Telangana Application Form for Financial Assistance for BC Vocational Communities Registration Form
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బీసీ కులవృత్తులు, చేతి వృత్తులకు లక్ష రూపాయల ఆర్థికసాయం అందిస్తామని ఇటీవల కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోగా.. దరఖాస్తులు ప్రారంభించింది సర్కార్. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వారికి ఆర్థికసాయం పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 9వ తేదీన సంక్షేమ దినోత్సవం సందర్భంగా ఆ రోజు మంచిర్యాలలో సీఎం కేసీఆర్ బీసీ కులవృత్తులకు ఆర్థికసాయాన్ని లాంఛనంగా అందజేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు కులవృత్తులు చేసుకునే లబ్దిదారులకు ఆర్థికసాయం పంపిణీ చేస్తారు.
కేబినెట్ సబ్ కమిటీ
చేతివృత్తులు, కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నవారిని మరింత ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన కేబినెట్ కమిటీ ఏర్పాటు కావడం తెలిసిందే. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డి సభ్యులుగా ఉన్న ఈ సబ్ కమిటీ విశ్వబ్రాహ్మణులు, నాయి బ్రాహ్మణులు, రజకులు, మేదరి, కుమ్మరి తదితర వృత్తి కులాల వారికి ప్రోత్సాహకాలు అందించేలా విధివిధానాలు ఖరారు చేయాలని కేబినెట్ సబ్ కమిటీకి సీఎం ఆదేశించారు. ఈ సబ్ కమిటీ విధివిధానాలు ఖరారు చేస్తే దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పథకం అమలు చేయాలని సీఎం ఆదేశించారు.
కుల వృత్తులు, చేతివృత్తులు చేసుకునే వారికి రూ.1 లక్షల ఆర్థిక సాయం తెలంగాణ ప్రభుత్వం అందించనుండగా.. లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందకు వెబ్ సైట్ తీసుకొచ్చారు. అర్హులైన లబ్దిదారులు బీసీ సంక్షేమశాఖ వెబ్ సైట్ http://tsobmmsbc.cgg.gov.in/ లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెబ్సైట్ను సచివాలయంలో జరిగిన కార్యాలయంలో ప్రారంభించారు. కుల వృత్తులు చేసుకునే వారు ప్రభుత్వ నిబంధనల్ని పాటించి ఫొటో, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం ఆధారంగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. చేతివృత్తులు, కులవృత్తులు చేసుకునే వారికి అవసరమయ్యే పనిముట్లు, ముడిసరకు కొనుగోలు కోసం తెలంగాణ సర్కార్ లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించనుంది. బీసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ లో రూ.6,229 కోట్లను కేటాయించింది.
అప్లికేషన్ కోసం డైరెక్ట్ లింక్
బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు..
సంక్షేమ పథకాలలో భాగంగా రైతు బంధు పేరుతో రైతులకు నేరుగా పంట పెట్టుబడి సాయాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది. దళిత బంధు పథకంతో ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయంతో వారిని డెవలప్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. గీత కార్మికుల కష్టాన్ని గుర్తించిన బీఆర్ఎస్ ప్రభుత్వం వారి కోసం రూ.5 లక్షల పాలసీ తెచ్చింది. ఎవరైన కల్లు గీస్తూ ప్రమాదవశాత్తూ చనిపోతే ఆ కుటుంబసభ్యులకు ఈ ఆర్థిక సాయాన్ని అందజేస్తారు. రైతు చనిపోతే వారి కుటుంబసభ్యులకు రైతు బీమా పేరుతో ఐదు లక్షల నగదును అందించి అన్నదాత కుటుంబాన్ని ఆదుకుంటోంది ప్రభుత్వం.