- రాజకీయ కుట్రల కోసం ఆడబిడ్డను వేదించడం సబబేనా
- మహిళలకు ప్రధాని మోదీ ఇచ్చే గౌరవం ఇదేనా
- తెలంగాణ జాగృతి కవితక్కపై కుట్రపూరితంగా వేదింపులు
- తెలంగాణ ఆడబిడ్డ జోలికొస్తే తెలంగాణ తెగువేంటో తెలుస్తుంది
- కవితపై కేంద్ర వేధింపుల్ని ఖండించిన మంత్రి గంగుల కమలాకర్


కేంద్రంలోని ప్రధాని మోదీ సర్కార్ రాజకీయ కక్ష సాదింపుల్ని చేస్తుందని, తెలంగాణ జాగృతికి ప్రతీకైన కల్వకుంట్ల కవితను విచారణ పేరుతో వేధింపులకు గురిచేయడం మోదీ నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్. బేటీ బచావ్, బేటీ పడావ్ అనే మోదీ.. ఇదేనా మహిళలకు ఇచ్చే గౌరవం అన్నారు. మహిళా దినోత్సవం రోజు (International Womens Day)న మహిళల పక్షాన పనిచేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను వేధించడం సబబేనా అని ప్రశ్నించారు. 


ప్రధాని మోదీ ప్రజా వ్యతిరేఖ విదానాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకత్వంపై రాజకీయ కుట్రతో దాడి చేయడంలో బాగంగా దర్యాప్తు సంస్థల్ని ఉసిగొల్పడం నీచమన్నారు. తక్షణమే ఇలాంటి నిరంకుశ పనులు మానుకోకపోతే తెలంగాణ సమాజం తన తెగువేంటో చాటిచెప్తుందని బీజేపీ అగ్రనాయకత్వానికి హితవు పలికారు మంత్రి గంగుల కమలాకర్. ఈ ఊడుత బెదిరింపులకు తెలంగాణ నాయకత్వం బయపడదని, కడిగిన ముత్యంలా బయటకొస్తుందని ఎమ్మెల్సీ కవితకు సంఘీబావం ప్రకటించారు మంత్రి గంగుల కమలాకర్. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.


పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ హామీ! ఢిల్లీకి కవిత
గురువారం తమ ఎదుట హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ అయిన అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో  సంప్రదించేందుకు ఎమ్మెల్సీ కవిత ప్రగతిభవన్‌కు వెళ్తారన్న ప్రచారం జరిగింది. అయితే ఆమె నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లిపోయారు. అంతకు ముందు .. ఎమ్మెల్సీ కవితతో కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడినట్లుగా బీఆర్ఎస్  పార్టీ వర్గాలుచెబుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఆందోళన చెందాల్సిన పని లేదని..  మహిళా రిజర్వేషన్ల కోసం చేస్తున్న పోరాటాన్ని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ధర్నాను యధావిధిగా కొనసాగించాలని కేసీఆర్ కవితకు సూచించినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 


ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు 
ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. 9న(గురువారం) విచారణకు రావాలని పేర్కొంది. ఇప్పటికే కవితను ఇదే కేసులో సీబీఐ ఓసారి విచారించింది. ఇప్పుడు ఈడీ విచారణ చేయనుంది. హైదరాబాద్‌ వ్యాపారి అరుణ్‌ రామచంద్ర పిళ్లైను మంగళవారం సుదీర్ఘంగా విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రాత్రి  అరెస్టును ప్రకటించింది. ఆయనను కోర్టులో హాజరుపరిచింది. ఆయనపై వేసిన రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు పెద్ద ఆరోపణలే చేశారు. 


పిళ్లై ఏకంగా కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బినామీ అని సీబీఐ స్పెషల్ కోర్టుకు నివేదించిన రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు రూ.100 కోట్ల మేర ముడుపులు ఇచ్చిన సౌత్‌ గ్రూప్‌ గుప్పిట్లో ఉన్న ఇండోస్పిరిట్స్‌ సంస్థలో ఎమ్మెల్సీ కవిత తరఫున అరుణ్‌ పార్టనర్‌గా ఉన్నారని ఆరోపించారు. ఈ కుంభకోణం మొత్తంలో అక్రమంగా సంపాదించిన సొత్తు దాదాపు రూ.296 కోట్లు ఉండవచ్చని ఈడీ అంచనా వేసింది. దీంట్లో కొంత సొమ్ముతో అరుణ్‌ రామచంద్ర పిళ్లై కొన్ని ఆస్తులు కొన్నారని అభియోగించింది.