Rahul Dravid Thanked Rohit Sharma For November Phone Call: అది 2023 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్‌ ఓడిపోయిన సమయం. టీమిండియా సహా భారత అభిమానులంతా తీవ్ర నిర్వేదంలో ఉన్నారు. నాకౌట్‌ మ్యాచుల్లో టీమిండియా వరుసగా ఓడిపోతుండడంపై అభిమానులు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. అప్పుడు భారత జట్టు హెడ్‌ కోచ్‌గా ఉన్న రాహుల్‌ ద్రావిడ్‌(Rahul Dravid ).. వన్డే ప్రపంచకప్ ఫైనల్‌(ODI World Cup Final) ఓటమి అనంతరం తన పదవికి వీడ్కోలు చెప్తాడని చాలామంది అనుకున్నారు.

ద్రావిడ్‌ కూడా అదే చేద్దామనుకున్నాడు. కానీ అప్పుడు టీమిండియా సారధి రోహిత్ శర్మ(Rohit Sharma) చేసిన ఒక్క ఫోన్‌ కాల్‌...ద్రావిడ్‌ను కోచ్‌గా కొనసాగేలా చేసింది. ఆ ఒక్క ఫోన్‌ కాల్‌తోనే టీ 20 ప్రపంచకప్‌ 2024 దిశగా తొలి అడుగు పడింది. ఆ తర్వాత ద్రావిడ్‌ మార్గ నిర్దేశంలో... రోహిత్‌ సారథ్యంలో టీమిండియా విశ్వ విజేతగా నిలిచింది. అప్పుడు తనకు ఫోన్‌ కాల్‌ చేసి హెడ్‌ కోచ్‌గా ఉండేలా చేసిన రోహిత్‌ శర్మకు ద్రావిడ్‌ ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలిపారు.





 

అసలు అప్పుడు ఏం జరిగింది..?

2023లో వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో టీమిండియా ఓడిపోయింది. ఈ పరాజయంతో రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్ పదవిని వదిలేయాలనుకున్నాడు. అయితే రోహిత్ శర్మ ద్రావిడ్‌కు ఫోన్‌ చేసి కోచ్‌గా కొనసాగేందుకు ఒప్పించాడు. రోహిత్ శర్మ నుంచి వచ్చిన ఒక్క  ఫోన్ కాల్ టీ 20 ప్రపంచ కప్ 2024 టైటిల్‌ను గెలవడానికి సహాయపడింది. ఇప్పుడు దీనిపై రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. గత నవంబర్‌లో రోహిత్‌ శర్మ తనకు ఫోన్‌ చేసి కోచ్‌గా కొనసాగేందుకు ఒప్పించాడని అందుకు రోహిత్‌కు ధన్యవాదాలని రాహుల్ ద్రావిడ్ తెలిపాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌లో ఓటమి తర్వాత తాను ప్రధాన కోచ్ పదవిని వదులుకోవాలని అనుకున్నానని... అయితే రోహిత్ శర్మ తనకు ఫోన్ చేసి ఆ పదవిలో కొనసాగేందుకు ఒప్పించాడని కూడా చెప్పాడు. ఈ పనిచేసినందుకు రోహిత్ శర్మకు రాహుల్ ద్రవిడ్ కృతజ్ఞతలు తెలిపాడని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.

 

ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పుకోవాలని రాహుల్ ద్రవిడ్ నిర్ణయించుకున్నారని, అయితే రోహిత్ శర్మ, జై షా ద్రావిడ్‌ను ఒప్పించారని సూర్య భాయ్‌ తెలిపాడు. ద్రవిడ్ హెడ్‌ కోచ్‌గా ఉన్నప్పుడే టీమిండియా T20 ప్రపంచ కప్ 2024 టైటిల్‌ను గెలుచుకుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక పాత్ర పోషించాడు. టీ20 ప్రపంచకప్‌తో ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. అయితే హెడ్‌ కోచ్‌గా చివరి ప్రసంగంలోనూ ద్రావిడ్‌... భారత జట్టుకు దిశా నిర్దేశం చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఐసీసీ నిర్వహించే వన్డే, టీ 20, ఛాంపియన్స్‌ ట్రోఫీలను గెలుచుకున్నామని... ఇక టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ కూడా గెలవాలని జట్టు సభ్యులకు ద్రావిడ్‌ దిశానిర్దేశం చేశాడు.