Mumbai CBI Court on Vijay Mallya: రుణ ఎగవేతదారుడైన విజయ్ మాల్యాపై ముంబయిలోని సీబీఐ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు విజయ్ మాల్యా రూ.180 కోట్లను ఎగవేసిన కేసులో స్పెషల్ కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. సీబీఐ కోర్టు జడ్జి ఎస్పీ నాయక్ జూన్ 29న ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయగా.. దాని వివరాలన్నీ మర్నాడు బయటకు వచ్చాయి.
దర్యాప్తు సంస్థ సీబీఐ వాదనలు వినిపిస్తూ.. మూతబడ్డ కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్థ ప్రమోటర్ అయిన విజయ్ మాల్యా ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టారని, తనకు నష్టాలు వచ్చాయని తప్పుడు ఆధారాలు చూపారని సీబీఐ ఆరోపించింది. 2007 నుంచి 2012 మధ్య మాల్యా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి రుణాలు పొంది కింగ్ ఫిషర్ సంస్థలోకి మళ్లించారని వివరించింది.
సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లోని వివరాలను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ ప్రత్యేక కోర్టు.. విజయ్ మాల్యాను రప్పించేందుకు ఓపెన్ ఎండెండ్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడానికి ఇదే సరైన కేసుగా కోర్టు అభిప్రాయపడింది. భారత్‌లోని చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకొనేందుకు మాల్యా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొంటూ నాన్- బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది.
ప్రస్తుతం లండన్ లో విలాసవంతమైన జీవితం గడుపుతున్న విజయ్ మాల్యాను తిరిగి భారత్‌కు అప్పగించాలని భారత ప్రభుత్వం ఎన్నో సంప్రదింపులు జరుపుతున్న సంగతి తెలిసిందే. 2016 లోనే విజయ్ మాల్యా భారత్ నుంచి విదేశాలకు పారిపోయారు. బ్యాంకులకు మొత్తంగా రూ.9 వేల కోట్లకు పైగా రుణాలు ఎగవేసి దేశం విడిచిపోవడం సంచలనంగా మారింది.