India Women vs South Africa Women Highlights: దక్షిణాఫ్రికా(SA)ను పడగొట్టి రోహిత్ సేన విశ్వ విజేతలుగా నిలిచి రెండు రోజులైన కాకముందే
భారత మహిళ(India Women)ల జట్టు అద్భుతం చేసింది. దక్షిణాఫ్రికా మహిళలతో జరిగిన ఏకైక టెస్టులో ఘన విజయంతో రికార్డు సృష్టించింది. బ్యాటింగ్.... బౌలింగ్‌లో రాణించిన భారత జట్టు... సఫారీలపై ఘన విజయం సాధించింది. చెన్నై చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో లేడీ సెహ్వాగ్ షెఫాలీ వర్మ(Shafali Varma) అద్భుతమైన డబుల్ సెంచరీ, స్మృతి మంధాన(Smaruti Mandana) శతకంతో విరుచుకుపడిన వేళ.. భారత జట్టు 603 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా కేవలం 266 పరుగులకే కుప్పకూలి ఫాల్ ఆన్ ఆడింది. రెండో ఇన్నింగ్స్‌లో కాస్త పోరాడిన సఫారీ బ్యాటర్లు... 373 పరుగులు చేసి అవుటయ్యారు. స్నేహ రాణా పది వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా బ్యాటర్ల పతనాన్ని శాసించింది. అనంతరం కేవలం 37 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళలు... వికెట్ నష్టపోకుండా లాంఛనాన్ని పూర్తి చేసింది. దీంతో ఏకైక టెస్ట్ టీమిండియా వశమైంది.
రికార్డుల మోత
తొలి ఇన్నింగ్స్‌లో భారత మహిళల జట్టు రికార్డు స్థాయిలో 603/6 స్కోరు చేసింది. ఈ ఇన్నింగ్స్ లోనే స్టార్ ప్లేయర్, లేడీ సెహ్వాగ్ షెఫాలీ వర్మ(Shafali Varma)షెఫాలి వర్మ 197 బంతుల్లో 205 పరుగులు చేసింది. ఒకే రోజులో డబుల్ సెంచరీ సాధించి ప్రొటీస్ బౌలర్లను ఓ ఆట ఆడేసుకుంది. షెఫాలి ఊపుకు తోడు స్మృతి మంధాన( Smriti ) మెరుపులు తోడయ్యాయి. స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన కూడా 161 బంతుల్లో 149 పరుగులు చేసి సత్తాచాటింది. ఇక రిచా ఘోష్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ కూడా రాణించడంతో భారీ స్కోర్ ను సాధించింది. ఆరు వికెట్ల నష్టానికి భారత జట్టు 603 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
పోరాడినా సరిపోలేదు
అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన సౌతాఫ్రికాను ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణా బెదరగొట్టింది. అద్భుత బౌలింగ్‌తో అదరగొట్టింది. దీంతో దక్షిణాఫ్రికా 84.3 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. 25 ఓవర్లు బౌలింగ్ చేసిన స్నేహ్ రాణా కేవలం 77 పరుగులు ఇచ్చి ఎనిమిది వికెట్లు తీసింది. స్నేహ్ రాణా బౌలింగ్ ఆడేందుకు సఫారీలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. రాణా విజృంభణతో దక్షిణాఫ్రికా 84.3 ఓవర్లలో 266 పరుగులకే పరిమితమై ఫాలో ఆన్‌లో పడింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన సఫారీలు కాస్త పోరాడారు. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేశారు. కెప్టెన్ లారా వోల్వార్డ్ 122 పరుగులు చేయగా... సునే లూస్ 109 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లోనూ సునే లూస్ 65 పరుగులు చేసింది. నాడిన్ డిక్లెర్క్ హాఫ్ సెంచరీ సాధించింది. కానీ వీరి పోరాటం సరిపోలేదు. టీమిండియా బౌలర్లు సమష్టిగా రాణించడంతో సఫారీలు రెండో ఇన్నింగ్స్‌లో 373 పరుగులకు ఆలౌట్ అయ్యారు. దీంతో టీమిండియా ముందు కేవలం 37 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం 9.2 ఓవర్లలోనే ఛేదించింది. షఫాలీ వర్మ 24, శుభా సతీష్ 13 పరుగులతో అజేయంగా నిలిచి గెలుపును లాంఛనం చేశారు.
స్నేహ్ రాణా అరుదైన రికార్డు
ఈ మ్యాచ్ లో భారత స్పిన్నర్ స్నేహ్ రాణా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టిన రెండో ఇండియన్ బౌలర్‌గా చరిత్ర సృష్టించింది. ఈ జాబితాలో మొదటి బౌలర్ గా 2006 లో ఇంగ్లండ్ పై 10 వికెట్లు తీసిన మహిళ క్రికెట్ దిగ్గజం జులాన్ గోస్వామి ఉంది. అయితే జులాన్ ఫాస్ట్ బౌలర్ కాగా స్నేహ్ రాణా స్పిన్నర్. మొదటి ఇన్నింగ్స్ లో 8 వికెట్లు తీసిన స్నేహ్ రాణా రెండవ ఇన్నింగ్స్ లో కీలకమైన 2 వికెట్లు తీసింది. దీంతో ఈ ఫీట్ సాధించిన తొలి మహిళా స్పిన్నర్ స్నేహ్ రాణానే.