Bandi Sanjay Sensational Comments : కేంద్రం రాష్ట్రాల మధ్య ఎప్పుడూ నడిచే వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కేంద్రం ఇచ్చే పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తమ స్కీమ్స్‌గా ప్రచారం చేసుకుంటోందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో పర్యటించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజలకు అందే కీలక పథకాలపై ప్రధానమంత్రి మోదీ ఫొటో వేయడం లేదని మండిపడ్డారు. అలాంటప్పుడు కేంద్ర నిధులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. 


Image


కేంద్రం అందిస్తున్న పథకాల్లో ముఖ్యమైంది రేషన్ బియ్యం. దీనికి సంబంధించిన కార్డులను మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే జారీ చేస్తుంది. ఈ జారీ ప్రక్రియలో మాత్రం చాలా రాష్ట్ర ప్రభుత్వాలు సీఎం ఫొటోలతో ముద్రిస్తుంటారు. ఇదే విషయంపై కేంద్రమంత్రి బండి సంజయ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ ఫొటోలు పెట్టకపోతే బియ్యం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. 



ఇప్పుడు తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకే ముందస్తుగా కేంద్రమంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఏ ఫొటో పెట్టుకున్న తమకు అభ్యంతరం లేదని కానీ ఈ పథకంలో ఎక్కువ నిధులు అందించే ప్రధానమంత్రి ఫొటో కచ్చితంగా ఉండాలని చెబుతున్నారు. లేకుంటే బియ్యం ఇవ్వడంపై పునరాలోచన చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చేశారు. 


Also Read: ఫార్ములా ఈ-కారు రేసు కేసు విచారణలో కీలక మలుపు-మరోసారి నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధం



రేషన్ కార్డుపై ప్రధానమంత్రి ఫొటో లేకపోతే మాత్రం నేరుగా ప్రజలకు ఈ బియ్యం అందించే ప్రక్రియపై ఆలోచన చేయాల్సి ఉంటుందని  కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. ఇప్పటికే చాలా వరకు పథకాలు నేరుగా కేంద్రమే ఇస్తోంది. ఇప్పుడు ఈ విషయంలో కూడా కేంద్రం పునారాలోచిస్తుందని స్పష్టం చేశారు కేంద్రమంత్రి బండి సంజయ్‌. 






ఈ రేషన్ కార్డు మాత్రమే కాకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం విషయంలో కూడా కేంద్రమంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పథకంలో కేంద్రం నిధులు ఇస్తుంటే ఇందిరమ్మ పేరు పెడతామంటూ చేస్తున్న ప్రచారన్ని తప్పుపట్టారు. కేంద్రం నిధులతో పార్టీ ప్రచారం చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రచారం జరుగుతున్నట్టు ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే మాత్రం కచ్చితంగా ఒక్క ఇంటిని కూడా మంజూరు చేసే ప్రసక్తి లేదని బండి సంజయ్‌ తేల్చి చెప్పేశారు.  



ఇవాళ కరీంనగర్‌లో పర్యటించిన కేంద్రమంత్రి బండి సంజయ్‌ సమక్షంలో పలువురు బీఆర్‌ఎస్ నేతలు బీజేపీలో చేరారు. కరీంనగర్ మేయర్ సునీల్‌రావుతోపాటు పలువు కార్పొరేటర్లు కాషాయ దళంలో చేరారు. ఈ టైంలో ఆయన పై కామెంట్స్ చేశారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎంపీగా తనను ఎలాంటి అధికారిక కార్యక్రమాలకు పిలువలేదని చెప్పారు బండి. కేంద్రం నుంచి వివిధ పథకాలకు నిధులు వస్తున్నా ఆ పథకాల ప్రారంభానికి కూడా తనను ఆహ్వానించలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏది ఉన్నప్పటికీ కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి కరీంనగర్ అభివృద్ధికి తన వంతు ప్రయత్నం చేస్తున్నట్టు వివరించారు.అందుకే ప్రజల్లో మార్పు వస్తోందని అన్నారు. తనను గెలిపిస్తూ వచ్చారని పేర్కొన్నారు. ఈసారి జరిగే కరీంనగర్‌ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌ నేతల మాదిరిగానే రేవంత్ రెడ్డి సర్కారు కూడా నడుచుకుంటోందని అన్నారు. 




Also Read: పోచారం మున్సిపాలిటీలో హైడ్రా కూల్చివేత‌లు.. ఆనందంలో కాలనీవాసులు