Turbulence In Air Europa Flight : ఎయిర్‌ యూరోపాకు చెందిన విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు విచిత్ర అనుభవం ఎదురైంది. విమానంలో ఒక్కసారిగా వచ్చిన కుదుపులు వారిని భయభ్రాంతులకు గురి చేసింది. ఆ కుదుపులకు ప్రయాణికులు ఏకంగా సీట్ల నుంచి ఎగిరి పడ్డారు. ఒక వ్యక్తి అయితే తలపై ఉన్న క్యాబిన్‌లో చిక్కుకున్నాడు. అతన్ని అతి కష్టమ్మీద ప్రయాణికులు దించారు. 




ఎయిర్‌ యూరోపా సంస్థకు చెందిన బోయింగ్‌ 787-9కు చెందిన విమానం స్పెయిన్ నుంచి ఉరుగ్వేకు బయల్దేరింది. మార్గ మధ్యలో ఒక్కసారిగా విమానం భారీ కుదుపులకు గురైంది. అప్పటికి అందులో 325 మంది ప్రయాణికులు ఉన్నారు. ఏం జరుగుతోందో ప్రయాణికులకు తెలియలేదు. అంతా ఊగిపోతూ ఎటు పడిపోతున్నారో అర్థం కాలేదు. గుంతలు ఉన్న గాట్‌ రోడ్డులో వెళ్తున్న ఎర్ర బస్‌లో మారింది వారి పరిస్థితి.




కుదుపులకు లగేజీ మొత్తం చిందరవందరగా పడిపోయింది. సీట్లు దెబ్బతిన్నాయి. చిన్నారులు బిగ్గరగా ఏడుస్తుంటే పెద్దలు కేకలు వేయడం మొదలు పెట్టారు. కుదుపుల దెబ్బకు ఓ వ్యక్తి తన తలపై ఉన్న ఓవర్‌ హెడ్‌ బిన్‌లో ఇరుక్కుపోయాడు. తోటి ప్రయాణికులు సిబ్బంది సాయంతం ఆయన్ని సురక్షితంగా కిందికి దించారు. 




ఇది జరిగిన కాసేపటికి విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. బ్రెజిల్‌లోని నాటల్ ఎయిర్ పోర్టులో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. వెంటనే గాయపడిన వారికి చికిత్స అందించారు. 


కుదుపులను ముందే గ్రహించిన కెప్టెన్ వార్నింగ్ ఇవ్వడంతో కొంత ప్రమాదం తప్పింది. లేకుంటే ఇంకా భారీ మూల్యం తప్పేది కాదంటున్నారు అందులో ప్రయాణించే వాళ్లు. సిబ్బంది చెప్పడంతో అంతా సీటు బెల్టు పెట్టుకున్నారని వివరించారు. ఆ తర్వాత విమానం కుదుపులకు గురికావడం జరిగిందన్నారు. ఇది చాలా భాయనకమైన అనుభవంగా ప్రయాణికులు చెబుతున్నారు.