరవమివ్వాలన్న ఉద్దేశంతోనే అలా వంగి నమస్కారం పెట్టానని చెప్పారు.
"ప్రధానమంత్రి అంటే ఈ సభాధినేత. అంతే కాకుండా ఆయన నా కన్నా వయసులో పెద్దవారు. పెద్ద వాళ్లను అలా గౌరవించుకోవడం నా సంస్కారం. అందుకే ఆయన వచ్చినప్పుడు అలా నమస్కరించాను. అవసరమైతే నేను కాళ్లకీ నమస్కరిస్తాను"
- ఓం బిర్లా, లోక్‌సభ స్పీకర్
ఈ క్లారిటీ ఇచ్చిన తరవాత కూడా రాహుల్ గాంధీ ఊరుకోలేదు. స్పీకర్ అభిప్రాయాలను గౌరవిస్తానని చెబుతూనే..సభలో స్పీకర్ కన్నా పెద్ద వాళ్లు ఎవరూ ఉండరని తేల్చి చెప్పారు. స్పీకర్ ముందు సభ్యులే వినమ్రంగా ఉండాలని సూచించారు. స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరి ముందూ అలా తల వంచకూడదని స్పష్టం చేశారు.