ISB తన ప్రయాణంలో కీలక మైలురాయి చేరిందన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఇండియన్ బిజినెస్‌ స్కూల్‌ ఈ స్థాయికి రావడానికి చాలా మంది శ్రమ దాగి ఉందని అభిప్రాయపడ్డారు. 2001లో అప్పటి ప్రధానమంత్రి వాజ్‌పేయి చేతుల మీదుగా ఇది ప్రారంభమైందని... ఇప్పుడు ఆసియాలోనే ఉన్నత సంస్థల్లో ఒకటిగా నిలిచిందని కితాబిచ్చారు. యాభై వేల మంది ఇక్కడ శిక్షణ పొందారని.. వారిలో చాలా మంది వందల స్టార్టప్‌లు మొదలు పెట్టారని వివరించారు. ఐఎస్‌బీలో చదివిన వాళ్లు విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని కూడా తెలిపారు. 


2014 నుంచి విప్లవాత్మకమైన మార్పులు


ఇండియా అంటేనే బిజినెస్ అని ప్రపంచం నమ్ముతోందన్నారు ప్రధానమంత్రి. ఆ దిశగానే యువత సన్నద్దం కావాలని సూచించారు. యువత కోసం పాలనా సంస్కరణలు చేపట్టామాని.. వారితో కలిసి పని చేయడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ప్రపంచాన్ని నడిపించగలమని భారత్‌ యువత చాటి చెబుతోందన్న ప్రధానమంత్రి... ఆలోచన బాగుండి.. క్షేత్రస్థాయిలో పని రాకపోతే ఫెయిల్ అవుతారని సూచించారు. రిఫామ్‌, ఫెర్ఫామ్‌, టాన్స్‌ఫామ్‌ ప్రతి ఒక్కరి చాలా అవసరం అన్నారు మోదీ. భారత్‌ చెప్పే పరిష్కారాలను ప్రపంచం ఆచరిస్తోందన్న ప్రధానమంత్రి... ఆ దిశగా యువత దేశం చేపట్టే కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలన్నారు. దేశం లక్ష్యాల సాధన కోసం అంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. 2014 నుంచి పరిపాలన పరమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని.. అవి నిరంతరంగా కొనసాగుతున్నాయన్నారు. యువత కోసం చాలా మార్పులు చేయగలిగామన్నారు. 


వృద్ధి కేంద్రంగా భారత్


జి 20 దేశాల్లో భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అభివర్ణించారు మోదీ. మారిన టెక్నాలజీతో అనుసంధానం కావాలన్నారు ప్రధాన మోదీ. ప్రపంచంలో అత్యధిక డిజిటల్ లావాదేవీలు భారత్‌లోనే జరుగుతున్నాయని తెలిపారు. స్మార్ట్‌ఫోన్ డేటా వినియోగదారుల విషయంలో, భారతదేశం మొదటి స్థానంలో ఉందన్నా ఆయన... ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్యను పరిశీలిస్తే రెండో  స్థానంలో ఉందన్నారు. గ్లోబల్ రిటైల్ ఇండెక్స్‌లో భారతదేశం కూడా ప్రపంచంలో రెండవ స్థానంలో ఉందని వివరించారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ భారతదేశంలో ఉందని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద వినియోగదారు మార్కెట్ కూడా భారతే అన్నారు. అభివృద్ధికి ప్రధాన కేంద్రంగా భారత్‌ ఎదుగుతోందని... గతేడాది భారత్‌లోకి అత్యధిక ఎఫ్‌డిఐలు వచ్చాయని గుర్తు చేశారు.


పాతికేళ్ల రోడ్డు మ్యాప్ రెడీ


75 ఏళ్ల అభివృద్ధి మాత్రమే కాదు రాబోయే 25 ఏళ్ల రోడ్ మ్యాప్ రెడి చేస్తున్నామన్నారు ప్రధానమంత్రి. నవ భారత్ నిర్మాణం కోసం ప్రణాళికలు రెడి అవుతున్నాయని తెలిపారు. ఇందులో యువత ప్రధాన భూమికి పోషించాలన్నారు. ప్రతి సమస్యకు యువత వద్ద పరిష్కార ఉందని... అలాంటి యువతను ప్రోత్సహించేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని భరోసా ఇచ్చారు. యువత టాలెంట్ పేపర్లకు మాత్రమే పరిమితం కాకూడదన్న మోదీ.. పాలసీలు ఏదైనా తీసుకుంటే అవి ఒక గదికో, పేపర్లకు పరిమితం కాకూడదన్నారు.చిన్న పని కోసం బ్యాంకులకు వెళ్లే రోజులు ఇవి కావన్న మోదీ.. ప్రతి ఒక్కరి చేతిలోకే బ్యాంకింగ్ సెక్టార్ తీసుకొచ్చామన్నారు. క్రీడల్లో సైతం ఇండియా సత్తా చాటుతోందని కేలో ఇండియా పేరుతో క్రీడాకారులకు కేంద్రం ప్రోత్సహిస్తోందని గుర్తు చేశారు.