Virat Kohli Became The First Player To Clinch Four ICC Titles: విరాట్ కోహ్లీ(Virat Kohli)... టీమిండియాలో స్టార్ ప్లేయర్. క్రికెట్‌లో అతన్ని గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని ముద్దుగా పిలుచుకుంటుంటారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డులను తన పాదాక్రాంతం చేసుకుని కింగ్‌గా... క్రికెట్ సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు. టీ 20 ప్రంపచ కప్ ఫైనల్లో అద్భుత ఇన్నింగ్స్‌తో టీమిండియాకు మరోసారి పొట్టి ప్రపంచకప్‌ను అందించాడు. సెమీఫైనల్ వరకూ వరుసగా విఫలమైన కీలకమైన మ్యాచ్‌లో మాత్రం తనలోని అత్యుత్తమ ఆటగాడిని బయటకు తీసుకొచ్చి మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ అరుదైన చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత సాధించిన ఒకే ఒక క్రికెటర్‌గా మరో రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు.
ఒకే ఒక్కడు
భారత్ T20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీని గెలుచుకుంది. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో సఫారీలపై విజయం సాధించింది. దీంతో టీ20 ప్రపంచకప్‌ను రెండుసార్లు గెలిచిన జట్టుగా టీమిండియా అవతరించింది. ఈ మ్యాచ్‌లో భారత విజయంలో కీలకపాత్ర పోషించిన విరాట్ కోహ్లీ... చరిత్ర సృష్టించాడు. తన క్రికెట్ కెరీర్‌లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిర్వహించిన మూడూ పరిమిత ఓవర్ల ట్రోఫీలను గెలుచుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఐసీసీ నిర్వహించే వైట్ బాల్ క్రికెట్ ట్రోఫీలను గెలుచుకున్న ప్రపంచంలోని ఏకైక ఆటగాడిగా కోహ్లీ చరిత్ర నెలకొల్పాడు. మొత్తం నాలుగు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న తొలి క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. నాలుగు ఐసీసీ వైట్ బాల్ ట్రోఫీలను గెలుచుకున్న ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా నిలిచాడు. అండర్-19 ప్రపంచకప్, T20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, వన్డే ప్రపంచకప్‌లు గెలుచుకున్న తొలి ఆటగాడికి విరాట్ నిలిచాడు. ఎంఎస్ ధోనీ కూడా ఈ ఘనత సాధించలేకపోయాడు.
ఆ ప్రయాణం ఎలా సాగిందంటే
2008లో ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్.. దక్షిణాఫ్రికాతో తలపడింది. ఈ టోర్నీలో భారత్‌కు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఫైనల్ మ్యాచ్‌లో 34 బంతుల్లో 19 పరుగులు చేశాడు. ఈ టోర్నీని డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ 12 పరుగుల తేడాతో గెలిచింది. 2011 ICC వన్డే ప్రపంచకప్ ఫైనల్ భారత్- శ్రీలంక మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 49 బంతుల్లో 35 పరుగులు చేశాడు. అప్పుడు టీమిండియా కెప్టెన్‌గా ధోనీ ఉన్నాడు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 10 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించి వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2013 ఫైనల్ మ్యాచ్ భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 34 బంతుల్లో 43 పరుగులు చేశాడు. అప్పుడు కూడా ధోనినే కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐసీసీ T20 ప్రపంచ కప్ 2024 పైనల్ మ్యాచ్ భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగింది, ఈ మ్యాచ్‌లో కోహ్లీ 59 బంతుల్లో 76 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.