Karimnagar News: మేనమామ భిక్షాటన చేస్తుండడం వల్లే తనకు పెళ్లి సంబంధాలు రావడం లేదని.. అతడిని హత్య చేశాడో యువకుడు. ఎవరికీ అనుమానం రాకుండా రైల్వే ట్రాక్ పక్కన మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయాడు. కానీ సీసీ టీవీలో రికార్డయిన దృశ్యాలు నిందితులను పట్టించగా.. ప్రస్తుతం యువకుడు ఊచలు లెక్కబెడుతున్నాడు. 


అసలేం జరిగిందంటే..?


పెద్దపల్లి డీసీప వైభవ్ గైక్వాడ్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఈనెల 4వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ట్రాక్ కు కొద్ది దూరంలో మృతదేహం పడి ఉండడం సందేహాలకు తావు ఇచ్చింది. రైలు నుంచి ప్రమాదవశాత్తు పడిపోయినా, దూకినా సమీపంలోనే పడిపోతాడని.. ట్రాక్ నుంచి 100 అడుగుల దూరంలో మృతదేహం ఉండడం, అనుమానాస్పదంగా కనిపించిన ఆటోను గుర్తించారు. సెంటినరీ కాలనీలోని సీసీ ఫుటేజీలోనూ అదే ఆటోను పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే మంగళవారం పెద్దపల్లి బస్టాండ్ సమీపంలో ఎస్సై రాజేశ్ వాహనాలు తనిఖీ చేస్తుండగా... అదే ఆటో కనిపించడం, పోలీసులు చూసిన వెంటనే డ్రైవర్ ఆందోళన చెందడంతోపాటు అనుమానాస్పదంగా వ్యవహరించాడు. దీంతో అతడిని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 


భిక్షాటన చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని..


రామగిరి మండలం సెంటినరీ కాలనీకి చెందిన చిప్పగుర్తి శివ ఆటో డ్రరైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. అతడి మేనమామ 50 ఏళ్ల మారుపాక రాయమల్లు స్థానికంగా చెప్పులు కుట్టడంతోపాటు భిక్షాటన చేసేవాడు. కాగా శివకు పెళ్లి సంబంధాలు రావడం లేదు. మేనమామ భిక్షాటన చేస్తుండడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని భావించిన శివరాం అతడి హత్యకు పథకం రచించాడు. ఈనెల 3వ తేదీన సెంటినరీ కాలనీలోనే రాయమల్లుపై దాడి చేసి ఆటోలో పెద్దపల్లికి తీసుకువచ్చారు. రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు ఎక్కువగా ఉండడంతో సమీపంలోని ఖాళీ స్థలానికి తీసుకెళ్లి కర్రతో రాయమల్లు తల, ఇతర శరీర భాగాలపై మరోసారి తీవ్రంగా కొట్టడంతో మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని శివ ట్రాక్ పక్కన పడేసి వెళ్లిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అంతరం చేపట్టిన విచారమలో హత్యగా గుర్తించి, నిందితుడు శివను అరెస్టు చేశారు. సమావేశంలో ఏసీపీ మహేష్, సీఐ ప్రదీప్ కుమార్, ఎస్సై రాజేశ్ ఉన్నారు. 


నిన్నటికి నిన్న రంగారెడ్డిలో వ్యక్తి హత్య


రంగారెడ్డి జిల్లా నార్సింగి జన్వాడలోని పెట్రోల్ బంక్ కు ముగ్గురు వ్యక్తులు కారులో వచ్చారు. అర్ధరాత్రి 12 గంటలు దాటిపోవడం, ముగ్గురు యువకులు మద్యం మత్తులో తూలుతుండటంతో పెట్రోల్ బంక్ సిబ్బంది, పెట్రోల్ లేదని చెప్పారు. అయితే తాము చాలా దూరం వెళ్లాలని కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు పెట్రోల్ బంక్ సిబ్బందిని బతిమాలాడారు. దీంతో బంక్ సిబ్బంది పెట్రోల్ పోశారు. ఆ తర్వాత డబ్బులు ఇచ్చే సమయానికి కార్డు పని చేయడం లేదంటూ ఆ ముగ్గురు వ్యక్తులు బుకాయించేందుకు ప్రయత్నించారు. కార్డు పని చేయకపోతే క్యాష్ ఇవ్వాలని బంక్ సిబ్బంది అడిగారు. 


మమ్మల్నే అడుగుతావా.. మాకే ఎదురుతిరుగుతావా అంటూ ఆ ముగ్గురు వ్యక్తులు పెట్రోల్ బంక్ క్యాషియర్ పై దాడికి దిగారు. తన తోటి సిబ్బందిని కొడుతుండటాన్ని చూసిన సంజయ్.. వాళ్లను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. క్యాషియర్ ను కొట్టవద్దని చెబుతూ వారిని అడ్డుకోబోయాడు. మాకే అడ్డు వస్తావా అంటూ ఆ ముగ్గురు కలిసి సంజయ్ ను విపరీతంగా కొట్టారు. పిడిగుద్దులతో ముఖంపై తీవ్రంగా దాడి చేశారు. వారు దాడిలో గాయపడ్డ సంజయ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సంజయ్ పడిపోవడాన్ని చూసిన ఆ ముగ్గురు వ్యక్తులు అక్కడి నుండి పారిపోయారు. ఇదంతా పెట్రోల్ బంక్ లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. బంక్ సిబ్బంది వెంటనే సంజయ్ ను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే సంజయ్ ప్రాణాలు కోల్పోయాడు.