కర్ణాటక కలబురిగిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది హైదరాబాద్ వాసులు మరణించగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ముగ్గురి మృతదేహాలు శనివారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నాయి. గోడేకీ కబర్‌కు చెందిన శివకుమార్, రవళి, దీక్షిత్ మృతదేహాలను మొదటగా గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. అనంతరం కుటుంబసభ్యులు గోడే కీ కబర్‌కు తీసుకెళ్లారు. గాంధీ ఆసుపత్రికి చేరుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముగ్గురి మృతదేహాలకు నివాళులర్పించారు.
పురానాపూల్ శ్మశానవాటికలో అంత్యక్రియలు
కర్ణాటక నుంచి హైదరాబాద్ కు తరలించిన ఆ ముగ్గురి మృతదేహాలకు నేడు పురానాపూల్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. శివకుమార్, రవళి, దీక్షిత్ మృతదేహాలకు మరికాసేపట్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరికొన్ని గంటల్లో అర్జున్‌కుమార్, సరళాదేవి, దివాన్ష్, అనిత మృతదేహాలను సైతం హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. మరో కుటుంబానికి చెందిన నాలుగు మృతదేహాలకు రేపు అంత్యక్రియలు జరగనున్నాయి.
గోవాలో బర్త్‌డే వేడుకలు
హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అర్జున్ కూమార్తె బర్త్ డే వేడుకల కోసం స్నేహితులు, బంధువులంతా కలిసి గోవా వెళ్లారు. మే 29న వీరు గోవా వెళ్లి పార్టీ చేసుకున్నారు. అనంతరం గోవా నుంచి హైదరాబాద్ తిరిగి వస్తుండగా శుక్రవారం ఉదయం కర్ణాటకలో ఈ ప్రమాదం జరిగింది. బర్త్ డే వేడుకలు జరుపుకుని సొంతూరుకు తిరిగొస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి కుటుంబసభ్యులు పలువురు చనిపోవడంపై తెలంగాణ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం వీరి కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. మిగతావారికి వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
అసలేం జరిగిందంటే..
కలబురిగి జిల్లా కమలాపురలో ప్రైవేటు బస్సు అటుగా వెళ్తున్న ఓ ట్రక్కుని ఢీకొట్టి కల్వర్టు పై నుంచి బోల్తా పడింది. బోల్తా పడిన సమయంలో డీజిల్ ట్యాంకు లీక్ అవడంతో తక్కువ సమయంలోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. దీంతో నలుగురు అక్కడిక్కడే సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మరో నలుగురు మృతి చెందారు. బస్సు గోవా నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
ప్రమాదంలో అర్జున్ (37), సరళ(32), బి.అర్జున్(5), శివకుమార్(35), రవళి(30), దీక్షిత(9), అనిత(40) మృతి చెందారు.16 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బాధితులంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు.
Also Read: Karnataka Road Accident: ట్రక్కును ఢీ కొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు- 8 మంది హైదరాబాద్ వాసులు మృతి