తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి తుది మార్కుల వివరాల్లో అనుమానాలున్న అభ్యర్థులకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌లకు పోలీసు నియామక మండలి అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. జూన్ 1న ఉద‌యం 8 గంట‌ల నుంచి జూన్ 3న రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు దరఖాస్తులు స్వీకరించింది. వీటికి సంబంధించిన ఫలితాలను జూన్ 6న వెల్లడించింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ మొబైల్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు.


రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ ఫలితాల కోసం క్లిక్ చేయండి..


నియామక మండలి నిర్వహించిన అన్ని పరీక్షల్లో రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌లకు సంబంధించి 0.38 వినతులు మాత్రమే వచ్చాయి. అన్ని పరీక్షలకు కలిపి మొత్తం 3,55,387 జవాబు పత్రాలు ఉండగా వాటిలో కేవలం 1338 జవాబు పత్రాలకు సంబంధించి మాత్రమే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌ల దరఖాస్తులు అందాయి. వ్యాసరూప సమాధానాలకైతే కేవలం జవాబుపత్రంలో వేసిన మార్కులను లెక్కించనున్నారు. ఓఎమ్మార్ షీట్‌లో అయితే తప్పులు, ఒప్పులు, ఖాళీగా వదిలేసిన వాటిని పరిశీలించి, అభ్యర్థికి సమంజసమైన మార్కులే వచ్చాయా అన్నది పరిశీలిస్తారు. 



తెలంగాణలో మార్చి - ఏప్రిల్ మధ్య కాలంలో నిర్వహించిన ఎస్‌ఐ, కానిస్టేబుల్ పరీక్షల ఫలితాలు మే 31న విడుదలైన సంగతి తెలిసిందే. తుది రాత ప‌రీక్షల్లో 84.06 శాతం మంది అర్హత సాధించారు. ఫలితాలతోపాటు తుది రాత పరీక్ష ఫైనల్ 'కీ' ని కూడా అందుబాటులోకి వచ్చింది. తుది పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను మే 30న సాయంత్రమే ప్రకటించిన పోలీసు నియామక మండలి కొద్ది గంటల్లోనే ఫైనల్ కీని కూడా విడుదల చేసింది. తుది రాత ప‌రీక్ష రాసిన అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అయితే కానిస్టేబుల్, ఎస్‌ఐ ఫలితాలకు సంబంధించి అభ్యర్థులకు రీకౌంటింగ్, రీ వెరిఫికేష‌న్‌కు పోలీసు నియామక మండలి అవకాశం క‌ల్పించింది. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు రూ.2,000, ఇత‌ర క‌మ్యూనిటీలు, నాన్ లోకల్ అభ్యర్థులు రూ.3,000 చెల్లించి రీ కౌంటింగ్, రీవెరిఫికేష‌న్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.


ఎస్‌ఐ, కానిస్టేబుల్ మార్కుల వివరాలు, రెస్పాన్స్ షీట్ల కోసం క్లిక్ చేయండి..


తుది ఫలితాల్లో ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ సివిల్, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్, ప్రొహిబిష‌న్, ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు 98,218 (90.90 శాతం), ఎస్‌సీటీ ఎస్ఐ సివిల్ పోస్టుల‌కు 43,708 (75.56 శాతం), ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ ఐటీ అండ్ సీవో ఉద్యోగాల‌కు 4,564 (74.84 శాతం), ఎస్‌సీటీ ఎస్ఐ ఐటీ అండ్ సీవో పోస్టుల‌కు 729 (23.40 శాతం), ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ డ్రైవ‌ర్, డ్రైవ‌ర్ ఆప‌రేట‌ర్ ఉద్యోగాల‌కు 1,779 (89.53 శాతం), ఎస్‌సీటీ ఏఎస్ఐ ఎఫ్‌పీబీ ఉద్యోగాల‌కు 1,153 (77.54 శాతం), ఎస్‌సీటీ ఎస్ఐ పీటీవో ఉద్యోగాల‌కు 463 (79.97 శాతం), ఎస్‌సీటీ పీసీ మెకానిక్ పోస్టుల‌కు 238 (82.07 శాతం) మంది అర్హ‌త సాధించారు.


త్వరలో సర్టిఫికేట్ల పరిశీలన..


మరోవైపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా చేపట్టాలనే ప్రణాళికల్లో అధికారులు నిమగ్నమయ్యారు. మొత్తం 1.09 లక్షల మంది అభ్యర్థుల సర్టిఫికేట్లను పరిశీలించాల్సి ఉండటంతో ఒక్కో కేంద్రంలో రోజుకు సగటున 500-600 మంది అభ్యర్థులను పిలవాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ ప్రక్రియను 10-12 రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా జూన్‌ మూడో వారంనాటికి సర్టిఫికేట్ల పరిశీలన ఓ కొలిక్కివచ్చే అవకాశం ఉంది. త్వరలోనే షెడ్యూలు వెల్లడించే అవకాశం ఉంది.


శిక్షణకు వడివడిగా ఏర్పాట్లు..
తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ మెయిన్ పరీక్షల ఫలితాలు మే 30న వెలువడిన సంగతి తెలిసిందే. ఫలితాలు వెలువడటంతో అభ్యర్థులకు శిక్షణ దిశగా పోలీస్‌శాఖ కసరత్తు మొదలుపెట్టింది. తుది రాతపరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నేపథ్యం, నేరచరిత్ర గురించి ఆరా తీసి ఎంపికైన వారి తుది జాబితాను నెలాఖరులోపు వెలువరించే అవకాశం ఉంది. ఎంపికైన ఎస్‌ఐ అభ్యర్థులకు రాజా బహద్దూర్‌ వెంకట్రాంరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అకాడమీలో ఏడాదిపాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఇక కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి 9 నెలలపాటు శిక్షణ కోసం టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్‌ శిక్షణ కేంద్రాలు(బీటీసీలు), పోలీస్‌ శిక్షణ కళాశాలలు(పీటీసీలు), నగర శిక్షణ కేంద్రాల(సీటీసీలు) మైదానాల్ని వినియోగించేందుకు పోలీస్‌శాఖ సన్నాహాలు చేస్తోంది. ఐజీ తరుణ్‌జోషి నేతృత్వంలో ఇందుకు అవసరమైన ఏర్పాట్లలో శిక్షణ విభాగం నిమగ్నమైంది. జులైలో శిక్షణ ప్రారంభించే అవకాశాలున్నాయి.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...