రెండు, మూడు నెలల్లో సంచలన వార్త వింటారని తెలంగాణ సీఎం కేసీఆర్ బెంగళూరులో ప్రకటించారు. జేడీఎస్ అగ్ర నేతలు దేవగౌడ, కుమార స్వామిలతో భేటీ తర్వాత ఉమ్మడి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్బంగా  కేంద్రంలో మార్పు త‌థ్య‌మ‌ని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మార్పును ఎవ్వ‌రూ అడ్డుకోలేర‌ని ధీమా వ్య‌క్తం చేశారు.  ఈ సంద‌ర్భంగా దేశంలో నెల‌కొన్న ప్ర‌స్తుత ప‌రిస్థితులతో పాటు రాజ‌కీయ అంశాల‌పై అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు.  ఎందరో ప్ర‌ధానులు దేశాన్ని ప‌రిపాలించార‌ని, ఎన్నో ప్ర‌భుత్వాలు రాజ్యాన్ని ఏలాయ‌ని.. అయినా.. దేశ ప‌రిస్థితి ఏమాత్రం మార‌లేద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర రావు ఆవేదన వ్యక్తం చేశారు. 



ఇన్ని సంవ‌త్స‌రాలు గ‌డ‌చినా… ఎక్క‌డ వేసిన గొంగ‌లి అక్క‌డే వుండిపోయింద‌ని అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఒకప్పుడు భార‌త్ కంటే త‌క్కువ జీడీపీ వున్న చైనా ఇప్పుడు ఆర్థికంగా ప్ర‌పంచాన్ని శాసిస్తోంద‌న్నారు. మోదీ ప్ర‌భుత్వం మాత్రం 5 ట్రిలియ‌న్ డాల‌ర్ల బిజినెస్ అంటూ ప్ర‌చారం చేస్తోంద‌ని, ఇది దేశానికే అవ‌మాన‌మ‌ని అన్నారు. నిజంగా మ‌న‌సు పెట్టి అభివృద్ధి చేస్తే.. అమెరికాకంటే ఆర్థికంగా మ‌న‌మే ఫ‌స్ట్ ప్లేస్‌లో వుంటామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం దేశంలో స్వ‌తంత్ర భార‌త అమృతోత్స‌వాల‌ను జరుపుకుంటున్నామ‌ని, అయినా… క‌రెంట్ కోసం, మంచినీళ్ల కోసం, సాగు నీటి కోసం ఇంకా అల్ల‌ల్లాడుతూనే వుంద‌ని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రంలో ఎవ‌రి సార‌థ్యంలో ప్ర‌భుత్వం ఏర్ప‌డుతుంది అన్న‌ది ఇక్క‌డ ప్ర‌ధానం కాద‌ని, ఒక ఉజ్వ‌ల భార‌తం కోసం శ్ర‌మించాల్సిన అవ‌స‌రం ఉన్నారు. 



రోజురోజుకీ ప‌రిస్థితి దిగ‌జారిపోతోంద‌ని   దేశంలోని ఏ వ‌ర్గం కూడా మోదీ పాల‌న‌తో సంతోషంగా లేద‌ని సీఎం కేసీఆర్ విమ‌ర్శించారు. అంతకు ముందు బెంగళూరులోని తమ నివాసంలో కేసీఆర్‌‌కు దేవెగౌడతో పాటు ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఘనంగా స్వాగతం పలికారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.  కేసీఆర్ వెంట ఎంపీ సంతోష్ తదితరులున్నారు.జాతీయ స్థాయిలో బీజేపీ యేతర కూటమి ఏర్పాటు దిశగా నేతలు చర్చించారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా బెంగళూరులో కటౌట్‌తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దేశ్‌కి నేత అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి.