Karnataka Road Accident: కర్ణాటక కలబురగిలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఓ లారీని ఢీకొట్టి బస్సు బోల్తాపడగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 8 మంది మరణించినట్లు సమాచారం.
బీదర్-శ్రీరంగపట్టణం హైవేపై కమలాపుర వద్ద శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు గోవా నుంచి హైదరాబాద్ వస్తోంది. మృతులంతా హైదరాబాద్‌కు చెందినవారే. బస్సును ఆరెంజ్ కంపెనీకి చెందినదిగా గుర్తించారు.
ఇదే కారణం
కలబురిగి జిల్లా కమలాపురలో ప్రైవేటు బస్సు అటుగా వెళ్తున్న ఓ ట్రక్కుని ఢీకొట్టి కల్వర్టు పై నుంచి బోల్తా పడింది. బోల్తా పడిన సమయంలో డీజిల్ ట్యాంకు లీక్ అవడంతో తక్కువ సమయంలోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. దీంతో నలుగురు అక్కడిక్కడే సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మరో నలుగురు మృతి చెందారు. బస్సు గోవా నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
ప్రమాదంలో అర్జున్ (37), సరళ(32), బి.అర్జున్(5), శివకుమార్(35), రవళి(30), దీక్షిత(9), అనిత(40) మృతి చెందారు.16 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బాధితులంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు.
బర్త్‌డే వేడుకలు
హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అర్జున్ కూమార్తె బర్త్ డే వేడుకల కోసం స్నేహితులు, బంధువులంతా కలిసి గోవా వెళ్లారు. మే 29న వీరు గోవా వెళ్లి పార్టీ చేసుకున్నారు. అనంతరం గోవా నుంచి హైదరాబాద్ తిరిగి వస్తుండగా కర్ణాటకలో ఈ ప్రమాదం జరిగింది.
ఆరెంజ్ ట్రావెల్స్ వివరణ
బస్సు ప్రమాదంపై ఆరెంజ్ ట్రావెల్స్ వివరణ ఇచ్చింది. కల్వర్టును ఢీకొని బస్సు బోల్తా పడినట్లు తెలిపింది. రెండు ఎమెర్జెన్సీ విండోలు ఉండటంతో మృతుల సంఖ్య తగ్గినట్లు ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ అన్నారు.
మంత్రి సంతాపం
కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందే విధంగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Also Read: Priyanka Gandhi Corona Positive: కాంగ్రెస్‌లో కరోనా కలకలం- ప్రియాంక గాంధీకి కొవిడ్ పాజిటివ్
Also Read: LPG Cylinder Subsidy : సామాన్యులకు కేంద్రం భారీ షాక్, ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ తొలగింపు