Adani Hindenburg: అదానీ గ్రూప్ సంస్థలపై చేసిన ఆరోపణలకు సంబంధించి యూఎస్ షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ తాజాగా షోకాజు నోటీసులందుకుంది. తాము సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) నుంచి ఈ నోటీసుల అందుకున్నట్లు సదరు సంస్థే స్వయంగా తెలిపింది. అదాని గ్రూపుపై 2023 జనవరిలో తాము విడుదల చేసిన నివేదికలో ఇండియన్ రెగ్యులేషన్స్‌ను అతిక్రమించామనే అనుమానాలపై సెబీ తాజా నోటీసులు జారీ చేసిందని పేర్కొంది. జూన్ 27న ఈ నోటీసులు అందుకున్నట్లు జులై 1 న సంస్థ తన బ్లాగ్ పోస్టులో వెల్లడించింది.
సెబీ ముందునుంచీ అటువైపే.. : హిండెన్‌బర్గ్
‘‘అదానీ గ్రూప్ పై మేము గతేడాది నివేదిక విడుదల చేసిన వెంటనే ఆ గ్రూపుకు సెబీ బాసటగా నిల్చుందని మాకు అక్కడి సోర్సెస్ నుంచి అప్పుడే సమాచారమొచ్చింది. సంస్థలో పెట్టిన పెట్టుబడుల్లో షార్ట్ పొజిషన్స్ క్లోజ్ చేయాలని బ్రోకర్లను తెరవెనుక నుంచి సెబీ ఒత్తిడి చేసింది. కొనుగోళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసి సంస్థను కష్టకాలంలో ఆదుకునేందుకు ప్రయత్నించింది. సుప్రీం కోర్టు విచారణ సమయంలో కూడా తొలుత మా నివేదికతో ఏకీభవించిన సెబీ తరువాత విచారణను ముందుకు తీసుకెళ్లలేమని కోర్టుకు చెప్పింది. గత నెలలో అదానీ గ్రూప్ సీఎఫ్‌వో జుగేషిందర్ సంస్థపై వచ్చిన కొన్ని రెగ్యులేటరీ నోటీసులను పట్టించుకోనక్కర్లేదని మాట్లాడారు. అదానీ గ్రూపునకు సెబీతో ఉన్న లింకు వల్లే ఆయన అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు. 2022లో గౌతమ్ అదానీ సెబీ ఛైర్మన్ మదబి పురి బచ్ ను రెండు సార్లు కలిశారు. అసలు అదానీ, హిండెన్ బర్గ్ నివేదిక విషయంలో పనిచేసిన సెబీ ఉద్యోగుల పేర్లేంటి? వాళ్లు అదానీ సంస్థకు చెందిన వారిని ఎన్నిసార్లు కలిశారు. వారి మధ్య నడిచిన కాల్స్ వివరాలేంటి వంటివి సమాచార హక్కు ద్వారా పొందేందుకు అప్లై చేస్తాం. సెబీ తన ఇన్వెస్టిగేషన్ విషయంలో పారదర్శకంగా ఉంటుందో లేదో చూస్తాం’’ అని సంస్థ తన బ్లాగ్ పోస్టులో రాసుకొచ్చింది.
ఈ పోెస్టుతో పాటు సంస్థ ఉంచిన 46 పేజీల ‘సెబీ’ షోకాజ్ నోటీసుని సంస్థ సదరు పోస్టుకి జతచేసింది. ‘‘గతేడాది జనవరిలో హిండెన్ బర్గ్ విడుదల చేసిన నివేదికలో చాలా తప్పుడు వివరణలు, అవాస్తవ ప్రకటనలు ఉన్నాయి. అవి పాఠకులను తప్పుదారి పట్టించే అవకాశముంది’’ అని ఆ నోటీసులో రాసి ఉంది.
మోసం చేసిన వారిని రక్షించడమే లక్ష్యమా
‘‘ఈ రోజు ఈ నోటీసు అంతట్నీ మీ ముందు ఎలాంటి దాపరికం లేకుండా చూపిస్తున్నామంటే అందుకు కారణం.. అసలీనోటీసుకు అర్థమే లేదు. కేవలం ఇండియాలోని అత్యంత బలవంతుల ప్రయోజనాలను కాపాడటం కోసమే దీన్ని రూపొందించారు. వారి మోసాలను కప్పిపెట్డడమే దీని వెనకున్న ఆంతర్యం. మా దృష్టిలో సెబీ తన బాధ్యతను మరచి ప్రవర్తిస్తోంది. పెట్టుబడి పెట్టి మోసపోయిన వారిని రక్షించడం కంటే.. మోసం చేసిన వారిని రక్షించేందుకే ప్రాధాన్యమిస్తోంది’’ అని హిండెన్ బర్గ్ పేర్కొంది.
మేం గర్విస్తున్నాం..
ఈ అదానీ థీసిస్ రాయడంలో అదానీ గ్రూపులో పెట్టుబడి పెట్టిన ఓ ఇన్వెస్టర్ భాగస్వామ్యం కూడా ఉంది. మా ఇన్వెస్టర్ కి మొత్తం కలిపి 4.1 మిలియన్ డాలర్ల గ్రాస్ రెవిన్యూ వచ్చింది. అయితే ఈ రెండేళ్లలో ఈ థీసిస్ పై మేం చేసిన పరిశోధన, లీగల్ ఖర్చులు అన్నీ తీసేస్తే కేవలం 31 వేల డాలర్లే మిగిలాయి. కనీసం బ్రేక్ ఈవెన్ కూడా సాధించకుండా మేం ఈ ఇన్వెస్ట్ మెంటు నుంచి బయటకి వచ్చే పరిస్థితి ఉంది. అదానీ గ్రూపుపై మేము చేసిన నివేదిక ఆర్థిక పరమైన లాభం కోసం చేసింది కానే కాదు. కానీ ఇప్పటి వరకూ మేం చేసిన రీసెర్చిపై మేము గర్విస్తున్నాం. కానీ సెబీ చేసిన ఇన్వెస్టిగేషన్ తో భారత్ మార్కెట్ లో ఇన్వెస్టర్ల సొమ్ముకు మోసాల నుంచి ఎలాంటి రక్షణా లేదని తేలిపోయింది. ఇండియాలో కార్పోరేట్ రక్షణ శూన్యం’’ అని హిండెన్‌బర్గ్ స్పష్టం చేసింది.
షేర్ల విలువ పెంచడానికి అదానీ గ్రూపు అవకతవకలకు పాల్పడుతోందని హిండెన్ బర్గ్ గతేడాది విడుదల చేసిన నివేదిక వల్ల అదానీ గ్రూపు మార్కెట్ విలువ రూ. లక్షల కోట్ల మేర ఆవిరైపోయిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆ గ్రూపు షేర్లపై ఈ నివేదిక ప్రభావం ఉంది. అయితే ఈ నివేదిక బయటకి వచ్చినప్పటి నుంచి ఈ విషయాన్ని సెబీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో అదానీ గ్రూపుకు ఈ ఏడాది జనవరిలో సుప్రీం కోర్టు నుంచి ఊరట లభించింది.