Vemulavada Crime News: రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఓ భక్తురాలు గుండెపోటుతో మరణించింది. రాజరాజేశ్వర స్వామి దర్శనం కోసం మంగళవారం ఉదయం లైన్ లో నిలుచున్న మహిళ అక్కడే క్యూలైన్ లోనే కుప్పకూలింది. విషయం గుర్తించిన సిబ్బంది ఆమెను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


అసలేం జరిగిందంటే?


కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం లింగాపూర్ కు చెందిన ఓ మహిళ తన భర్త, కూతురితో కలిసి వేములవాడకు వచ్చింది. సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో మంగళవారం రోజు దర్శనం చేసుకుందామనుకున్నారు. సోమవారం రాత్రి ఆలయ ప్రాంగణంలోనే నిద్రించి తెల్లవారుజామున దర్శనం చేసుకోవాలని అనుకున్నారు. మంగళవారం ఉదయమే దర్శనానికి బయల్దేరారు. ఈక్రమంలోనే క్యూలైన్ లో నిలిచి ఉన్న మహిళ ఛాతిలో నొప్పితో ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. దీంతో ఆమె భర్తతో పాటు కూతురు చాలా కంగారు పడ్డారు. క్యూలైన్ లో ఉన్న మరికొంత మంది కూడా ఆందోళనకు గురయ్యారు. గమనించిన ఆలయ సిబ్బంది, వైద్య సిబ్బంది ఆమెను పరీక్షించగా.. అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది. దీంతో వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


ఇదే ఏడాది జనవరిలోనూ ఇలాంటి ఘటనే


కుటుంబ సభ్యులందరినీ తీసుకొని సంతోషంగా వేమలవాడ రాజన్న దర్శనం కోసం వచ్చాడు. కానీ దురదృష్టవశాత్తు ఫిట్స్ వచ్చి అక్కడికక్కడే చనిపోయాడు. ఏం చేయాలో పాలుపోని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. చివరకు మృతదేహాన్ని తీసుకొని సొంత గ్రామానికి వెళ్లిపోయారు. 


ఫిట్స్ వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిన భక్తుడు


వేములవాడ శ్రీరాజ రాజేశ్వర స్వామి వారి దర్శనార్థం సోమవారం నిజాంసాగర్ గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తి కుటుంబ సమేతంగా వచ్చాడు. అయితే వేములవాడకు చేరుకున్న తర్వాత అతనికి ఫిట్స్ వచ్చింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా కింద పడిపోయాడు. ఏం చేయాలో పాలుపోని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈవో కార్యాలయం ముందు పడిపోయి 30 నిమిషాల పాటు అలాగే ఉన్నాడు. వైద్యుల కోసం కుటుంబ సభ్యులు ఎంతగా వెతికినా లాభం లేకపోయింది ఈ క్రమంలోనే సాయిలు అక్కడే చనిపోయాడు. దీంతో చేసేదేం లేక మృతదేహాన్ని తీసుకొని కుటుంబ సభ్యులు తమ సొంత గ్రామానికి వెళ్లిపోయారు. వైద్యులు త్వరగా రాకపోవడం వల్ల సాయిలు చనిపోయినట్లు తెలుస్తోంది. అతనికి ఫిట్స్ వచ్చిన అరగంటకు కూడా వైద్యులు రాకపోవడంతో అతను మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. 


ఎప్పుడూ మూసే ఉంటున్న ప్రథమ చికిత్స కేంద్రం


అయితే గతంలో ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం ప్రథమ చికిత్స కేంద్రం ఏర్పాటు చేసిన విషయం తెలిసింది. కానీ ఎప్పుడూ అది మూసివేసే దర్శనమిస్తుందని స్థానిక భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆలయ ఉన్నత అధికారులు స్పందించి ప్రాథమిక చికిత్స కేంద్రం భక్తులకు ఉపయోగపడేలా అందుబాటులో తీసుకురావాలని కోరుతున్నారు. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో వైద్యుల సాయం చాలా అవసరం అని చెబుతున్నారు.