ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌తో సమావేశం అయ్యారు. వీరి మధ్య భేటీ దాదాపుగా రెండు గంటల పాటు సాగింది. హర్యానా సీఎంతో సమావేశం కోసమే ప్రత్యేకంగా జగన్ తాడేపల్లి నుంచి విశాఖ వచ్చారు. బే పార్క్‌లో హర్యానా సీఎం నేచురోపతి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. బుధవారం వరకూ ఆయన విశాఖలోనే ఉంటారు. ఏపీకి వచ్చిన హర్యానా సీఎంను జగన్ మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశారని ఈ సమావేశానికి ప్రత్యేకమైన ఎజెండా ఏమీ లేదని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.


అయితే ముఖ్య మంత్రి దాదాపుగా రెండు గంటల పాటు సమావేశం కావడంతో కీలకమైన అంశాలపై చర్చలు జరిగి ఉంటాయని భావిస్తున్నారు. మనోహర్ లాల్ ఖట్టర్ బీజేపీ పాలిత రాష్ట్రం హర్యానాకు సీఎం. ఆయన  బీజేపీ తరపున ఏమైనా చర్చలు జరిపి ఉంటారా అన్న సందే్హం రాజకీయవర్గాల్లో కలుగుతోంది. త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. తమ అభ్యర్థిని ఏకగ్రీవంగా గెలిపించుకోవడానికి అవసరమైన మెజార్టీ భారతీయ జనతా పార్టీకి.. ఎన్డీఏకు లేదు.  ఖచ్చితంగా ఇతర పార్టీల మద్దతు తీసుకోవాల్సిందే. వైఎస్ఆర్‌సీపీకి అటు ఎంపీల పరంగా.. ఇటు ఎమ్మెల్యేల పరంగా కూడా గణనీయమైన ఓట్లు ఉన్నాయి . వైఎస్ఆర్‌సీపీ మద్దతిస్తే బీజేపీ పని సులువు అవుతుంది . ఈ అంశంపై ఖట్టర్ చర్చించి ఉండవచ్చని భావిస్తున్నారు. 


అయితే రాష్ట్రపతి ఎన్నికలైనా లేకపోతే  బీజేపీతో సంబందం ఉన్న రాజకీయాలు అయినా సరే చర్చించాలంటే  బీజేపీలో ప్రత్యేకమైన వ్యవస్థ ఉంటుందని ఓ ముఖ్యమంత్రి ప్రైవేటు పర్యటనకు వెళ్లినప్పుడు చర్చలు జరపరని అంటున్నారు. పైగా మనోహర్ లాల్ ఖట్టర్‌కు హర్యానా సీఎంగా మాత్రమే బాధ్యతలు ఉన్నాయి. జాతీయ రాజకీయాల్లో బీజేపీ తరపున ఆయనకు ప్రత్యేకమైన విధులేమీ అప్పగించేలదు. దీంతో  రాష్ట్రపతి ఎన్నికల గురించి కానీ.. జాతీయ రాజకీయాల గురించి కానీ ఖట్టర్ చర్చించే అవకాశం లేదని భావిస్తున్నారు. 


హర్యనా అసెంబ్లీకి ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నాయి. రైతు ఉద్యమం కారణంగా హర్యానా ప్రభుత్వంపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ క్రమంలో సీఎం జగన్ రాజకీయంగా కొన్ని అనుభవాలను ఆయనతో పంచుకుని ఉంటారని భావిస్తున్నారు. రాజకీయ వ్యూహాలపై ఒకరినొకరు అభిప్రాయాలు తెలుపుకుని ఉంటారంటున్నారు. మొత్తంగా సీఎం జగన్ విశాఖలో ఒక్క ఖట్టర్‌తో మాత్రమే సమావేశమయ్యారు. ఇంకెలాంటి అధికారిక కార్యక్రమాలులేవు. ఆ కార్యక్రమంలోనూ హర్యానా సీఎంతో ఏం చర్చించారన్నది మాత్రం సీక్రెట్‌గానే ఉంచారు.