లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా తొలిసారి ప్రసంగించారు రాహుల్ గాంధీ. ఈ క్రమంలోనే శివుడి ఫొటోని చూపించారు. దీనిపై స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో ప్లకార్డ్‌లు, ఫొటోలు ప్రదర్శించడం నిషేధం అని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో రాహుల్ గాంధీ రాజ్యాంగం గురించీ ప్రస్తావించారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంపై దాడి చేస్తోందని మండి పడ్డారు. ఇది జరగకుండా తాము అండగా నిలబడతామని తేల్చి చెప్పారు. ఈ సమయంలోనే హిందూమతం గురించి మాట్లాడారు రాహుల్. బీజేపీ ఈ మతం పేరు చెప్పి అందరినీ భయపెడుతోందని మండిపడ్డారు. ఏ మతమైనా మనుషులకు ధైర్యం ఇస్తుందని వెల్లడించారు. ఇస్లాం, సిక్కు మతాల గురించి కూడా ప్రస్తావించారు. కొంత మంది తమను తాము హిందువులుగా ప్రచారం చేసుకుంటూ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, అలాంటి వాళ్లు అసలు హిందువులే కాదని తీవ్ర విమర్శలు చేశారు. హింసను ప్రేరేపించే వాళ్లను హిందువులు అని ఎలా అనగలమని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ స్పీచ్‌ని అడ్డుకున్నారు. హిందువులంతా హింసావాదులే అన్నట్టుగా మాట్లాడడం చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 






రాహుల్ స్పీచ్ హైలైట్స్ ఇవే..


ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి ఇచ్చిన స్పీచ్‌లోనే మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు రాహుల్. మత ప్రస్తావన తీసుకురావడం వల్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయినా రాహుల్ వెనక్కి తగ్గలేదు. రాజ్యాంగంపై బీజేపీ దాడి చేస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. తనపై 20కి పైగా కేసులు పెట్టడమే కాకుండా ఇల్లు కూడా లాక్కున్నారని మండి పడ్డారు. ఈడీ తనను దాదాపు 55 గంటల పాటు విచారించిందని అసహనం వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థల్ని ప్రతిపక్షాలపై ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. మోదీ దేవుడితో నేరుగా మాట్లాడతారని, బహుశా పెద్ద నోట్ల రద్దు కూడా దేవుడు చెబితేనే చేసి ఉంటారని సెటైర్లు వేశారు రాహుల్. దేశానికి వెన్నెముక లాంటి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించలేదని మండి పడ్డారు. రైతులనూ ఉగ్రవాదులుగా చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లకు మద్దతు ధర కల్పించకుండా 700 మంది ప్రాణాల్ని బలి తీసుకున్నారని అన్నారు. అటు మణిపుర్‌లో ఆ స్థాయిలో హింస చెలరేగినా ఇప్పటి వరకూ మోదీ అక్కడికి వెళ్లలేదని అన్నారు. ఒక్కసారి అక్కడికి వెళ్లి ప్రజల కష్టాలేంటో తెలుసుకోవాలని సూచించారు. 


అదానీ నుంచి ఒక్క మెసేజ్ రాగానే పనులు చాలా వేగంగా జరిగిపోతాయని విమర్శించారు రాహుల్ గాంధీ. నీట్‌ ఎగ్జామ్ కేవలం ధనవంతుల పిల్లల కోసమే నిర్వహిస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో గుజరాత్‌లో కాంగ్రెస్ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. ఈ దేశంలో అంబానీ అదానీ చట్టాలే అమలవుతున్నాయని మోదీ సర్కార్‌కి చురకలు అంటించారు.