బెంగళూరు విషయంలో ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అక్కడి అధికార పార్టీ నేతల్ని.. ప్రభుత్వంలోని వారిని కూడా బాగా ఆలోచింప చేసినట్లుగా ఉన్నాయి. బెంగళూరులో మౌలిక సదుపాయాల సమస్యలు ఎక్కువగా ఉన్నాయని ఓ ఐటీ కంపెనీ అధిపతి చేసిన ట్వీట్‌కు రప్లయ్ ఇచ్చిన కేటీఆర్ .. బ్యాగ్‌లు సర్దుకుని హైదరాబాద్ వచ్చేయాలన్నారు. దానిపై కర్ణాటకలో దుమారం రేగింది. కేటీఆర్ మాటల్ని సమర్దించిన కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తాము వచ్చి మళ్లీ బెంగళూరును బాగు చేస్తామన్నారు. దీనిపై బీజేపీ మండిపడింది. ముఖ్యమంత్రి బొమ్మై కూడా స్పందించారు. 


భారతదేశం మాత్రమే కాదు.. ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది బెంగళూరు వస్తున్నారని.. నగరంలో అత్యధిక సంఖ్యలో స్టార్టప్‌లు ఉన్నాయని చెప్పారు. బిలియన్ల డాలర్ల విలువైన యునికార్న్‌లు అత్యధికంగా బెంగళూరులో ఉన్నాయని తెలిపారు. బెంగళూరును హైదరాబాద్‌తో పోల్చడం చాలా పెద్ద జోక్ అని వ్యాఖ్యానించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అత్యధికంగా ఆకర్షిస్తున్న నగరం బెంగళూరని చెప్పారు. గత మూడు త్రైమాసికాల్లో దేశం యొక్క విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో అత్యధికంగా 40 శాతం ఆకర్షించడం ద్వారా భారతదేశంలో కర్ణాటక మొదటి స్థానంలో ఉందని చెప్పారు. 


సీఎం బొమ్మై మాటలకు కొనసాగింపు అన్నట్లుగా తాజాగా కర్ణాటక డెవలప్‌మెంట్ ఇండెక్స్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి  రాష్ట్రానికి రెండు భారీ కంపెనీలు వచ్చాయని చెబుతూ కేటీఆర్‌ను ట్యాగ్ చేసింది. కర్ణాటకలో 11 వేల 500 కోట్ల రూపాయల పెట్టుబడితో రెండు లిథియం అయాన్ బ్యాటరీ యూనిట్లు ఏర్పాటు కాబోతున్నాయని తెలిపింది. బ్యాటరీ కంపెనీ ఎక్సైడ్ ప్లాంట్ కూడా ఏర్పాటు కాబోతుందని పేర్కొంది. 



పెట్టుబడులు వస్తే కేటీఆర్‌కు ట్యాగ్ చేయడం అంటే.. ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేయడమేనని భావిస్తున్నారు. ఈ ట్వీట్‌కు కేటీఆర్ రిప్లయ్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. హైదరాబాద్‌కు వచ్చిన పెట్టుబడుల వివరాలను ఆయన వెల్లడించే అవకాశం ఉంది. నిజానికి దక్షిణాదిలో హైదరాబాద్, బెంగుళూరు పెట్టుబడుల్లో పోటీ పడుతున్నాయి. పోటాపోటీగా ఉంటున్నాయి. ఈ ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్నే కొనసాగిద్దామని కేటీఆర్ కూడా చెబుతున్నారు.  హలాల్, హిజాబ్ వంటి సమస్యలు కాదని ఐటీ రంగంలో పోటీ పడతామని ఆయన  అంటున్నారు. అయితే అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వం కావడంతో.. ఇలా హలో కేటీఆర్ అంటూ ట్వీట్లు వస్తున్నాయి.